తల్లిదండ్రులపై తనయుడి పైశాచికత్వం

22 May, 2021 08:08 IST|Sakshi

వృద్ధులైన తల్లిదండ్రులపై కత్తితో దాడి

తండ్రి మృతి, తల్లి పరిస్థితి విషమం 

ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచంలో ఉన్న తండ్రితో పాటు తల్లిపై ఓ కొడుకు కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణం చేజర్ల మండలం కండాపురంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

సేకరించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కోలా శ్రీనివాసులు (70), శివరామమ్మ దంపతుల కుమారుడు కోలా కోటేశ్వరరావు జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ విషయమై పలుమార్లు తండ్రి ప్రశ్నిస్తుండడంతో పాటు ఏదైనా పని చూసుకోవాలని చెబుతుండడంతో నచ్చని కోటేశ్వరరావు తండ్రితో వాదనకు దిగేవాడు. అయితే శ్రీనివాసులు నాలుగేళ్ల క్రితం పక్షవాతానికి గురికావడంతో వ్యవసాయ పనులు చేయలేక ఇంటికే పరిమితమయ్యాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన కోటేశ్వరరావు తండ్రితో గొడవకు దిగాడు. అదే కోపంతో కత్తితో మంచంపై ఉన్న తండ్రితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన తల్లి శివరామమ్మను చేతులపై గాయపరిచాడు. కొడుకు దాడిలో తలకు తీవ్ర గాయమై శ్రీనివాసరావు మంచంపై అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే సాయంత్రం వరకు ఈ విషయం వెలుగులోకి రాలేదు. అయితే తండ్రి మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు కోటేశ్వరరావు గ్రామ పొలిమేర్లలో గుంత తవ్వేందుకు ప్రయత్నిస్తుండగా చుట్టు పక్కల వారు అనుమానించి పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో సీఐ, ఎస్సైలు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరుకు తరలించారు. నిందితుడిని  అదుపులోకి తీసుకుంటామని పొదలకూరు సీఐ ఎం.గంగాధర్, చేజర్ల ఎస్సై ఎస్‌కే ఎండీ హనీఫ్‌ తెలిపారు.

చదవండి: తోటలోకి బాలుడు, ప్రశ్నించిన వృద్ధురాలిపై దారుణం
రైస్‌పుల్లింగ్‌: రాగిపాత్రకు రంగుపూసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు