మీకు ఎక్కువ కాలం జీవించాలని ఉందా.. అయితే ఇలా చేయండి! | Sakshi
Sakshi News home page

Amarnath Vasireddy: మీకు ఎక్కువ కాలం జీవించాలని ఉందా.. అయితే ఇలా చేయండి!

Published Sat, Jun 3 2023 1:20 PM

Amarnath Vasireddy comments on live long life - Sakshi

మీ వయసెంత ? ఆగండాగండి.. క్యాలండర్ వయసు చెప్పకండి . నేను ఫలానా సంవత్సరం పుట్టాను; కాబట్టి నా వయసు ఇంత అని చెప్పకండి. దాని వల్ల ప్రయోజనం పరిమితమే. కావాల్సింది మీ జైవిక వయసు . అంటే శరీర నిర్మాణ పరంగా మీ వయసు. క్యాలెండరు వయసు 50+ ఉన్నా జైవిక వయసు 20+ ఉండేవారు ఉన్నారు. అదే విధంగా క్యాలెండరు వయస్సు 30 ఉన్నా జైవిక వయస్సు 50 ఉండేవారు ఉన్నారు.

దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలనుకొంటున్నారా ?
ప్రతి మనిషిలో 23 జతల క్రోమోజోములుంటాయి. ప్రతి క్రోమోజోమ్, DNA ఇంకా ప్రోటీన్లతో తయారవుతుంది. DNAలో జీన్స్ ఉంటాయి. ఈ జన్యువులే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన జైవిక సూచికలు. కణాలు ఎలా పని చెయ్యాలో ఇవి నిర్ణయిస్తాయి. అంటే కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ మాదిరి. మానవ శరీరం ఈ ప్రోగ్రాం ప్రకారం నడుస్తుంది.

మొత్తం ప్రోగ్రాం పుట్టుకతో రాదు. మన జీవన శైలి కూడా ఈ ప్రోగ్రాంను నిర్ణయిస్తుంది. ప్రతి క్రోమోజోమ్‌ కొసలో టెలోమేర్ అనే నిర్మాణం ఉంటుంది. అందులో జన్యువులుండవు. ప్రతి మనిషి శరీరంలో ప్రతి కణం విభజితమౌతూ ఉంటుంది. ప్రతి రోజూ మన శరీరంలో కొన్ని వేలకణాలు మరణిస్తాయి. కొత్త కణాలు పుడతాయి. ఇది నిరంతర ప్రక్రియ. కణం విభజితం అయ్యేటప్పుడు టెలోమెర్ లు పొట్టిగా మారుతుంటాయి . ఒక దశ లో టెలోమెర్ లు మరీ పొట్టిగా అయిపోతాయి .

అప్పుడు కణవిభజన సాధ్యం కాదు . అప్పటినుంచి కొత్త కణాలు రావు . ఉన్న కణాలే ముసలివిగా మారి పోతాయి. వృద్ధాప్యం అప్పటినుంచి మొదలవుతుంది . కొంత మందికి పుట్టుకతో పొడవయిన టెలోమెర్‌లు వస్తాయి. అలాంటి వారు ఎక్కువ కాలం బతుకుతారు. రియల్ ఎస్టేట్ ఇంకా రాజకీయ రంగం లో కూడా పేరుగాంచిన ఒక తెలుగు సినిమా నటుడు వయస్సు 83 . ఇటీవల ఆయన తల వెంట్రుకలకు డై వేసుకోవడం మానేశారు . లేక పొతే యాభై వయసు వ్యక్తి లాగా కనబడుతారు.

తన తల్లి కూడా వందేళ్ల దాక బతికినట్టు ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు . ఇలాంటి వారిలో పుట్టుకతో పొడవయిన టెలోమెర్ లు వస్తాయి . దీని వల్ల 70-80 ఏళ్ళు వచ్చినా కణవిభజన జరుగుతూనే ఉంటుంది. కొత్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వృద్ధ్యాప్యం చాలా లేట్ గా వస్తుంది. 80 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా వుంటారు . ఆరోగ్య కరమయిన దినచర్య ద్వారా టెలోమెర్‌లు పొట్టిగా కాకుండా చూసుకోవచ్చు.

ఏం చేయాలంటే?
1 . ప్రతి రోజు శరీరానికి భౌతిక శ్రమ ఇవ్వాలి. కూర్చుని రోజంతా గడిపే వారు, కనీసం అరగంట నడవని వారు త్వరగా వృద్దులై పోతారు. వృద్ధాప్యం కాళ్లనుండి మొదలవుతుంది. తిన్నగా ముందుకు నడవకుండా ఎప్పుడైతే లోలకంలా కాస్త అటు ఇటు ఊగుతూ నడవడం మొదలెట్టారో .. అప్పుడే ప్రమాద గంటికలు మోగినట్టు.

2. సుఖ నిద్ర. నిద్రలో మన శరీరం, తనని తాని రిపేర్ చేసుకుంటుంది . పెద్దవారికి కూడా రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.

3. ప్రోటీన్ లు కేవలం యువకులకు అని చాలా మంది అనుకొంటారు . వయస్సు 40 దాటాక ప్రోటీన్ల అవసరం ఎక్కువవుతుంది . తగినంత ప్రోటీన్ తిని శరీరానికి భౌతిక శ్రమ కల్పిస్తే కండలు వస్తాయి. శరీరం అనే భవనానికి ఎముకలు ఇటుకలయితే.. కండలు సిమెంట్. కండలు లేకపోతే చర్మం మడతలు పడి బలహీనం అయిపోతుంది.

ఎముకల దారుఢ్యం కోసం తగినంత కాల్షియమ్ తీసుకోవాలి. నువ్వుల ద్వారా శరీరానికి కాల్షియం అందించవచ్చు. ఇక్కడో విషయం. శరీరంలో D విటమిన్ తగినంత లేకపోతే కాల్షియంను జీర్ణించుకునే శక్తిని కోల్పోతారు. కాబట్టి ఎండలో అర గంట నడవడం. ఒక నువ్వుల ఉండ రోజూ తినడం చెయ్యాలి.

4. ఆనందకరమయిన జీవితం. 50 దాటాక ఒంటరి జీవితం ప్రమాదకరం. మానసిక కుంగుబాటు... అన్నిటికీ మించి డెమెన్షియా అంటే మతి మరుపు వ్యాధి వచ్చేస్తుంది . నిద్ర పోతున్నప్పుడు మినహా ఎప్పుడూ ఏదో ఒక పనిలో పడాలి. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండాలి . APJ అబ్దుల్ కలాం రిటైర్ అయ్యాక దర్జాగా కాలుపై కాలు వేసుకొని కూర్చోలేదు. తన కిష్టమయిన ఉపాధ్యాయ వృత్తి లోకి వెళ్లారు. పాఠం చెబుతూనే మరణించారు . రూ.1000 కోట్లు ఇచ్చినా రాని సుఖ మరణాన్ని పొందారు.

అదీ జీవితం అంటే. మనవలు, దత్తత తీసుకొన్న పిల్లలు, అనాధ శరణాలయాలు .. పెంపుడు జంతువులు.. మనసుంటే వెయ్యి మార్గాలు . వయయసొచ్చాక "రామ గోవిందా" అంటూ కాలం గడపాలి అని చాల మంది అనుకొంటారు . "రామ గోవిందా "అంటే దైవాన్ని స్మరించుకొంటూ అనే అర్థం వరకు అయితే ఓకే. కానీ దీని అర్థం అన్ని పనులు మాని ఇంట్లో ఒంటరిగా కూర్చోమని కాదు . ఉపనిషత్తుల్లో వానప్రస్థం తరువాత, సన్యాస ఆశ్రమాన్ని నిర్దేశించారు.

గృహస్థ ఆశ్రమం లో తనకోసం .. తన కుటుంబం కోసం పని చెయ్యాలి . సన్యాస ఆశ్రమంలో సమాజమే తన కుటుంబం అనుకొని. ధర్మాన్ని అంటే మంచి చెడు నలుగురికి చెబుతూ... ఊరూరా తిరగాలి. ఇది ఉపనిషత్తులు చెప్పింది. " నాదేముంది .. అంతా అయిపోయింది " అనుకుని TV ముందు కూర్చుని.. వాట్సాప్‌పై కాలక్షేపం చేసేవారు సన్నాసులు. తానూ బతికినన్నాళ్లు తానూ తనతోబాటు అందరూ బాగుండాలి అనుకొని పని చేసేవాడు సన్యాసి. పని - ఒక దశలో భుక్తి కోసం . అటుపై ఆరోగ్యం కోసం .. సమాజం కోసం . పని మానొద్దు

వాసిరెడ్డి అమర్‌నాథ్‌,
మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త

Advertisement
Advertisement