పాక్‌లో హిందూ డిఎస్పీ

24 Apr, 2021 00:27 IST|Sakshi
మనీషా రూపిత

తొలి మహిళ

కొద్ది రోజుల క్రితం వరకు మనీషా రూపిత కరాచీలోని జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సెంటర్‌లో వైద్యురాలు. ఇప్పుడు ఆమె సిం«ద్‌ ప్రావిన్సులోని జకోబాబాద్‌ జిల్లా డిఎస్పీ! ‘డీఎస్పీలు వస్తుంటారు పోతుంటారు’ అనుకోవచ్చు. ఇక్కడ అలా అనుకోడానికి లేదు. పాకిస్తాన్‌లోనే తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రూపిత! అయితే.. సర్వీస్‌ కమిషన్‌ విజేతగా సింద్‌ ప్రావిన్స్‌లోని హిందూ మహిళలకు తననొక ప్రతినిధిగా రూపిత భావించడం లేదు. సింద్‌ గ్రామీణ మహిళలందరికీ తన విజయం ఒక ప్రేరణ అవాలని మాత్రమే కోరుకుంటున్నారు!

‘సింద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ (ఎస్పీఎస్సీ) పరీక్షలో ర్యాంక్‌ సంపాదించి, ఈ ఘనతను సాధించారు రూపిత. మొదట ఆమె ‘సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసు’ (మన దగ్గర యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) రాశారు. అదొక్కటే అత్యున్నతస్థాయి ఉద్యోగాలకు మార్గం అనుకున్నారు. ఆ తర్వాతే ఆమెకు.. సిం«ద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ర్యాంకు సాధించినా కూడా డైరెక్టు నియామకాలు ఉంటాయని తెలిసింది. పట్టుపట్టి బుక్స్‌ ముందు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు డీఎస్పీ సీట్లో కూర్చోబోతున్నారు. నియామక ఉత్తర్వులు అందాయి. బాధ్యతలు చేపట్టడమే తరువాయి!

మనీషా రూపిత, పాక్‌ పోలీస్‌ దళం

ఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడై, ర్యాంకు సాధించి, డీఎస్పీ అయ్యాక గానీ రూపిత పాకిస్తాన్‌లోనే మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ అన్న సంగతి ఎవరి దృష్టికీ రాలేదు. పాకిస్తాన్‌లో కపిల్‌ దేవ్‌ అనే ఒక హక్కుల కార్యకర్త ‘ప్రథమ’ అనే ప్రత్యేకత కలిగిన ఈ నియామకం గురించి తన ట్విట్టర్‌లో వెల్లడించడంతో రూపితకు అభినందనలు మొదలయ్యాయి. ‘‘పాకిస్తాన్‌లోని హిందువులందరికీ ఇది గర్వకారణం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

రూపిత జకోబాబాద్‌లో బల్లో మాల్‌ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్‌ సెంటర్‌లో మెడికల్‌ థెరపీ డాక్టర్‌గా పని చేస్తున్న రూపిత కు కంబైండ్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌ (సి.సి.ఇ) అయిన ఎస్పీఎస్సీ రాసి గవర్నమెంట్‌లో డైరెక్ట్‌ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా డాక్టర్‌గా సేవలు అందిస్తూనే సర్వీస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యారు. మంచి ర్యాంకుతో లక్ష్యాన్ని చేరుకున్నారు.

‘‘అయితే ఇదేమీ అంత తేలికైన ప్రయాణం కాదు. 2007 నాన్నగారు చనిపోయారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయాం. అయినా అమ్మ మా చదువును మాన్పించలేదు’’ అంటారు రూపిత. ఫీజులు, సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పుస్తకాలు కొనడం కోసం ఆమె ట్యూషన్‌ లు చెప్పారు. ‘‘గెలిచింది నేనే అయినా గెలిపించింది మా అమ్మే. ఆమె కలను నేను నెరవేర్చగలిగాను. అదే నా సంతోషం’’ అంటున్నారు రూపిత. తన విజయం సింద్‌లోని గ్రామీణ మహిళలందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు