కస్టమర్లకు సైలెంట్‌ షాకిచ్చిన స్విగ్గీ!

23 Jan, 2024 19:16 IST|Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ దగ్గజం స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. స్విగ్గీని వినియోగిస్తూ ఫుడ్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్న కస్టమర్ల నుంచి ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలను వసూలు చేస్తుంది. తాజాగా ఆ ఛార్జీలను పెంచుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ప్రస్తుతం స్విగ్గీ ఎక్కువ మంది యూజర్ల నుంచి ఆర్డర్‌ను బట్టి రూ.3 ప్లాట్‌ఫామ్‌ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే, పెరిగిపోతున్న డెలివరీలను దృష్టిలో ఉంచుకుని ఆదాయాన్ని గడించేందుకు కొత్త వ్యాపార ఎత్తుగడలు వేస్తోంది. 

ఇందులో భాగంగా రూ.10 ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే ఆర్డర్‌ చేసిన తర్వాత బిల్లులో ప్లాటఫామ్‌ ఛార్జీ రూ.10 చూపిస్తుంది. డిస్కౌంట్‌ ఇస్తున్నామంటూ రూ.5 మాత్రమే వసూలు చేస్తుంది. రానున్న రోజుల్లో దీనిని పది రూపాయలకు పెంచే యోచనలో ఉందని, కాబట్టే బిల్లులో ఇలా చూపిస్తుందని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు.  

ఈ సందర్భంగా స్విగ్గీ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఫ్లాట్‌ఫామ్‌ ఫీజుల్ని పెంచే ఉద్దేశం లేదన్నారు. కాకపోతే కస్టమర్లను అర్ధం చేసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఇది కూడా ఓ భాగమేనని అన్నారు. 

జనవరి 1న,జొమాటో వినియోగదారుల నుంచి ప్లాట్‌ఫారమ్‌ రూ.3 నుండి రూ.4 పెంచిందని ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదించింది. ఈ కొత్త ఏడాది సందర్భంగా ఎంపిక చేసిన కస్టమర్లకు తాత్కాలికంగా ప్లాట్‌ఫారమ్‌ ఛార్జీలను కొన్ని ప్రాంతాల్లో ఆర్డర్‌కు రూ.9 వసూలు చేసింది. స్విగ్గీ గత ఏడాది ఏప్రిల్‌లో ఫ్లాట్ ప్లాట్‌ఫారమ్ రుసుమును వసూలు చేయడం ప్రారంభించగా జొమాటో ఆగస్టు నుంచి ప్రారంభించింది. రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఆర్డర్‌కు రూ.2 రుసుముతో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు స్విగ్గీ మరోమారు ప్లాట్‌ఫారమ్‌ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. 

>
మరిన్ని వార్తలు