తగ్గిన నిషాచరులు | Sakshi
Sakshi News home page

తగ్గిన నిషాచరులు

Published Thu, May 4 2023 1:40 AM

- - Sakshi

అమలాపురం టౌన్‌: మద్యం బ్రాండ్లు, ధరలు, అమ్మకాలు పెంచేసి తాగుబోతులు మరింత మత్తులో తూగేలా ప్రభుత్వం చేస్తోందని విమర్శించే ప్రతిపక్ష నేతల నోళ్లను మద్యం అమ్మకాల గణంకాలు మూయిస్తున్నాయి. దశలవారీ మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో వినియోగంలో తగ్గుదల కనిపిస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక అమలాపురంలోని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లిక్కర్‌ గొడౌన్‌ (డిపో) నుంచి 2022–23 సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే అమ్మకాలు పెరిగాయో తగ్గాయో తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో 2018–19 సంవత్సరానికి సంబంధించి ఇదే అమలాపురం గొడౌన్‌ నుంచి సాగిన అమ్మకాలను 2022–23 సంవత్సరం గణంకాలతో పోల్చితే మద్యం అమ్మకాలు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవీ లెక్కలు..
కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 దుకాణాలకు అమలాపురం లిక్కర్‌ గొడౌన్‌ నుంచి మద్యం సరఫరా అవుతుంది. ఈ గొడౌన్‌ నుంచి 1918–19 సంవత్సరంలో లిక్కర్‌ 10.33 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించారు. 2022–23 సంవత్సరంలో ఇదే గొడౌన్‌ నుంచి 8.18 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకం సాగింది. 2018–19 సంవత్సరంలో ఈ గొడౌన్‌ నుంచి బీరు 6.77 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించగా 2022–23 సంవత్సరంలో సగం కంటే లోపే అంటే కేవలం 2.30 లక్షల కేసుల బీరు విక్రయం అయింది. ఈ అధికారిక గణంకాలు లిక్కర్‌, బీరు వినియోగం ఏ మేరు తగ్గిందో స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 12.61 శాతం మేర తగ్గుముఖం
అమలాపురం లిక్కర్‌ డిపో కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంటే కొత్త జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా పరిధిలోకి వచ్చే రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న 49 మద్యం దుకాణాలకు రాజమహేంద్రవరం లిక్కర్‌ గొడౌన్‌ నుంచి లిక్కర్‌, బీరు కేసులు సరఫరా అవుతున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా 2018–19 సంవత్సరం పోల్చితే 2022–23 సంవత్సరంలో 20 నుంచి 25 శాతం వరకూ మద్యం వినియోగం తగ్గింది. గత నెల 21న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల సమీక్షా సమావేశం కూడా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో లిక్కరు, బీరు వినియోగం ఎంత మేర తగ్గిందో గణాంకాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్‌, బీరు వినియోగం 12.61 శాతం మేర తగ్గుముఖం పట్టినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి.

సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు
ఇదే సమయంలో రాష్టంలో మద్యం వినియోగాన్ని క్రమేపీ తగ్గిస్తూ మందుబాబుల ఆలోచనలో మార్పు తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దశలవారీ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వీధివీధికి, సందు సందుకీ, గుడి బడి ఎక్కడ పడితే అక్కడ అధికారిక మద్యం దుకాణాలకు తోడు పుట్టగొడుగుల్లా వెలిసిన మద్యం బెల్ట్‌షాపులను ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మూయించి వేసింది. ప్రభుత్వమే దుకాణాల సంఖ్యను తగ్గించి ఏర్పాటు చేసింది.

వినియోగం తగ్గింది
గతంలో పోల్చుకుంటే మద్యం వినియోగం కొంత తగ్గింది. ముఖ్యంగా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో అమలాపురం లిక్కర్‌ డిపోలో వినియోగం తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
– పొంగులేటి దశమంతరావు,

Advertisement
Advertisement