రత్నగిరి.. జనసునామీ | Sakshi
Sakshi News home page

రత్నగిరి.. జనసునామీ

Published Mon, Nov 27 2023 11:50 PM

ఆలయ ప్రాంగణంలో భక్తజనసందోహం  - Sakshi

సత్యదేవుని దర్శించిన 1.50 లక్షల మంది

రికార్డు స్థాయిలో 15,629 వ్రతాలు

రూ.1.50 కోట్ల ఆదాయం

అన్నవరం: కార్తిక పౌర్ణమి, సోమవారం పర్వదినాలు రెండూ కలసి రావడంతో సత్యదేవుని సన్నిధి.. రత్నగిరిపై జనసునామీ ఎగసిపడింది. స్వామివారి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలని విధంగా భక్తజనసందోహంతో నిండిపోయింది. వేలాది వాహనాల్లో భక్తులు తరలి రావడంతో దేవస్థానం ఘాట్‌ రోడ్లు, మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ స్థలాలు కూడా కార్లతో నిండిపోయాయి. సత్యదేవుని రికార్డు స్థాయిలో సుమారు లక్షన్నర మంది భక్తులు దర్శించారని అధికారులు అంచనా వేశారు.

అర్ధరాత్రి ఒంటి గంట నుంచే..

సుమారు 20 వేల మంది భక్తులు సోమవారం రాత్రికే రత్నగిరికి చేరుకున్నారు. దీంతో స్వామివారి ఆలయాన్ని సోమవారం వేకువన ఒంటిగంటకు తెరచి వ్రతాలు ప్రారంభించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రద్దీ కొనసాగింది. స్వామివారి అంతరాలయ దర్శనం టిక్కెట్‌ తీసుకున్న భక్తులను కూడా వెలుపలి నుంచే దర్శనానికి అనుమతించారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ఎదురుగా రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో, రావిచెట్టు వద్ద, ధ్వజస్తంభం వద్ద జ్యోతులు వెలిగించి దీపారాధన చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా దీపాలతో నిండిపోయింది.

వ్రత మండపాలు ఖాళీ లేక..

అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో స్వామివారి వ్రత మండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలన్నీ నిండిపోయాయి. వ్రతాలకు ఇంకా భక్తులు బారులు తీరినప్పటికీ మండపాలు ఖాళీ లేక సుమారు గంటసేపు టిక్కెట్ల విక్రయం నిలిపివేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోకి రాకుండా పశ్చిమ రాజగోపురం తలుపులు మూసివేశారు. గంట తరువాత వ్రతాల టిక్కెట్ల విక్రయం పునఃప్రారంభించారు. మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 15,629 వ్రతాలు జరిగాయి. వీటిల్లో రూ.300 టిక్కెట్‌ వ్రతాలే 10,821 కాగా, రూ.వెయ్యి టిక్కెట్‌ వ్రతాలు 2,070, రూ.2 వేల వ్రతాలు 1,166, రూ.1,500 వ్రతాలు 1,511 ఉన్నాయి. మిగిలినవి ఆన్‌లైన్‌ వ్రతాలు. కార్తిక మాసం ప్రారంభమయ్యాక గడచిన 15 రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడం, వ్రతాలు జరగడం ఇదే ప్రథమం. రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా ఉదయం 11 గంట ల వరకూ వ్రతాలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుని నిత్య కల్యాణం ప్రారంభించారు. సుమారు వంద మంది భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు.

దండిగా ఆదాయం

దేవస్థానానికి సోమవారం దండిగా ఆదాయం సమకూరింది. ఒక్క వ్రతాల ద్వారానే సుమారు రూ.70 లక్షలు సమకూరగా మిగిలిన విభాగాల ద్వారా రూ.40 లక్షలు వచ్చింది. మొత్తం మీద అన్ని విభాగాల ద్వారా రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్ర మోహన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు పర్యవేక్షించారు. సుమారు 20 వేల మంది భక్తులకు ఉచితంగా పులిహోర, దధ్యోదనం, చిన్న పిల్లలకు పాలు పంపిణీ చేశారు.

వ్రత టిక్కెట్ల విక్రయ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ
1/1

వ్రత టిక్కెట్ల విక్రయ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ

Advertisement
Advertisement