ఏలూరు మురళీకృష్ణ ఆసుపత్రికి నోటీసులు | Sakshi
Sakshi News home page

కరోనా రా‘కాసులు’

Published Mon, Aug 24 2020 9:11 AM

Medical Officers Issued Notice To Eluru Murali Krishna Hospital - Sakshi

ఏలూరు టౌన్‌: కరోనా చికిత్సలో ప్రైవేటు, కార్పొరేటు దోపిడీ పెచ్చుమీరుతోంది. ప్రభుత్వ కోవిడ్‌ ఆస్పత్రులకు వెళ్లకుండా కరోనా రోగులు ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తూ జేబులు గుల్లచేసుకుంటున్నారు. ఆ ఆస్పత్రులు కనీసం వెంటిలేటర్‌ లేకుండానే రోజుకు రూ.వేలల్లో బిల్లులు వేస్తూ వారంలో రూ.లక్షలు వసూలు చేస్తూ రోగులను నిండా ముంచేస్తున్నాయి. ఏలూరు నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లోనూ అనధికారికంగా కోవిడ్‌ చికిత్సలు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మాత్రం ఈ విషయాలేవీ పట్టనట్లు వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు నగరంలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, రైట్‌ ల్యాబ్‌ల్లో జరుగుతున్న అక్రమాలు జిల్లాలోని పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు సీరియస్‌ కావటంతో అధికారులు అప్రమత్తమై మురళీకృష్ణ హాస్పిటల్, రైట్‌ల్యాబ్‌లను సీజ్‌ చేయటంతోపాటు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

రూ.లక్షల్లో వసూళ్లు 
ఏలూరు నగరానికి చెందిన 60ఏళ్ల వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. వారంపాటు చికిత్స అందించి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఇంటికి పంపించివేశారు. మళ్ళీ నాలుగురోజులకే అస్వస్థతకు గురికాగా ఇదేమిటని డాక్టర్‌ను ప్రశ్నించగా కరోనా మరోసారి వచ్చిందంటూ చెప్పి తప్పించుకున్నారు. ఆమెను మరో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. నగరానికి చెందిన ఒక యువకుడు తన స్నేహితుడ్ని మురళీకృష్ణ హాస్పిటల్‌లో చేర్పించగా రోజుకు రూ.35వేలు చొప్పున చెల్లించాలని చెప్పి, ముందుగా రూ.లక్ష అడ్వాన్స్‌ తీసుకున్నారు. మరుసటి రోజే ర్యాపిడ్‌ టెస్టులో నెగిటివ్‌ రావటంతో ఇంటికి వెళ్తానని చెప్పినా వినకుండా సిటీస్కాన్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉందని తేలిందంటూ నాలుగు రోజులు చికిత్స చేసి రూ.2.50 లక్షలు వసూలు చేశారు.  

ప్రైవేటు చేతికి ప్రభుత్వ టెస్టు కిట్లు ?  
ఏలూరు నగరంలోని ఆర్‌ఆర్‌పేటలో రైట్‌ ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ రూ.వేలల్లో దోచుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సునంద ఆకస్మిక తనిఖీలు చేసి, అక్రమాలు జరుగుతున్నాయనే నిర్ధారణతో ల్యాబ్‌ను సీజ్‌ చేశారు. రైట్‌ ల్యాబ్‌లో కోవిడ్‌–19 యాంటీజెన్‌ ర్యాపిడ్‌ కిట్లు లభించటం అక్రమాలు జరుగుతున్నాయనేందుకు సాక్ష్యంగా మారింది. ప్రభుత్వ హాస్పిటల్‌లో కరోనా పరీక్షలకు వినియోగించే యాంటీజెన్‌ ర్యాపిడ్‌ టెస్టు కిట్లు అక్రమ మార్గంలో ప్రైవేటు ల్యాబ్‌లకు చేరుతున్నాయి. ల్యాబ్‌లో కరోనా పరీక్ష చేసినందుకు ఏకంగా రూ.2,500 నుంచి రూ.3.500 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తెలుస్తోంది. ఈ కరోనా టెస్టు కిట్లు జూలైలో ప్రభుత్వ ఆస్పత్రికి సరఫరా చేసినవిగా చెబుతున్నారు. సిబ్బంది అక్రమంగా వీటిని బయట ల్యాబ్‌లకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

రూ.10లక్షల విలువైన ఇంజెక్షన్లు ? 
మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో వెంటిలేటర్లు లేకపోయినా క్రిటికల్‌ కేర్‌ పేరుతో భారీ దోపిడీ చేయటంపై జిల్లా ఉన్నతా«ధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఏకంగా రూ.10లక్షల విలువైన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు అనధికారికంగా నిల్వ చేయటంపైనా దృష్టి సారించారు. ఇష్టారాజ్యంగా వైద్యం చేయటంతో కొందరు రోగులు మృత్యువాత పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు చేసే సమయంలో హాస్పిటల్‌లో 20మంది వరకు రోగులు ఉన్నట్టు తెలుస్తోంది.  

అధికారులకు తెలియదంట! 
జిల్లా కేంద్రం ఏలూరు నడిబొడ్డున ఉన్న మురళీకృష్ణ హాస్పిటల్‌లో కోవిడ్‌ చికిత్స చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియకపోవటంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కొందరు నాయకుల అండతోనే డాక్టర్‌ మురళీకృష్ణ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆరోగ్యశ్రీలో వైద్యం వికటించటంతో వ్యక్తి మృతిచెందగా కేసు నమోదు కాకుండా లాబీయింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా ఎక్కడా కేసు నమోదు కాకుండా సెటిల్‌మెంట్‌ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికారులూ హాస్పిటల్‌ యాజమాన్యానికి సహకారం అందిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   

నోటీసులు జారీ..
మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 5 రోజులలో వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి ఎండీ మురళీకృష్ణకు నోటీసులు అందించారు. పదిహేను రోజుల పాటు ఆసుపత్రి సేవలు రద్దు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మూడు రోజుల సోదాలనంతరం ఆసుపత్రిలోని పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అనుమతి లేకున్న చికిత్స చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. 11 మంది చికిత్స పొందుతూ మృతి చెందిన కానీ ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

 

Advertisement
Advertisement