మార్కెట్‌ ‘మండే’న్‌! | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ‘మండే’న్‌!

Published Tue, Dec 7 2021 4:45 AM

Share Market: Sensex Tanks 949 Points To Close At 56 747 Nifty Nosedives To End At 16 912 - Sakshi

ముంబై: ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు దేశీయంగానూ నమోదుకావడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. ఈ కొత్త రకం వేరియంట్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో మార్కెట్లో విస్తృతంగా విక్రయాలు జరిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 57వేల స్థాయిని కోల్పోయి 949 పాయింట్ల నష్టంతో 56,747 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 284 పాయింట్లు క్షీణించి 17వేల దిగువున 16,912 వద్ద ముగిసింది. ఈ ముగింపులు సూచీలకు మూడు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం.

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 33 పైసల పతనం, ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. డాలర్‌ బలపడటం, యూఎస్‌ నాస్‌డాక్‌ ఇండెక్స్‌ పతన ప్రభావంతో దేశీయ ఐటీ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద మొత్తంలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లను విక్రయిస్తుండటంతో ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

నవంబర్‌ కార్ల విక్రయాలు క్షీణించడంతో ఆటో షేర్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లన్నీ నష్టాన్ని చవిచూశాయి. నిఫ్టీ–50 ఇండెక్స్‌లో ఒక్క యూపీఎల్‌ షేరు మాత్రమే లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌ ఇండెక్స్‌లు ఒకటిన్నరశాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,361 కోట్ల షేర్లను అమ్మేయగా.., విదేశీ ఇన్వెస్టర్లు రూ.1702 కోట్ల షేర్లను కొన్నారు.  

ఒక్కరోజులోనే రూ.4.29 లక్షల కోట్ల ఆవిరి 
ఆరంభంలో మినహా ట్రేడింగ్‌ ఆసాంతం అమ్మకాల సునామీ జరగడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.4.29 లక్షల కోట్లను కోల్పోయారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.256 లక్షల కోట్లకు దిగివచ్చింది. స్టాక్‌ మార్కెట్‌ పతనంతో గడిచిన మూడువారాల్లో ఇన్వెస్టర్లు రూ.15 లక్షల కోట్లను నష్టపోయినట్లు బీఎస్‌ఈ ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. 

‘‘కోవిడ్‌ కొత్త కేసులు పెరుగుదల భయాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను వెంటాడాయి. ఆర్‌బీఐ పాలసీ కమిటీ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాల(పారిశ్రామికోత్పత్తి, రీటైల్‌ ద్రవ్యోల్బ ణం) విడుదల నేపథ్యంలో స్వల్పకాలం పాటు సూచీల ఒడుదుడుకులు కొనసాగొచ్చు. ప్రస్తుతం సాంకేతికంగా నిఫ్టీ 16,400 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఒకవేళ షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగితే 16,800 –16,700 శ్రేణిలో తక్షణ నిరోధ స్థాయిని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

ఇంట్రాడేలో 1008 పాయింట్లు క్రాష్‌  
స్టాక్‌ మార్కెట్‌ ఉదయం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 57,778 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,209 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత స్వల్పంగా ర్యాలీ చేసినప్పటికీ.., జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలతో విక్రయాలు వెల్లువెత్తాయి.

తొలి అరగంట మినహా ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1008 పాయింట్లు కోల్పోయి 56,687 వద్ద, నిఫ్టీ 305 పాయింట్లు క్షీణించి 16,892 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
మొబైల్‌ టారీఫ్‌ల పెంపుతో వొడాఫోన్‌ ఐడియా షేరు మరో రోజూ ర్యాలీ చేసింది. నాలుగు శాతం లాభంతో రూ.15 వద్ద స్థిరపడింది.  
షేర్ల విభజన నిర్ణయానికి ముందు జేఎండబ్ల్యూ 11% పెరిగి రూ.1153 వద్ద ముగిసింది.  
ఔషధాల తయారీకి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకోవడంతో మోర్‌పెన్‌ ల్యాబ్స్‌ 10% ఎగిసి రూ.58.05 వద్ద నిలిచింది.  

వణికించిన ఒమిక్రాన్‌  
దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 21కి చేరుకోవడం స్టాక్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ కొత్త రకం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ దేశంలో థర్డ్‌ వేవ్‌కు దారి తీయవచ్చని శాస్త్రవేత్తల అంచనాలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ఈ వేరియంట్‌ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ అనిశ్చితికి చేరుతుందనే ఆందోళనలతో అమ్మకాలు వెల్లువెత్తాయి.  

విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు 
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో సెంటిమెంట్‌ బలహీనపడింది. గతవారంలో ఎఫ్‌ఐఐలు రూ.15,809 కోట్లను విక్రయించారు. ఒమిక్రాన్‌ పరిణామాలు, అధిక వాల్యూయేషన్లు, ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు దిశగా యోచనలు చేస్తుండటంతో ఎఫ్‌ఐఐలు భారత్‌ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో దేశీ సంస్థాగత సంస్థలు(డీఐఐలు) రూ.16,450 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం ఊరటనిస్తోంది. 

ఆర్‌బీఐ పాలసీ ముందు అప్రమత్తత: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్ష సోమవారం ప్రారంభమైంది. కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌బుధవారం (రేపు) వెల్లడించనున్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడంతో యథాతథ పాలసీ విధానానికే కమిటీ కట్టుబడి ఉండొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఆర్థిక వృద్ధిపై ఆర్‌బీఐ వైఖరి వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్తత చోటుచేసుకుంది. 

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు  
చైనా రియల్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే డిఫాల్ట్‌ భయాలు మరోసారి తెరపైకి రావడంతో ఈ షేరు 20% క్షీణించింది. ఫెడరల్‌ రిజర్వ్‌ అంచనాలకంటే ముందుగానే ఉద్దీపనల ఉపసంహరణ(ఫెడ్‌ ట్యాంపరింగ్‌) ఉండొచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియాలో చైనా, హాంకాంగ్, జపాన్, థాయిలాండ్, సింగపూర్‌ మార్కెట్లు రెండుశాతం నుంచి ఒకశాతం క్షీణించాయి. యూరప్‌ మార్కెట్లు ఆరంభ నష్టాలను పూడ్చుకొని అరశాతం స్వల్ప లాభంతో గట్టెక్కాయి. యూఎస్‌ ఫ్యూచర్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 

Advertisement
Advertisement