Sakshi News home page

భక్తుల కోసం అన్ని వసతులు

Published Sun, Nov 12 2023 2:52 AM

మందపల్లిలో  పూజలు నిర్వహిస్తున్న భక్తులు - Sakshi

రామచంద్రపురం రూరల్‌: ద్రాక్షారామలో కార్తిక మాసం ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం పక్క నుంచి వాహనాలు వెళ్లకుండా చూడటంతో పాటు, వన్‌ వే ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు ద్రాక్షారామ పీవీఆర్‌ విద్యాసంస్థల ప్రాంగణంలోనూ, ద్రాక్షారామ మార్కెట్‌ యార్డు స్థలంలోనూ, ఆలయం ఉత్తరం వైపు ఇండోర్‌ స్టేడియం ప్రాంగణంలోనూ ఏర్పాట్లు చేయాలన్నారు. జల్లు స్నాన ఘట్టం, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లపై సూచనలు చేశారు. సర్పంచ్‌ కొత్తపల్లి అరుణ, ఉప సర్పంచ్‌ పెన్నాడ బుచ్చిరాజు, వైస్‌ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి, శాకా బాబీ, సర్పంచ్‌లు అనిశెట్టి రామకృష్ణ, పెమ్మిరెడ్డి దొరబాబు పాల్గొన్నారు.

మందపల్లికి పోటెత్తిన భక్తులు

కొత్తపేట: శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా మండలంలోని మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) క్షేత్రానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వెలుపల, వెనుక ఆవరణలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, దేవస్థానం ఈఓ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అలాగే ఇతర దేవస్థానాల అధికారులు, సిబ్బంది కూడా విధుల్లో పాల్గొన్నారు. వానపల్లి పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. రావులపాలెం సీఐ ఎన్‌.రజనీ కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై వి.మణికుమార్‌ బందోబస్తు నిర్వహించారు.

రూ.16.47 లక్షల ఆదాయం

శనైశ్చర క్షేత్రానికి సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల తైలాభిషేకాలు, ప్రత్యక్ష సేవల ద్వారా రూ.11,03,998, పరోక్ష సేవలు, ఆన్‌లైన్‌ సేవల ద్వారా రూ.5,43,400తో కలిసి మొత్తం రూ.16,47,398 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం ఏసీ అండ్‌ ఈఓ విజయలక్ష్మి తెలిపారు.

పుణ్యక్షేత్రాల దర్శనానికి

ప్రత్యేక బస్సులు

రావులపాలెం: స్థానిక ఆర్‌టీసీ డిపో నుంచి అరుణాచలం గిరిప్రదక్షణ, రామేశ్వరం యాత్ర, ఆరుపడివీడు క్షేత్రాలను దర్శించేలా ఏడు రోజుల టూర్‌కు ప్రత్యేక బస్సు (సూపర్‌ లగ్జరీ బస్సు) ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్‌ కేడీఎంఎస్‌ కుమార్‌ శనివారం తెలిపారు. టికెట్‌ ధర ఒక్కరికి భోజనంతో సహా రూ.8,500గా నిర్ణయించామన్నారు. వసతి ఖర్చులు ఎవరికీ వారే పెట్టుకోవాలన్నారు. ఈనెల 28 తేదీ నుంచి డిసెంబర్‌ 6 తేదీ వరకూ యాత్ర ఉంటుందన్నారు. తిరుత్తణి, కాంచీపురం, పళని, పరిముదురచోలై, తిరుప్పారన్‌ కుండ్రాం, మధురై, కన్యాకుమారి, తిరునెల్వేలి, నాగర్‌ కోయిల్‌, తిరుచందుర్‌, రామేశ్వరం, తంజావూర్‌, స్వామిమలై, కుంభకోణం, తిరువారుర్‌, తిరుకడయూర్‌, అరుణాచలం, శ్రీపురం, శ్రీకాళహస్తి మీదుగా యాత్ర సాగుతుందన్నారు.

● తిరుపతి, అరుణాచలగిరి ప్రదక్షణ యాత్రకు ఈనెల 25 తేదీన మరోబస్సు బయలుదేరుతుందన్నారు. తిరుపతి, అరుణాచలం, కాంచీపురం, శ్రీపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ దర్శనం అనంతరం 29వ తేదీన రావులపాలెం చేరుతుందన్నారు. టికెట్‌ ధర రూ.3,500 నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలను అసిస్టెంట్‌ మేనేజర్‌ను 73829 11871 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement