Russia Ukraine War Impact On World Food Crisis Experts Are Warning The Nations - Sakshi
Sakshi News home page

బ్రెడ్డుపై బాంబు! ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం

Published Tue, Mar 8 2022 8:41 AM

Ukraine Russia War Leads to World Food Crisis Experts are Warning the nations - Sakshi

నల్లసముద్ర తీరప్రాంతం.. ప్రపంచ బ్రెడ్‌ బాస్కెట్‌గా పేరుగాంచింది. నల్ల సముద్ర పరిసర ప్రాంతాల నేలలు అత్యంత సారవంతమైనవి. యూరప్, ఆసియా, ఆఫ్రికాల్లో అధికశాతం బ్రెడ్స్, నూడుల్స్, పశువుల దాణా ఉత్పత్తి ఇక్కడ పండే గోధుమలు, బార్లీతో జరుగుతోంది. కానీ ఇదంతా గతంలా మారుతోందని, ఉక్రెయిన్‌పై దాడితో ప్రపంచ బ్రెడ్‌ బాస్కెట్‌ తీవ్రంగా నష్టపోనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లసముద్ర తీరప్రాంత దేశమైన ఉక్రెయిన్‌లో రైతులు ఇప్పుడు పొలం పనులు మానేసి కదనరంగంలోకి దూకుతున్నారు. దీంతో ఇక్కడి నేలల నుంచి వచ్చే ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గబోతోంది. మరోవైపు యుద్ధం కారణంగా పలు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు మూతపడడంతో ఆహార సరఫరా వ్యవస్థకు అంతరాయాలు కలుగుతున్నాయి. మరోవైపు పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల ప్రభావంతో సారవంతమైన రష్యా నేలల్లో పండే పంట కూడా వృథా కానుంది. ఇవన్నీ అంతిమంగా మానవాళికి ఆహార సమస్యను తెచ్చిపెట్టే సంక్షోభంగా మారుతున్నాయని ఆహార నిపుణులు ఆందోళన చెందుతున్నారు.  

55 శాతం పెరిగిన ధరలు 
యుద్ధం కారణంగా ఆహారపదార్థాల ధరల్లో పెరుగుదల ప్రపంచమంతా కనిపిస్తోంది. కొన్ని చోట్ల యుద్ధం కారణంగా పలు నిత్యావసరాల ధరలు 55 శాతం మేర పెరిగాయని గణాంకాలు చూపుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే జూలైలో ఉక్రెయిన్, రష్యా నుంచి గోధుమల ఎగుమతి తగ్గిపోతుందని, దీనివల్ల యూరప్‌లోని చాలా దేశాలకు ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ తృణధాన్యాల సమాఖ్య డైరెక్టర్‌ ఆర్నాడ్‌ పెట్టిట్‌ హెచ్చరించారు. ఇక ఈజిప్‌్ట, లెబనాన్‌ లాంటి దేశాల్లోనైతే ఆహార కొరత తీవ్ర స్థాయికి చేరవచ్చని,  ప్రజలు ఆకలి చావుల బారిన పడవచ్చని చెప్పారు. ఇప్పటికే యూరప్‌ దేశాలు ఉక్రెయిన్‌ గోధుమల కొరతను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాయి. ప్రపంచంలో అతిపెద్ద గోధుమ దిగుమతిదారైన ఈజిప్టుపై యుద్ధ ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈజిప్టులో బ్రెడ్‌పై ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. కానీ గోధుమల ధరలు ఆకాశాన్నంటితే ప్రభుత్వం ఎంతమేరకు భరించగలదోనన్న అనుమానాలున్నాయి. కెన్యా, నైజీరియాల్లాంటి అల్పాదాయ దేశాల పరిస్థితి ఇక చెప్పనలవికాదు. ఆఫ్రికా, యూరప్‌ దేశాలు దిగుమతులపై  ఆధారపడటం సంక్షోభానికి దారి  తీయనుంది. 

ఎందుకీ ప్రాముఖ్యత 
- ప్రపంచ గోధుమ, బార్లీ ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్‌ ఉమ్మడి వాటా మూడింట ఒక వంతు ఉంటుందని అంచనా.  
- ప్రపంచంలో మొక్కజొన్న ప్రధాన     ఎగుమతిదారు ఉక్రెయిన్‌. 
- ఇక పొద్దుతిరుగుడు పువ్వు నూనె ఉత్పత్తిలో ఉక్రెయిన్‌ అంతర్జాతీయంగా ప్రథమ స్థానంలో ఉంది.  
-  ప్రపంచ పొద్దుతిరుగుడు పువ్వు నూనె  ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్‌ వాటా     75 శాతం కన్నా అధికం. 
- ఇండోనేసియాకు గోధుమల ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్‌ది రెండో స్థానం.  
- ఉక్రెయిన్‌ మొక్కజొన్న ఉత్పత్తిలో 60 శాతం యూరప్‌కు ఎగుమతి అవుతుంది. 
- యూరప్‌ సహజవాయువు అవసరాల్లో 40 శాతాన్ని రష్యా తీరుస్తోంది.

చదవండి: క్రూడ్‌ షాక్‌... రూపీ క్రాష్‌!!

Advertisement
Advertisement