భారతమాలకు రహదారాలు | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2023 2:16 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, కాకినాడ: భారతమాల ప్రాజెక్టు వేగం పుంజుకుంది. గడువులోగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కాకినాడ యాంకరేజ్‌ పోర్టు, తొండంగి సమీపాన గేట్‌వే ఆఫ్‌ పోర్టు కాకినాడను ఒకపక్క విశాఖపట్నం, మరోపక్క ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు మూడు జాతీయ రహదారులను భారతమాల ప్రాజెక్టు కింద నాలుగు వరుసలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి లేదా, రెండేళ్లలో పనులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా భూ సేకరణ, టెండర్ల ఖరారు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

వడివడిగా ..

కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ నుంచి యాంకరేజ్‌ పోర్టు వరకు 13.20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఏడాది వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పనుల వేగం పెంచారు. ఇక్కడ భూసేకరణ అవసరం లేకుండానే ఉన్న రోడ్డునే నాలుగు లేన్లుగా ఆధునీకరిస్తున్నారు. టెండర్లు ఖరారు కావడంతో రూ.90 కోట్ల అంచనాతో పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుత రోడ్డును ఇరువైపులా వెడల్పు చేస్తూ నాలుగు వరుసలుగా చేపట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

చకచకా భూసేకరణ

ఉమ్మడి తూర్పులో పారిశ్రామికాభ్యున్నతికి సామర్లకోట–అచ్చంపేట జాతీయ రహదారి బాటలు వేయనుంది. రూ.395.60 కోట్ల అంచనాతో 12.25 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి కోసం 33 ఎకరాల ప్రైవేటు భూమి, 21 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతోంది. ఇందుకు నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. ఈ హైవేలో సగం గ్రీన్‌ఫీల్డ్‌ (పొలాల మధ్య) ఉంటుంది. కాకినాడ–పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రాక్‌ సిరామిక్స్‌ వద్ద ప్రారంభమై ఎఫ్‌సీఐ గోడౌన్స్‌, సుగర్‌ ఫ్యాక్టరీ, కెనాల్‌ రోడ్డు మీదుగా ఉండూరులో ఇది కలవనుంది. అచ్చంపేట జంక్షన్‌లో ఒక ఫ్‌లై ఓవర్‌ నిర్మించాల్సి ఉంది. చురుగ్గా భూ సేకరణ చేపడుతున్నారు. 13 కిలోమీటర్ల మేర పనులు మొదలయ్యాయి. 33.92 హెక్టార్ల భూమి సేకరించి ఏడాదిలోపు ఈ హైవే పనులను పూర్తి చేయనున్నారు. ఈ రహదారి సామర్లకోట, కాకినాడ రూరల్‌ మండలాల్లో ఆరు గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది. నాలుగు వరుసల మూడు ప్రధాన జాతీయ రహదారులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో తీరానికి అనుసంధానమవుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమమం అవుతుంది.

కాకినాడ రూరల్‌ కొత్తూరు వద్ద ఏడీబీ రహదారి విస్తరణ పనులు

నాలుగు వరుసలుగా

మూడు జాతీయ రహదారులు

పారిశ్రామిక ప్రగతికి దిక్సూచి

అవుటర్‌ రింగ్‌ రోడ్డు మాదిరి

ఫ్లై ఓవర్‌లు

వేగం పుంజుకున్న భూ సేకరణ

యుద్ధ ప్రాతిపదికన పనులు

రెండేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పం

కాకినాడ తీరంతో

ఉమ్మడి తూర్పు అనుసంధానం

కాకినాడ వాకలపూడి లైట్‌హౌస్‌ నుంచి అన్నవరం మీదుగా కోల్‌కతా–చైన్నె జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. 40.32 కి లోమీటర్లు నిడివి కలిగిన ఈ నాలుగు వరుసల జాతీయరహదారిని తొలుత రూ.776.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.

కాకినాడ పోర్టు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, కాకినాడ గేట్‌వే పోర్టు, ఉప్పాడ ఫిష్షింగ్‌ హార్బర్‌ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది.

వాకలపూడి జంక్షన్‌లో ఒక ఫ్లై ఓవర్‌, అన్నవరం, కాకినాడ సెజ్‌, హార్బర్‌ల వద్ద అండర్‌పాస్‌లను నిర్మించాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు తరహాలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు కానుంది.

ఇప్పుడు రహదారి అంచనా వ్యయం రూ.1400 కోట్లకు పెరిగింది.

ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఇందుకు రూ.160 కోట్లకుగాను ఇప్పటికే రూ.56 కోట్లు విడుదల చేశారు.

రెండేళ్లలోపు అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.

తొండంగి, శంఖవరం, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ మండలాల్లోని 21 గ్రామాల మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది.

ఫ్లై ఓవర్లు.. అండర్‌పాస్‌ల వల్ల పెరిగిన అంచనా వ్యయం

మూడు హైవేలను గడువులోగా పూర్తి చేస్తాం. భారతమాల ప్రాజెక్టులో చేపట్టిన ఈ రోడ్ల వల్ల విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి జిల్లాల మధ్య అనుసంధానమేర్పడుతుంది. వాకలపూడి లైట్‌హౌస్‌ నుంచి అన్నవరం వరకు వస్తోన్న జాతీయ రహదారికి మధ్యలో కాకినాడ సెజ్‌, ఉప్పాడ హార్బర్‌ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. ఈ కారణంగానే అంచనా వ్యయం రూ.1400 కోట్లకు పెరిగింది. సేకరించిన ప్రైవేట్‌ భూములకు వెంటనే పరిహారం చెల్లిస్తున్నాం.

– సురేంద్రనాఽథ్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌, జాతీయ రహదారులు విభాగం

పోర్టు రోడ్డులో శరవేగంగా జరుగుతున్న 
భారత్‌మాల పనులు
1/1

పోర్టు రోడ్డులో శరవేగంగా జరుగుతున్న భారత్‌మాల పనులు

Advertisement
Advertisement