నేటి నుంచి 3 ఐపీవోలు

7 Feb, 2024 07:40 IST|Sakshi

జాబితాలో రాశి పెరిఫెరల్స్‌

జానా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

ఏపీజే సురేంద్ర పార్క్‌ ఇష్యూ 9న

న్యూఢిల్లీ: నేటి(బుధవారం) నుంచి మూడు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం(9న) ముగియనున్న ఇష్యూల జాబితాలో రాశి పెరిఫెరల్స్, జానా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఉమ్మడిగా సుమారు రూ. 1,700 కోట్లు సమీకరించనున్నాయి. ప్రస్తుతం ద పార్క్‌ బ్రాండ్‌తో హోటళ్లను నిర్వహిస్తున్న ఏపీజే సురేంద్ర పార్క్‌ రూ. 920 కోట్లు అందుకునేందుకు పబ్లిక్‌ ఇష్యూకి తెరతీసిన సంగతి తెలిసిందే. వీటికి అదనంగా ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ ఈ నెల 9న ఐపీవోకు రానుంది. తద్వారా రూ. 1,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈ బాటలో గత నెలలోనూ ఐదు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ ద్వారా ఉమ్మడిగా రూ. 3,266 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం!

రాశి వివరాలిలా..
ఐపీవోలో భాగంగా ఐటీ, కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ ప్రొడక్టుల పంపిణీ సంస్థ రాశి పెరిఫెరల్స్‌ పూర్తిగా ఈక్విటీ జారీని చేపట్టనుంది. మొత్తం రూ. 600 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడం ద్వారా అంతేమేర నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు రూ. 295–311 ధరల శ్రేణిని ప్రకటించింది. ఐపీవో నిధులలో రూ. 326 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 220 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది.

జానా స్మాల్‌ తీరిదీ
పీఈ దిగ్గజాలు టీపీజీ, మోర్గాన్‌ స్టాన్లీలకు పెట్టుబడులున్న జానా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీవో ద్వారా రూ. 462 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 108 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మొత్తం రూ. 574 కోట్ల సమీకరణపై కన్నేసిన కంపెనీ రూ. 393–414 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్‌ అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు, కనీస మూలధన నిష్పత్తి మెరుగుకు వినియోగించనుంది.

క్యాపిటల్‌ స్మాల్‌ రెడీ
ఐపీవోలో భాగంగా క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 73 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా రూ. 523 కోట్లు అందుకోనుంది. ఇందుకు రూ. 445–468 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్‌ అవసరాలరీత్యా టైర్‌–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega