Sakshi News home page

పిల్లలు మాట్లాడేటప్పుడు నత్తి వస్తోందా?

Published Tue, Mar 16 2021 2:28 PM

Children Speak Stammering Words Leads To  - Sakshi

పిల్లలు మాట్లాడుతున్నప్పుడు నత్తి రావడాన్ని స్టామరింగ్‌ లేదా స్టట్టరింగ్‌ అంటారు. ఈ కండిషన్‌ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. ఈ సమస్యకు ఫలానా అంశమే  కారణం అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్‌ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్‌ ఇంకా ఎక్కువ కావచ్చు. 

మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్‌ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్‌ ఉన్నప్పటికీ... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలోనూ ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. 

ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం మన బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య పూర్తిగా తగ్గిపోయేలా చేయడం జరగదు. అయితే స్పీచ్‌ ఫ్లుయెన్సీ, స్టామరింగ్‌ మాడిఫికేషన్‌ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి పిల్లలను తొలుత ఈఎన్‌టీ, తర్వాత స్పీచ్‌ థెరపిస్ట్‌ వంటి నిపుణులకు చూపించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement