హ్యాపీ స్పేస్‌ | Sakshi
Sakshi News home page

హ్యాపీ స్పేస్‌

Published Wed, Aug 23 2023 12:56 AM

Hyderabad women bhargavi starts nature eco play theme of nature world - Sakshi

యాంత్రిక ప్రయాణంలో పోటీ ఎప్పుడూ ఉండేదే! కానీ, చంటిబిడ్డ తన జీవనంలోకి వచ్చినప్పుడు అమ్మ కళ్లలో.. కలల్లో చుట్టూ జీవం ఉండాలనుకుంటుంది. ‘ఆ ప్రయాస నుంచి పుట్టుకువచ్చిందే నా ప్రకృతి ఎకో ప్లే థీమ్‌’ అంటోంది భార్గవి. హైదరాబాద్‌ అల్వాల్‌లో ఉంటున్న భార్గవి నేచురల్‌ కలర్స్‌ వాడకం గురించి అపార్ట్‌మెంట్‌ పిల్లలకు పరిచయం చేస్తూ కనిపించారు. ఆసక్తితో ఆమె చేస్తున్న పని గురించి ప్రశ్నించినప్పుడు పిల్లల కోసం తను సృష్టించిన సహజ ప్రపంచాన్ని మన ముందుంచారు..

‘‘పుట్టింది మెదక్‌ జిల్లాలో. ఎమ్‌టెక్‌ చేసి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో బిజీ బిజీగా మారిపోయాను. పెళ్లై, పిల్లలు జీవితంలోకి వచ్చాక నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. మూడేళ్ల నా కూతురు స్వతంత్రంగా ఎదగాలంటే ఏదైనా హ్యాపీ స్పేస్‌ ఉందా.. అని వెతికాను. కానీ, నాకేవీ సంతృప్తినివ్వలేదు. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే పిల్లల వికాసం అంత బాగుంటుంది అనే తపన నాది. దీంతో చాలారోజులు ఆలోచించాను. నా సేవింగ్స్‌ ఎంత ఉన్నాయో చూసుకున్నాను. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను.

ఆరేళ్లక్రితం నా ఇద్దరు పిల్లలతో ఈ థీమ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాను. ఇప్పుడు ముప్పైమంది పిల్లలు ఉన్నారు. ఈ ముప్పై సంఖ్య దగ్గరే నేను కటాఫ్‌ పెట్టుకున్నాను. స్వలాభం ఏ మాత్రం చూసుకోని ఒక ప్రాజెక్ట్‌ ఇది. నాకై నేను నా పిల్లలకోసం సృష్టించుకున్న ప్రపంచం. ఈ పిల్లలు ఎదిగి, పైస్కూళ్లకు వెళ్లినప్పుడు ఎంత ప్రతిభను చూపిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నాను. ఈ హ్యాపీ స్పేస్‌లో పిల్లలు చేసే అద్భుతాలు కళ్లారా చూడాల్సిందే. అందమైన పెయింట్స్‌ వేస్తుంటారు. సీడ్‌ బాల్స్‌తయారుచేస్తారు.

కాగితాలతో బొమ్మలు తయారుచేస్తారు. కూరగాయలు, పువ్వులతో రంగులు తయారుచేస్తారు. తొమ్మిదేళ్ల పాప ఫిక్షన్‌ స్టోరీస్‌ రాసి, బుక్‌ కూడా పబ్లిష్‌ చేసింది.ఆరుబయట చెట్ల కింద రాలిపడిన పూలు, విత్తనాలను ఏరుకొచ్చి, ఒక్కోదాని గురించి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారికి ఇష్టమైన పండ్లు, కూరగాయలతో సలాడ్స్‌ చేస్తుంటారు. ప్రతీదీ నిశితంగా పరిశీలించడం వల్ల వారిలో ఎంతటి అవగాహన పెరుగుతుందో స్వయంగా చూస్తుంటాం. ఇది వారి మానసిక వికాసానికి ఎంతో మేలు కలిగిస్తుంది.

హ్యాండీ క్రాఫ్ట్‌ తయారీలో పిల్లల చూపే ప్రతిభ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తే ఎన్ని అద్భుతాలు చూపుతారో స్వయంగా నేనే తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుంటాను. రెండేళ్ల నుంచి పద్నాలుగేళ్ల పిల్లలు ఈ గ్రూప్‌లో ఉన్నారు. పిల్లలు వేసే ప్రశ్నలే ఈ ఎకో థీమ్‌లో పాఠ్యాంశాలు.

ఎవరికీ నచ్చలేదు...
మా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఇప్పుడు స్పెషల్‌ కిడ్స్‌ కూడా ఉన్నారు. వారిలో ఎంత ఆర్ట్‌ ఉందో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాను. చాలా మంది పేరెంట్స్‌ ముందు నా థీమ్‌ను ఏ మాత్రం నమ్మలేదు. ‘పిల్లలకు ఈమె ఏమీ నేర్పడం లేదు. ఆడుకోవడానికి వదిలేస్తున్నారు. క్రమశిక్షణగా పిల్లలు ఒక్క దగ్గర కూర్చోవడం లేద’ని చాలా మంది తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కోవిడ్‌ టైమ్‌లో అయితే అందరూ మూసేయమనే సలహాలే. మా ఇంటి నుంచి మరీ ఎక్కువగా వచ్చాయి. ‘జాబ్‌ మానేసి, ఇలాంటి ప్రాజెక్ట్‌ వద్దు, ఎలాంటి లాభాలూ ఉండవు’ అనే మాటలే నా చుట్టూ విన్నాను.

కానీ, లాభం కోసం ఈ థీమ్‌ని ఎంచుకోలేదు. నా పిల్లల కోసం ఎంచుకున్నాను.  నేను నమ్మిన ఈ సిస్టమ్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. నా ఈ థీమ్‌కు తగిన టీచర్లను ఎంపిక చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. దీంతో నేనే కొందరిని ఎంపిక చేసుకొని, నాకు తగినవిధంగా ట్రైన్‌ చేసుకున్నాను. అదే పట్టుదలతో కొనసాగించాను. ఫైనాన్షియల్‌గా ఇది సక్సెస్‌ఫుల్‌ అని చెప్పలేం. కానీ, ఎప్పటికీ నిలిచే ఉండేది, నాకు సంతృప్తిగా అనిపించిన ప్రపంచం ఇదే. దానినే పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాను. నా పిల్లలనూ ఈ ప్రపంచంలో పెంచడం చాలా హ్యాపీగా ఉంది.

అవగాహన కార్యక్రమాలు...
ఈ థీమ్‌ వల్ల పిల్లల్లో జరిగే మానసిక వికాసం ఎంతగా ఉంటుందో తెలియజేస్తూ కార్పోరేట్‌ స్కూళ్లలో అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల్లోని స్వయంప్రతిభ ఎలా ఉంటుందో, వారిని వారిలాగే ఎలా ఎదగనివ్వాలో మా నేచర్‌ పిల్లలను పరిచయం చేసి, మరీ చూపుతుంటాను. రోజువారీ మనకు ఏం అవసరమో వాటన్నింటినీ స్వయంగా ఇక్కడి పిల్లలు చేస్తుంటారు. వాళ్లే వంట చేయడం, తినడం.. ఏదీ కూడా చెప్పకుండానే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, తమ ప్రతిభను చూపుతుంటారు. లాభాపేక్ష లేకుండా చేసే ఈ పని రాబోయే తరాలకు ప్రయోజనం కలిగించడమే నాకు వచ్చే ఆదాయం’ అని చెబుతోంది భార్గవి.

– నిర్మలారెడ్డి
ఫొటో: మోహనాచారి

Advertisement
Advertisement