PVR Inox net loss more than triples to Rs 333.37 crore in Q4 - Sakshi
Sakshi News home page

ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్‌?

Published Tue, May 16 2023 9:05 AM

Pvr Inox Net Loss More Than Triples To Rs 333.37 Crore In Q4 - Sakshi

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్‌ ఐనాక్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 536 కోట్ల నుంచి రూ. 1,143 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో పీవీఆర్, ఐనాక్స్‌ విలీనమై పీవీఆర్‌ ఐనాక్స్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి విలీనం అమల్లోకి వచ్చింది. వెరసి అంతక్రితం ఏడాది క్యూ4తో తాజా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 1,364 కోట్లను దాటాయి.

ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం రూ. 336 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 3,751 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. రెండు సంస్థలూ కలిపి గతేడాది 168 కొత్త తెరలను ఆవిష్కరించాయి.  ఫలితాల నేపథ్యంలో పీవీఆర్‌ ఐనాక్స్‌ షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం బలపడిరూ. 1,464 వద్ద ముగిసింది. 

50 స్క్రీన్లను మూసేస్తున్న
కాగా, మల్టీప్లెక్స్‌ చైన్‌ కంపెనీ పీవీఆర్‌ ఐనాక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్‌ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్‌? అదేంటంటే? 

Advertisement
Advertisement