వెన్నుపోటు పొడిచింది మీ బాబే | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పొడిచింది మీ బాబే

Published Mon, Nov 27 2023 11:50 PM

రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ నుంచి అవార్డులు అందుకుంటున్న కోనసీమ ఐఎంఏ సభ్యులు  - Sakshi

లోకేష్‌పై ఎమ్మెల్యే రాపాక మండిపాటు

రాజోలు/మలికిపురం: టీడీపీ నేత నారా లోకేష్‌ తీరుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మండిపడ్డారు. కత్తిమండ గ్రామంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. లోకేష్‌ తండ్రి చంద్రబాబు.. ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచి, దొంగచాటుగా ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు. ఐదెకరాల్లో ప్యాలెస్‌ కట్టుకున్నానంటూ లోకేష్‌ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక దళితుడు ఇల్లు కట్టుకుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా ఇసుక దోచుకుని కోట్ల రూపాయలు కాజేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ఇసుక ద్వారా రాష్ట్రానికి సీఎం జగన్‌ ఎంతో ఆదాయం సమకూరుస్తున్నారని చెప్పారు. ఎవరో రాసి ఇచ్చింది చదివి, నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అంగన్‌వాడీ, షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు అమ్ముకున్నారని చెప్పారు. తన తండ్రి 12 ఎకరాలు ఇస్తే ప్రస్తుతం ఏడెకరాల భూమి ఉందని, లోకేష్‌ తండ్రి చంద్రబాబు రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చి వేలాది ఎకరాలు, వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని నిలదీశారు. అవినీతి చేసి తండ్రి చంద్రబాబు జైలుకు వెళ్లాడన్న విషయం మరచిపోయి, ఎదుటి వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే రాపాక అన్నారు.

అయినవిల్లి సబ్‌స్టేషన్‌కు నేడు సీఎం శంకుస్థాపన

అమలాపురం రూరల్‌: అయినవిల్లిలో నిర్మించనున్న 400/132 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్మించిన విద్యుత్‌ ఉప కేంద్రాలను ప్రారంభించడంతో పాటు కొత్తగా నిర్మించనున్న సబ్‌స్టేషన్లకు సీఎం జగన్‌ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని వివరించారు. అయినవిల్లిలో జరిగే కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అమలాపురం టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ పద్మశ్రీరాణి తెలిపారు. ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టు–1, ఆడియో మెట్రీషియన్‌ పోస్టు–1 భర్తీకి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల నాలుగో తేదీ లోగా కొవ్వూరులోని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి కార్యాలయంలో పని వేళల్లో అందించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 8886 11 2666 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని ఆమె సూచించారు.

కోనసీమ ఐఎంఏకు 6 అవార్డులు

అమలాపురం టౌన్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కోనసీమ జిల్లా శాఖకు ఆరు అవార్డులు లభించాయి. ఈ నెల 25న విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ ఈ అవార్డులు అందించారని జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వీఎస్‌ఎస్‌ఎన్‌ మూర్తి, డాక్టర్‌ కడలి ప్రసాద్‌ తెలిపారు. స్పెషల్‌ కేటగిరీలో కోనసీమ ఐఎంఏ ప్రతినిధులు, సీనియర్‌ వైద్యులైన పీఎస్‌ శర్మ, పయ్యావులు సురేష్‌ అవార్డులు అందుకున్నారు. అలాగే కోనసీమ ఐఎంఏ భవన నిర్మాణానికి, మహిళా డాక్టర్ల విభాగానికి, క్షయ వ్యాధి నిర్మూలనకు చేస్తున్న కృషికి, డాక్టర్ల దినోత్సవాన్ని అవగాహన, చైతన్యం దిశగా నిర్వహించినందుకు ఆరు అవార్డులు వచ్చాయన్నారు.

జాతీయ వాలీబాల్‌ పోటీలకు మాధురి

ఉప్పలగుప్తం: సెంట్రల్‌ యూనివర్సిటీ జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు గొల్లవిల్లి వాలీబాల్‌ క్లబ్‌ క్రీడాకారిణి వీరవల్లి మాధురి ఎంపికయ్యారు. జేఎన్‌టీయూకే జట్టు తరఫున మాధురి ఈ పోటీల్లో పాల్గోనున్నారు. ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీలో జరిగిన పోటీల్లో మాధురి ప్రతిభ చాటి జాతీయ స్థాయికి అర్హత సాధించా రు. గొల్లవిల్లి జెడ్పీ హైస్కూలులో సోమవారం ఆమెను పలువురు అభినందించారు. మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీపీ దంగేటి అచ్యుత జానకి, జెడ్పీటీసీ గెడ్డం సంపదరావు, సర్పంచ్‌ జొన్నాడ శ్రీదుర్గ ఆమెను అభినందించారు.

1/2

2/2

Advertisement
Advertisement