కేశమహిమ | Sakshi
Sakshi News home page

కేశమహిమ

Published Mon, Aug 7 2023 12:25 AM

Sakshi Editorial On Hair Beauty

జీవితంలో అప్రధానంగా కనిపించే విషయాలకు కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంటుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జుట్టు. మన భాషా సాహిత్యాలను కొంచెం తరచి చూస్తే, జుట్టుకు ఉన్న ప్రాశస్త్యం అర్థమవుతుంది. జుట్టు చుట్టూ జరిగే వ్యాపారాలను కాస్త నిశితంగా గమనిస్తే,ఎంతటి వారైనా ‘జుట్టే కదా’ అని కేశపాశాలను వెంట్రుక ముక్కలా తీసి పారేయలేరు.

అదీ కేశ మహిమ! అందమైన కేశాలు నిండుగా తలమీద ఉండటం వల్లనే శ్రీమహావిష్ణువుకు కేశవుడనే పేరు వచ్చింది. ఆదిభిక్షువే అయినా, పరమశివుడు కేశసంపదలో తక్కువ వాడేమీ కాదు, ఆయన జటాజూటధారి! ఆయన తన జటాజూటంలో గంగను బంధించాడు కాబట్టి గంగను శిరోజతీర్థం అని అంటారు. తలవెంట్రుకలకు గల పురాణ ప్రశస్తికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!

జుట్టును అల్లుకున్న జాతీయాలు, సామెతలు దాదాపు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ‘ఫలిత కేశాలు ముదిమికి సంకేతాలే గాని, జ్ఞానానికి కాదు’ అని ఇంగ్లిష్‌ సామెత. ఇది తలపండితులకు చక్కగా వర్తిస్తుంది. ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అనే సామెత మనకు ఉండనే ఉంది. ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం’ కూడా మన నుడికారంలో భాగమే! కొందరు బతకనేర్పరులు ఈ విద్యలో బాగా ఆరితేరి ఉంటారు. ‘జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే’ అని నానుడి.

ఇటీవల ఏపుగా జుట్టు పెంచుకోవడానికి హైదరాబాద్‌లో ఒక మహిళ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. బ్యూటీపార్లర్‌ చికిత్సతో ఆమెకు ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇలా ఉంటాయి కేశక్లేశాలు! ‘కాళ్లు్ల వంకరగా ఉన్నప్పుడు నెత్తి మీద వెంట్రుకలు తిన్నగా ఉండి లాభమేంటి?’ అని రష్యన్‌ సామెత. ‘ప్రతి మనిషి పొద్దున్నే తలదువ్వుకున్నట్లు మనసు దువ్వుకోరెందుకో?’ అని చైనీస్‌ సామెత. మనుషులకు శిరోజాలంకరణ మీద ఉన్న శ్రద్ధ మనోలంకరణ మీద ఉన్నట్లయితే, ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది!

మన పూర్వకవులు మరాళకుంతలలైన నీలవేణుల సౌందర్యాన్ని ఇతోధికంగా వర్ణించారు. ‘ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై...’ పద్యంలో పోతనామాత్యుడు శ్రీమహా విష్ణువు కరవైభవాన్ని వర్ణించడానికి లక్ష్మీదేవి కొప్పునే ఆశ్రయించాల్సి వచ్చింది. ‘అంభోజతాక్షి వేణిన్‌ హరువు గనిన రోమాతి సౌభాగ్యమెంతే... చమిరి యొనరుపన్‌ చక్కనౌ తీవెయోనాన్‌’ అంటూ కొప్పరపు కవులు ఒక అవధానంలో వేణీసౌందర్యాన్ని వర్ణించారు. ‘కలుగక యిచ్చెడు మనుజులు/ తలవెండ్రుకలంత మంది తర్కింపంగా/ కలిగియు నీయని యధములు/ మొల వెండ్రుకలంత మంది మోహన రంగా’ అని ఒక పూర్వకవి సంపన్న లోభుల మీద కసిదీరా తన అక్కసును వెళ్లగక్కాడు.

తల మీది వెంట్రుకలకే కాదు, పురుషుల మీసాలకు, గడ్డాలకు కూడా మన భాషా సాహిత్యాల్లో తగిన ప్రశస్తి ఉంది. మీసాలను పౌరుష చిహ్నాలుగా గుర్తిస్తారు. అందుకే ‘మీసము పస మగ మూతికి’ అన్నాడు చౌడప్ప. వైదికులకు మీసాలు పెంచే ఆచారం లేకపోయినా, తిరుపతి వేంకట కవులు మీసాలను పెంచారు. ఈ జంటకవులు మీసాలను పెంచడాన్ని కొందరు ఆక్షేపిస్తే, ‘దోసమ టంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమే/ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా/ రోసము గల్గినన్‌ కవి వరుల్‌ మము గెల్వుడు గెల్చిరేని ఈ/ మీసము దీసి మీ పాద సమీపములన్‌ తలలుంచి మ్రొక్కమే!’ అని సవాలు విసిరారు. అదీ వారి కవన పౌరుషం!

కేశ సంరక్షణ కోసం స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులు నానా తంటాలు పడటం శతాబ్దాల నుంచే ఉంది. తలకట్టు నిండుగా కనిపించడానికి వివిధ సుగంధ తైలాలను వాడేవారు. గాంభీర్యా నికి గురుతైన మీసకట్టు ఏపుగా పెరగడానికి కూడా రకరకాల పద్ధతులు పాటించేవారు. ‘అంబలి తాగేవాడొకడైతే మీసాలెత్తేవాడు ఇంకొకడు’, ‘మింగ మెతుకు లేదు గాని, మీసాలకు సంపెంగ నూనె’ వంటి సామెతలు సమాజంలోని డాంబిక ఆడంబరాలను బయటపెడతాయి. బ్రిటిష్‌ హయాంలో ఆధునిక పోకడలు మొదలయ్యాక మన దేశంలో అలంకరణల పద్ధతుల్లో చాలా మార్పులే వచ్చాయి.

తల వెంట్రుకలను, మీసకట్టును చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవడం మొదలైంది. ఈ మార్పులు మొదలైన కొత్తలో కొంత విచిత్రంగా చూసేవారు. అప్పటికింకా సంప్ర దాయాలను వదులుకోని ఛాందసులు ఈ విచిత్ర కేశాలంకరణలను ఆక్షేపించేవారు. ‘గొంగడి పురుగు కట్టింగు మీసాల వాడు/ గంపశ్రాద్ధపు తలకట్టువాడు’ అని మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి ‘కన్యాశుల్కం’లోని గిరీశం పాత్రను వర్ణిస్తూ ఒక పద్యం రాశారు. తలకు చక్కగా నూనె పట్టించి, నున్నగా దువ్వుకోవడం పెద్దమనుషుల లక్షణంగా ఉండేది.

ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అలా నున్నగా దువ్విన తలకట్టుతో ఉండేవారు. ఆయన తలకట్టు సొగసును– ‘ఈగ వ్రాలిన గాని వేగ జారెడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు/... చెవుల సందున గిర జాలు చిందులాడ మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త/ టంగుటూరి ప్రకాశము రంగు మెరయ ధవళగిరి తీర్థమునకు తరలివచ్చె’ అంటూ చిలకమర్తివారు వర్ణించారు. 

ఆ రోజులే వేరు. సామాజిక, రాజకీయ జీవితాల్లో సరసత ఉండేది. ఇప్పుడు రాజకీయాలు బొత్తిగా మొరటుదేరిపోయాయి. అయితే, ఇప్పటికీ రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచుగా కేశ ప్రస్తావన వస్తూనే ఉంటుంది గాని, వారి ప్రసంగాల్లో కేశాలకు సంబంధించి దొర్లే ముతక పదాలు జనాల చెవులను చిల్లులు పొడుస్తుంటాయి. అయినా, గొంగట్లో భోంచేసేటప్పుడు వెంట్రుకలను ఏరుకోక తప్పదు కదా!  

Advertisement
Advertisement