‘మ్యాట్రిక్స్‌’ ప్రసాద్‌ రీఎంట్రీ | Nimmagadda Matrix Prasad Backed IQuest Enterprises To Acquire Viatris - Sakshi
Sakshi News home page

‘మ్యాట్రిక్స్‌’ ప్రసాద్‌ రీఎంట్రీ

Published Tue, Oct 3 2023 4:39 AM

Nimagadda Matrix Prasad backed IQuest Enterprises to acquire Viatris - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిమ్మగడ్డ ప్రసాద్‌.. మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన ప్రముఖ వ్యాపారవేత్త. ఖాయిలాపడ్డ మ్యాట్రిక్స్‌ ల్యా»ొరేటరీస్‌ను 2000 సంవత్సరంలో ఆయన కొనుగోలు చేశారు. ఆరేళ్లలోనే బిలియన్‌ డాలర్‌ కంపెనీగా తీర్చిదిద్దారు. అప్పట్లో స్టాక్‌మార్కెట్‌లో మ్యాట్రిక్స్‌ ఓ సంచలనం. కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించారు. ఫార్మా దిగ్గజం మైలాన్‌ ల్యాబ్స్‌ 2006లో మ్యాట్రిక్స్‌ను 1.1 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.

ఈ డీల్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిచయం ఎందుకంటే తాను ఏ అమెరికా కంపెనీకి అయితే 17 ఏళ్ల క్రితం మ్యాట్రిక్స్‌ను విక్రయించారో.. ఇప్పుడు అదే మైలాన్‌ (ప్రస్తుతం వియాట్రిస్‌) నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ తిరిగి ఆ వ్యాపారాన్ని  కైవసం చేసుకుంటున్నారు.  వియాట్రిస్‌కు చెందిన భారత ఏపీఐ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి నిమ్మగడ్డ ప్రసాద్‌ ప్రమోట్‌ చేస్తున్న ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైసెస్‌ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా పోటీపడి మరీ టెండర్లలో విజయం సాధించి వియాట్రిస్‌ ప్లాంట్లను ఐక్వెస్ట్‌ చేజిక్కించుకుంటోంది.

ఏటా రూ.6,000 కోట్లు..
తాజా డీల్‌ పూర్తి అయితే హైదరాబాద్‌లో మూడు, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో మూడు భారీ స్థాయి యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌ (ఏపీఐ) తయారీ ప్లాంట్లతోపాటు హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఐక్వెస్ట్‌ చేతికి రానున్నాయి. అలాగే థర్డ్‌–పార్టీ ఏపీఐ విక్రయాలు కూడా సంస్థ పరం కానున్నాయి. ఈ డీల్‌ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పట్టొచ్చని అంచనా. ఆరు ప్లాంట్ల వార్షికాదాయం సుమారు రూ.6,000 కోట్లు ఉంది.

ఈ ప్లాంట్లలో తయారైన ఉత్పత్తులను 10 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు వియాట్రిస్‌ అంగీకరించింది. రానున్న రోజుల్లో  హైదరాబాద్‌ కేంద్రంగా పెద్ద ఫార్మా కంపెనీగా ఆవిర్భవించనున్నట్టు ఐక్వెస్ట్‌ తెలిపింది.  కాగా, భారత్‌లో మహిళల ఆరోగ్య సేవల వ్యాపారాన్ని స్పెయిన్‌కు చెందిన ఇన్సడ్‌ ఫార్మాకు వియాట్రిస్‌ విక్రయిస్తోంది. ఐక్వెస్ట్, ఇన్సడ్‌ డీల్స్‌ ద్వారా వియాట్రిస్‌కు సుమారు రూ.10,000 కోట్లు సమకూరుతున్నాయి. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వియాట్రిస్‌ అంతర్జాతీయంగా వివిధ విభాగాల్లో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.29,950 కోట్లు అందుకుంటోంది.

ఇదే అతిపెద్ద పెట్టుబడి..
ఫార్మాస్యూటికల్‌ రంగంలో తమ కంపెనీ నుంచి ఇదే అతిపెద్ద పెట్టుబడి అని ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైసెస్‌ ఈడీ, నిమ్మగడ్డ ప్రసాద్‌ కుమార్తె గునుపాటి స్వాతి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారత్‌ గణనీయంగా దృష్టిని ఆకర్షిస్తున్న సరైన సమయంలో ఈ డీల్‌ కుదుర్చుకున్నట్టు చెప్పారు. కాగా, ఏఐజీ హాస్పిటల్స్, కేర్‌ హాస్పిటల్స్, సెలాన్‌ లే»ొరేటరీస్‌ తదితర సంస్థల్లో ఐక్వెస్ట్‌ ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్‌ గతంలో పెట్టుబడులు పెట్టి వీటి అభివృద్ధిలో పాలుపంచుకున్నారు.

సృజనాత్మక ఆలోచనలను విజయవంతమైన వ్యాపార వ్యూహాలుగా మార్చారు. కంపెనీలను వృద్ధి బాటలో నడిపించడంతోపాటు వాటాదారులకు మెరుగైన విలువను సృష్టించారు. 2012లో కేర్‌ హాస్పిటల్స్‌లో, 2015లో మా టీవీలో తనకున్న వాటాలను విక్రయించారు. మా టీవీని స్టార్‌ టీవీ సుమారు రూ.2,350 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో మీడియా రంగంలో సంచలనం కలిగించింది.

Advertisement
Advertisement