‘జ్యూస్‌’ అన్వేషణకు అంకురార్పణ | Sakshi
Sakshi News home page

‘జ్యూస్‌’ అన్వేషణకు అంకురార్పణ

Published Thu, Apr 13 2023 2:52 AM

Sakshi Editorial On European Space Agency Juno spacecraft

ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివాళ్లమా లేక మనలాగే మనుగడసాగించే బుద్ధిజీవులు వేరే గ్రహాలపై కూడా ఉన్నారా అన్న విచికిత్స ఈనాటిది కాదు. ఆ ప్రయత్నంలో గురువారం మరో అడుగు ముందుకుపడబోతోంది. యూరొపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) నేతృత్వంలో రూపొందిన ‘జ్యూస్‌’ (జూపిటర్‌ అయిసీ మూన్స్‌ ఎక్స్‌ప్లోరర్‌) అంతరిక్ష నౌక దక్షిణ అమెరికాలోని కౌరు దీవి నుంచి ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. 2031లో అక్కడికి చేరుకున్నాక గురు గ్రహానికున్న లెక్కకు మిక్కిలి చందమామల్లో మూడింటిని ఎంచుకుని వాటిల్లో జీవుల ఉనికి సంగతిని తేల్చడం ఈ అంతరిక్ష నౌక లక్ష్యం.

అంగారక గ్రహం ఆవల జీవం ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదని ఒకప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. కానీ అంతటితో ఆగిపోతే మానవ జిజ్ఞాసకు అర్థం లేదు. ‘వేరెక్కడో ఒక మహాద్భుతం తనను తాను వ్యక్తపరుచుకోవటానికి వేచిచూస్తూ వుండొచ్చ’ని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ సెగాన్‌ ఒక సందర్భంలో అన్నారు. ఒక్క ఖగోళ శాస్త్రం అనేమిటి...సమస్త రంగాల్లోనూ మానవాళి సాధిస్తున్న విజయపరంపరకు ఈ భావనే మూలం.

1990లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గురుగ్రహంపైకి ప్రయోగించిన గెలీలియో ఉపగ్రహం, ఈమధ్యకాలంలో శనిగ్రహానికి పోయిన కేసినీ ఉపగ్రహం శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేశాయి. గురుడు, శుక్రుడు, బుధుడు వంటి ఇతరేతర గ్రహాలపై జీవం ఉండక పోవచ్చుగానీ, గురుడు, అంగారకుడు మధ్య కనబడుతున్న చందమామలపై ఏదోమేర, ఏదో రూపంలో జీవం ఉండటానికి అవకాశం ఉన్నదని అవి పంపిన డేటా ఆధారంగా నిర్ధారణ కొచ్చారు. ఆ తర్వాతే ఈ మూడు చందమామలనూ అన్వేషించాలన్న నిర్ణయానికొచ్చారు.

గ్రహాలన్నిటిలోనూ గురుగ్రహం చాలా పెద్దది. సంక్లిష్టమైనది కూడా. ఎందుకంటే దీనికి ఒకటీ రెండూ కాదు...ఏకంగా 92 చందమామలున్నాయి. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో కూడా తిరుగు తుంటాయి. అలాంటి చందమామల్లో పెద్దగా ఉండే యూరోపా, క్యాలిస్టో, గానిమీడ్‌ అనే మూడింటిని ఎంచుకుని వాటిచుట్టూ జ్యూస్‌ 35 ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తర్వాత 2034లో గానిమీడ్‌ చుట్టూ నిర్దేశిత కక్ష్యలో కుదురుకుంటుంది. ఈ మూడు చందమామలూ మంచుతో నిండివున్నాయి.

ఆ పొరల వెనక మహా సముద్రాలు నిక్షిప్తమైవున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అదే నిజమైతే ఏదో రూపంలో అక్కడ జీవం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గానిమీడ్‌పై లవణసముద్రం ఉన్నదని గుర్తించారు. నిజానికి సూర్యకాంతి పడే అవకాశం లేదు గనుక ఈ మూడు చందమామల్లో జీవం ఉనికికి అవకాశం లేదు. కానీ గురుగ్రహానికుండే గురుత్వాకర్షణ ఆ లోటు తీరుస్తోంది. ఈ చందమామల్లోని సముద్రాలు వేడెక్కడానికి దోహదపడుతోంది. గురుగ్రహానికి మన దగ్గర బృహస్పతి అనే నామాంతరం ఉంది.

పురాణాల్లో బృహస్పతి దేవగురువు. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... బృహస్పతికి ప్రీతిపాత్రమైన గురువారం రోజునే గురుగ్రహానికి జ్యూస్‌ ప్రయాణం కడుతోంది. నిజానికి ఇంతవరకూ గురుగ్రహం గురించి మానవాళికి తెలిసింది గోరంతే. దాన్ని దట్టంగా చుట్టుముట్టివుండే వాయుమేఘాలే అందుకు కారణం. అందులో అత్యధికం, అంటే...90 శాతం హైడ్రోజన్‌ అయితే, మిగిలిన పదిశాతంలో హీలియం, మీథేన్, గంథకం, అమోనియా వంటివి ఉన్నాయి.

అయితే ఈ మూలకాల్లో ఎన్ని వాయురూపంలో ఉన్నాయో, మరెన్ని ఘనరూపం దాల్చాయో శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు. అసలు గురుగ్రహం నెన్నొసట సిందూరంలా ఎర్రగా మెరిసే బింబం ఒకటుంటుంది. దాని పరిమాణమే మన భూమి కన్నా మూడింతలు కాగా, అది కుదురుగా ఒకచోట ఉండక తిరుగా డుతుంటుంది. గురుగ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇలా కనబడుతోందని శాస్త్రవేత్తలంటారు. 

మనం భూమ్మీద క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది గురుగ్రహం చలవే. ఎందుకంటే భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాల్లో, ఉల్కల్లో చాలాభాగాన్ని గురుగ్రహం తనవైపు ఆకర్షించుకుని వాటివల్ల కలిగే కష్టనష్టాలను తానే భరిస్తుంటుంది. నిజానికి గురుగ్రహం చుట్టూ తిరుగాడుతున్న చందమామల్లో అనేకం అటువంటి గ్రహశకలాలే. ఇందులో ఒకటైన గానిమీడ్‌కు అయస్కాంత క్షేత్రం ఉన్నా, అది బుధుడి కన్నా చాలా పెద్దదైనా గురుడి ప్రభావానికి లోనై చందమామగానే మిగిలి పోయింది.

గురుగ్రహం ఆనుపానులు రాబట్టేందుకు ఇంతవరకూ 4 అంతరిక్షనౌకలు వెళ్లాయి. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్‌–10 గురుగ్రహం చుట్టూ 2003 వరకూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత దాన్నుంచి సంకేతాలు లేవు.  మన సౌర వ్యవస్థను దాటి ముందు కెళ్లడానికి 1977లో ప్రయోగించిన వాయేజర్‌ గురుగ్రహాన్ని దాటుకుంటూ వెళ్తూ దాని ఛాయా చిత్రాలు పంపింది. ఆ తర్వాత 1990లో వెళ్లిన గెలీలియో, 2000లో వెళ్లిన కేసినీ వ్యోమనౌకలు సైతం గురుగ్రహ ఛాయాచిత్రాలు పంపాయి.

ఇక  2016లో నాసా ప్రయోగించిన జునో అంతరిక్ష నౌక నిరుడు యూరోపా ఛాయాచిత్రాలు పంపింది. ఇప్పుడు జ్యూస్‌ ప్రదక్షిణలు చేయబోయే 3 చందమామల్లో యూరోపా ఒకటి. అది 2031–34 మధ్య యూరోపాను రెండుసార్లు, క్యాలిస్టోను 21సార్లు, గాని మీడ్‌ను 12 సార్లు చుట్టివస్తుంది. అంతరిక్ష నౌకలు పంపే డేటాలో కేవలం రంగుల పొందికే ఉంటుంది. వీటి ఆధారంగా అక్కడ ఏమేం వాయువులున్నాయో, మూలకాలున్నాయో అంచనా కొస్తారు. విశ్వరహఃపేటిక తెరుచుకోవాలంటే నిత్యం ప్రయోగాలు కొనసాగుతూనే ఉండాలి. ఖగోళ శాస్త్ర ఆవిష్కరణలు విశ్వానికి సంబంధించిన మన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విస్తృతపరుస్తుంటాయి.  

Advertisement
Advertisement