ఐదుగురి అరెస్టు.. గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

ఐదుగురి అరెస్టు.. గంజాయి స్వాధీనం

Published Tue, Mar 28 2023 2:34 AM

నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎస్‌ఈబీ అధికారులు  - Sakshi

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌):

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు ఐదుగురిని అరెస్టు చేసి, 23.410 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ జిల్లా అధికారి పిట్టా సోమశేఖర్‌ ఆధ్వర్యాన, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ మార్గాని రాంబాబు సూచనలతో నార్త్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పీవీ రమణ, ఎస్‌ఈబీ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అప్పారావు, సిబ్బంది సోమవారం ఈ దాడి చేశారు. వారి కథనం ప్రకారం.. ఉదయం 11.30 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన శ్యామలాంబ పార్కు వీధిలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా లగేజీ బ్యాగులతో తచ్చాడుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, బ్యాగులు తనిఖీ చేయగా, 11 ప్యాకెట్లలో ఉన్న 23.410 కిలోల గంజాయి లభ్యమైంది. వెంటనే ఆ ఐదుగురినీ అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా నిడింమ్‌కుండమ్‌ గ్రామానికి చెందిన టిస్సన్‌ జోసఫ్‌, జిస్టుకంజిరతిల్‌లు గంజాయి కోసం విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ పరిచయం ఉన్న డొంక ప్రదీప్‌కుమార్‌ (అట్టూ), అతడి స్నేహితుడు నయన సురేష్‌ సహాయంతో అరకు ఏజెన్సీ నుంచి గంజాయి సరఫరా చేస్తున్న బాకా గోవర్ధన్‌ (సురేష్‌) ద్వారా 23.410 కిలోల గంజాయి సేకరించారు. వారితో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు. ఐదుగురూ కలిసి శ్యామలాంబ పార్కు వీధిలో గంజాయిని మార్చుకొంటూండగా ఎస్‌ఈబీ అధికారులు దాడి చేసి, పట్టుకున్నారు. అరకు ఏజెన్సీ నుంచి రూ.లక్షకు కొనుగోలు చేసి, కేరళలో రూ.2 లక్షల వరకూ ఈ గంజాయిని అమ్ముకుంటామని కేరళకు చెందిన జోసఫ్‌, రతిల్‌ వెల్లడించారు. వీరు ఇదేవిధంగా ఆరు నెలల నుంచి ప్రతి నెలా విశాఖపట్నం వచ్చి, ప్రదీప్‌, సురేష్‌ ద్వారా గంజాయి కొనుగోలు చేసి, రవాణా చేస్తున్నట్టు విచారణలో చెప్పారు.

Advertisement
Advertisement