Sakshi News home page

ఎంత అమానవీయం.. అంబులెన్స్‌లో డీజిల్‌ లేదు...రూ. 800 ఇస్తేనే తీసుకెళ్తానన్న డ్రైవర్‌.. రోగి మృతి

Published Tue, Aug 1 2023 10:48 AM

Ambulance Driver Refused to Patient Over Diesel Money Banswada - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: మెరుగైన చికిత్స కోసం ఓ రోగిని బాన్సువాడ నుంచి నిజామాబాద్‌కు తరలించారు. అయితే డీజిల్‌కు డబ్బులు ఇవ్వలేదని అంబులెన్స్‌ డ్రైవర్‌ రోగిని తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందిన ఘటన బాన్సువాడ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్‌ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు (40) వాంతులు, విరోచనాలతో మూడురోజుల క్రితం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు.

సోమవారం తెల్లవారుజామున సాయిలుకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న వైద్యుడు పరిస్థితి గమనించి నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించాలని సాయిలు కుమారుడికి సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్స్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేసి పిలిపించారు. అయితే డ్రైవర్‌ అంబులెన్స్‌లో డీజిల్‌ లేదని...రూ.800 ఇవ్వాలని సాయిలు కుమారుడికి చెప్పాడు. తన వద్ద రూ.50 ఉన్నాయని, ఎలాగైనా తన తండ్రిని నిజామాబాద్‌కు తీసుకెళ్లాలని అంబులెన్స్‌ డ్రైవర్‌ను ప్రాధేయపడ్డాడు.

డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పి అంబులెన్స్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. సాయిలు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై, అంబులెన్స్‌ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో కొత్తకొండ భాస్కర్, కాసుల బాల్‌రాజ్, గుడుగుట్ల శ్రీనివాస్, ఖలేక్, హన్మాండ్లు, మంత్రి గణేశ్, రాజాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: లవ్‌ ఫెయిల్యూర్‌.. ప్రేమికురాలితో ఫోన్‌లో మాట్లాడుతూనే

Advertisement

What’s your opinion

Advertisement