‘ధరణి’ పోర్టల్‌లో దొంగలు పడ్డారు! | Sakshi
Sakshi News home page

‘ధరణి’ పోర్టల్‌లో దొంగలు పడ్డారు!

Published Fri, Dec 8 2023 3:14 AM

Massive Land Scandal in Rangareddy district - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో దొంగలు పడ్డారు. జిల్లా కలెక్టర్‌ సహా తహసీల్దార్లంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా.. సదరు వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్న ఇద్దరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 11 మధ్య రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ తంతులో భారీగా భూములు చేతులు మారినట్లు తెలుస్తోంది.

కలెక్టర్‌ పరిశీలన, అనుమతి లేకుండా దరఖాస్తులకు ఆమోదం (డిజిటల్‌ సంతకంతో) తెలిపినట్లు సమాచారం. ఇలా నిషేధిత జాబితాలో ఉన్న 98 దరఖాస్తులను ఈ తరహాలో జాబితా నుంచి తొలగిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ అంశంపై పోలీసులు కూడా విచారణ ప్రారంభించినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నడిపిన ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన ఇద్దరు ఉద్యోగులకు ఇంటిదొంగలు ఎవరైనా సాయపడ్డారా? ఈ భూ బాగోతంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. 

28 రోజుల్లో 98 దరఖాస్తులకు ఆమోదం
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్‌ అక్టోబర్‌ 11న వేటు వేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్తగా భారతీ హోళికేరి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా ఆమె బిజీగా మారారు. ధరణి పోర్టల్‌కు వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టి.. పూర్తిగా ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించారు.

ఇదే అదనుగా భావించిన ధరణి సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. జిల్లాలో పలు చోట్ల ఉన్న భూదాన్‌ భూములను పట్టా భూములుగా మారుస్తూ ఆమోదముద్ర వేసినట్లు తేలింది. నిజానికి ఏదైనా ధరణి దరఖాస్తును ఆమోదించాలన్నా.. తిరస్కరించాలన్నా.. క్షేత్రస్థాయి రిపోర్టులే కీలకం. కానీ అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 11 మధ్యన ఎలాంటి రిపోర్టులు లేకుండానే సుమారు వంద అర్జీలకు ఆమోదం లభించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం
కోర్టు కేసులు, అసైన్డ్, భూదాన్, మ్యూటేషన్లు, పాసు పుస్తకాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన వివాదాస్పద భూ సమస్యల అప్లికేషన్లకు పోర్టల్‌లో ఆమోదం రావడంపై కొందరు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఇంటి దొంగలే ఈ ఉదంతానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్‌ మహేశ్‌లను సస్పెండ్‌ చేశారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇందులో కేవలం సమన్వయకర్త, ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉందా? లేక జిల్లా ఉన్నతాధికారులు, ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement