Sakshi News home page

చంద్రబాబుకు నో రిలీఫ్‌..!

Published Thu, Sep 28 2023 12:50 AM

CJI Justice Chandrachud refusal for Chandrababu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినకుండా ట్రయల్‌ జడ్జిని తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబుకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ కేసును తగిన ధర్మా­సనం ముందు జాబితా చేస్తా­మని, అక్టోబరు 3న దీన్ని విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి తనపై దాఖలైన కేసును కొట్టివే­యా­లని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌­ఎల్‌పీ బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌­వీ­ఎన్‌ భట్టి ధర్మాసనం ముందుకొచ్చింది.

అయితే ఈ పిటిషన్‌ విచారణపై జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టికి కొన్ని రిజర్వేషన్లు (అభ్యంతరాలు) ఉన్నాయని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా పేర్కొన్నారు. దీంతో జస్టిస్‌ భట్టి నిర్ణయంపై తామేమీ చేయలేమని, కేసును త్వరగా జాబితా చేయాలని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే కోరారు. వచ్చే వారం జాబితా చేస్తామని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా పేర్కొనడంతో, జస్టిస్‌ భట్టి విచారణ నుంచి వైదొలిగిన అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు మరో సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అనుమతి కోరారు.

ఇందుకు అనుమతించిన జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా కేసును పాస్‌ ఓవర్‌ చేయాలా? అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు.  పాస్‌ ఓవర్‌తో ఉపయోగం ఉండదని, సోమవారం జాబితా చేయాలని హరీశ్‌ సాల్వే అభ్యర్థించారు. అది సాధ్యం కాదని, వచ్చే వారం జాబితా చేస్తామని, ప్రాసెస్‌కు కొంత సమయం పడుతుందని జస్టిస్‌ ఖన్నా స్పష్టం చేశారు. జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి లేని ధర్మాసనంలో అక్టోబరు 3న ప్రారంభయ్యే వారంలో కేసును జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. 

అలాంటి ఆదేశాలు ఇవ్వలేం.. ట్రయల్‌ కోర్టు జడ్జిని నియంత్రించలేం: సీజేఐ
చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి నిరాకరించారని, దీనిపై వెంటనే విచారణ జరిగేలా చూడాలని అనంతరం సీజేఐ ధర్మాసనం ఎదుట సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అభ్యర్థించారు. అయితే ఈ అంశంలో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని, వెంటనే విచారణ వద్దని సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ విన్నవించారు.

ఈ దశలో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘అసలు మీకేం కావాలి? సెక్షన్‌ 17ఏతో బెయిలు కావాలని కోరుతున్నారా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఎస్సెల్పీపై విచారణ జరపాలని లూత్రా కోరారు. అయితే బెయిలు కావాలని దరఖాస్తు చేసుకోవచ్చుగా? అని సీజేఐ సూచించారు. దీనిపై లూత్రా స్పందిస్తూ ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, 17 ఏ సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. దీంతో అక్టోబరు 3న విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తెలిపారు.

సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను ట్రయల్‌ కోర్టు విచారిస్తోందని, చంద్రబాబును వారి కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని లూత్రా కోరారు. ఇప్పటికే పోలీసు కస్టడీ పూర్తయిందని, మరో 15 రోజులు పోలీసు కస్టడీ కోరుతున్నారని ఎన్నికల నేపథ్యంలో పదే పదే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని లూత్రా ఆరోపించారు.

తొలుత జ్యుడీషియల్‌ కస్టడీ తర్వాత పోలీసు కస్టడీకి ఇచ్చారన్నారు. ఈ క్రమంలో లూత్రా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఈ దశలో అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని, ట్రయల్‌ కోర్టు జడ్జిని నియంత్రించలేమని, అక్టోబరు 3నే విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తేల్చి చెప్పారు.

దర్యాప్తు కొనసాగేలా చూడాలి: రంజిత్‌కుమార్‌
ఇదే సమయంలో సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ స్పందిస్తూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని సీజేఐ దృష్టికి తెచ్చారు. రూ.3,330 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పది శాతం మాత్రమే వెచ్చిస్తుందంటూ నిధులు విడుదల చేశారన్నారు. ప్రైవేట్‌ సంస్థ 90 శాతం నిధులను ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా పది శాతం నిధులు చేతులు మారిపోయాయన్నారు.

సొమ్ములు స్వాహా అయినట్లు జీఎస్టీ అధికారులు కూడా గుర్తించారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంతో గత ప్రభుత్వం ఫైళ్లు మాయం చేసిందన్నారు. ముందస్తుగా గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని పిటిషనర్‌ వాదించడం సరి కాదన్నారు. ఆ చట్ట సవరణ కన్నా ముందుగానే ఈ కుంభకోణం జరిగిందన్నారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు. 

Advertisement

What’s your opinion

Advertisement