ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్‌ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..? | Sakshi
Sakshi News home page

ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్‌ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?

Published Sun, Aug 6 2023 2:21 PM

Heather Kullorn: Babysitter Missing For 24 Years - Sakshi

అది 1999 జూలై 15. తెల్లవారుజామున మూడు కావస్తోంది. అమెరికా మిస్సోరీ, సెయింట్‌ లూయీలోని రిచ్మండ్‌ హైట్స్‌లో 1600 బ్లాక్‌ ముందు ఉన్నట్టుండి అలజడి రేగింది. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులు.. పోలీస్‌ హారన్స్‌తో ఉలిక్కిపడి లేచారు. చాలాసేపటి నుంచి తమ పక్క ఇంట్లో పసికందు ఏడుపు వినిపిస్తోందని.. తమకేదో అనుమానంగా ఉందని ఓ కుటుంబం.. ఎమర్జెన్సీ కాల్‌ చేయడంతోనే పోలీసులు అక్కడికి వచ్చారు.

సదరు కుటుంబమిచ్చిన సమాచారంతో.. అంతా ఆ అనుమానాస్పద ఇంటి తలుపు తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. లోపల బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే బయటున్నవారందరికీ హృదయం ద్రవించిపోతోంది. తీరా తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఆ పసిపాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. దాంతో అంతా షాకయ్యారు. ఇరుగూ పొరుగూ ఆ పాపని సేదతీర్చే పనిలో పడ్డారు. కాసేపటికి పోలీసు కన్ను పడకగదిలో రక్తపుచుక్కల్ని పసిగట్టింది. వెంటనే ఇల్లంతా శోధించారు.

రక్తం మరకలున్న చేతి రుమాలు, చెత్తబుట్ట వెనుక రక్తంతో తడిసిన తలదిండ్లు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు.. అదో మిస్టీరియస్‌ కేసుగా మిగలబోతోందని అక్కడున్న వారెవ్వరికీ తెలియదు. ఈ పాప తల్లిదండ్రులు.. డానా మాడెన్‌(తల్లి), క్రిస్టోఫర్‌ హెర్బర్ట్‌(తండ్రి) అనే దంపతులు. వాళ్లు ఆఫీసులకు వెళ్లినప్పుడు పాపని చూసుకోవడానికి ఎవరో తెలిసిన వాళ్ల అమ్మాయిని కేర్‌ టేకర్‌గా పెట్టి వెళ్తారని.. కనీసం ఆ అమ్మాయి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని.. పోలీసులకు స్థానికుల్లో కొందరు చెప్పారు. 

అసలు చంటిపాపను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎవరు? అని ఆరా తీస్తే.. పన్నెండేళ్ల హెదర్‌ కులోర్న్‌ అని.. తను, మాడెన్‌ స్నేహితురాలైన క్రిస్టీన్‌ కులోర్న్‌ కూతురని తేలింది. బ్లో మిడిల్‌ స్కూల్‌లో చదువుతున్న ఆ పాప.. మాడెన్‌ కూతురికి కేర్‌టేకర్‌గా ఉండేదట. క్రిస్టీన్, మాడెన్, హెర్బర్ట్‌లతో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి పాపతో ఆ ఇంట్లో ఉన్నది హెదరేనని పోలీసులకు స్పష్టమైంది. రెండు రోజులకు ఆ ఇంట్లో దొరికిన బ్లడ్‌ శాంపిల్స్‌ను డీఎన్‌ఏ పరీక్షకు పంపిస్తే.. ఆ రక్తం హెదర్‌దేనని తేలింది. అసలు హేథర్‌కి ఏమైంది?

‘కేవలం మా పసిబిడ్డను చూసుకోవడానికే ఆ బాలికను ఇంట్లో ఉంచాం. ఆ రాత్రి మేము ఆ ఇంట్లో లేకపోవడం వల్ల ఏం జరిగిందో? హెదర్‌ని ఎవరు ఏం చేశారో? మాక్కూడా తెలియదు’ అని చెప్పుకొచ్చారు మాడెన్‌ దంపతులు. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆ అపార్ట్‌మెంట్‌ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దుప్పట్లో ఏదో బరువైనది మోసుకుని వెళ్లడాన్ని తాను చూసినట్టు ఓ సాక్షి చెప్పాడు. అయితే ఆ దుండగుడ్ని అతడు గుర్తించలేకపోయాడు. ఆ దుప్పట్లో ఉన్నది హెదర్‌ మృతదేహం కావచ్చని కొందరు నమ్మారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాల్లేవు.

హెదర్‌ కోసం ఆమె తల్లి క్రిస్టీన్‌ గుండెలవిసేలా ఏడ్చింది. ‘నా బిడ్డకు మధుమేహం ఉంది.. తనకు మందులు అందకపోతే ఎక్కువ కాలం బతకలేదు. రోజువారీ ఇన్సులిన్‌ ఇస్తూ, తరచుగా రక్తపరీక్ష చేస్తూ ఉండాలి. దయచేసి నా బిడ్డను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటే వదిలిపెట్టండి’ అంటూ మీడియా ముఖంగానే వేడుకుంది. అయినా హెదర్‌ సమాచారం బయటికి రాలేదు. ఆ తల్లి వ్యథ ఎందరినో కంటతడి పెట్టించింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. ప్రీప్లాన్‌గానే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారని.. అది హేథర్‌కి తెలిసినవారి పనేనని.. రక్తపు ఆనవాళ్లు ఉన్నాయంటే చంపేసి ఉంటారని కూడా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే మృతదేహం దొరక్కపోవడంతో క్రిస్టీన్‌ తన న్యాయపోరాటాన్ని ఆపలేదు.

తొమ్మిది నెలలు గడిచినా కేసులో ఎలాంటి పురోగతిలేదు. దాంతో ‘హెదర్‌ ఎక్కడ?’ అంటూ.. మాడెన్, హెర్బర్ట్‌లను అరెస్ట్‌ చేసి.. గట్టిగా నిలదీశారు. కానీ ఆ దంపతులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. మాడెన్‌ ఆ రాత్రి నైట్‌ షిఫ్ట్‌లో ఉందని తేలినప్పటికీ.. హెర్బర్ట్‌ ఎక్కడున్నాడనే దానిపై సరైన క్లారిటీ రాలేదు. అతడు పొంతన లేని ఎన్నో సమాధానాలిచ్చి.. ఆధారాలు లేక నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే క్రిస్టీన్‌ మాత్రం.. ‘తన కూతురు మాయం కావడానికి అసలు కారణం మాడెన్‌ దంపతులకు కచ్చితంగా తెలిసే ఉంటుంది’ అని నమ్మింది.  

ఆ క్రమంలోనే దర్యాప్తులో మరో నిజం బయటపడింది. మిస్సోరీలోని ప్రధాన డ్రగ్స్‌ మూలాలు ఆ అపార్ట్‌మెంట్‌లోనూ ఉన్నాయనే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అంటే అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా ఉన్న  చట్టవిరుద్ధమైన ఆ ల్యాబ్‌ గురించి హెదర్‌కి తెలిసి ఉంటుందని.. అపార్ట్‌మెంట్‌ గ్యారేజీలో మాదకద్రవ్యాల కార్యకలాపాలను ఆమె కళ్లారా చూసి ఉంటుందని.. అందుకే బలవంతంగా అపహరించి, హత్య చేసి ఉంటారని విశ్వసించారు. ఇది పరిష్కారం కాకుండానే.. క్రిస్టీన్‌ 2017 డిసెంబర్‌ 16న కన్నుమూసింది.

ఏదైమైనా హెదర్‌కి ఏమైందనేది మాత్రం బయటపడలేదు. ఒకవేళ సీరియల్‌ కిల్లర్‌ దాడి చేసి ఉంటాడా? మాడెన్‌ భర్త హెర్బర్ట్‌ దురుద్దేశంతో హెదర్‌ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి, చంపేశాడా? లేదంటే హెదర్‌ తన స్నేహితుల్ని గుడ్డిగా నమ్మి.. ఆ ఇంటికి ఆహ్వానించి మోసపోయిందా? అనేది మాత్రం నేటికీ తేలలేదు. 12 ఏళ్ల హెదర్‌ కులోర్న్‌ అదృశ్యమై.. 24 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కేసులో హెదర్‌ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప మిస్టరీ అయితే వీడలేదు.
సంహిత నిమ్మన 

(చదవండి: ఆ దేశంలోని టొమోటా ధర వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!)

Advertisement
Advertisement