Sakshi News home page

ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..!

Published Sat, Mar 23 2024 5:57 AM

Mother and Daughter Fight off Armed Robbers in Hyderabad Home - Sakshi

ధైర్యంగా ఉండమని చెప్పడం అందరూ చేసే పనే. ధైర్యాన్ని ప్రదర్శించడం కొందరు చేసేది. ప్రమాదంలోనూ ధైర్యాన్ని చూపడం అతి కొద్ది మందే చేస్తారు. ఆ అతి కొద్దిమందిలోనూ మేటిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లోని బేగంపేట వాసులైన ఈ తల్లీ కూతుళ్లు. ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులపైకి చిరుతపులుల్లా విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో బెదిరించినా ఆత్మస్థైర్యాన్ని బెదరనివ్వలేదు. ఇద్దరు దండుగులను తరిమి తరిమి కొట్టిన తల్లి అమిత మెహోత్‌. తల్లిని కాపాడుకునేందుకు దుండగులతో వీరోచితంగా పోరాడిన కూతురు బాబీ.

దుండగులు ఎలా ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తారో, ఎలా దాడి చేస్తారో మనం ఊహించలేం. అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ధనాన్నే కాదు ప్రాణాలను సైతం కోల్పోయేవారెందరో. కానీ, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దుండగుల దుశ్చర్యను క్షణమాత్రంలోనే గుర్తించి, ఆ వెంటనే తమ స్థైర్యాన్ని చూపి నేడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు అమిత, బాబీ. స్త్రీలు సబలలు అని నిరూపించిన ఈ వనితలు నేడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు.

‘‘ఎప్పుడో ప్రాక్టీస్‌ చేసిన బాక్సింగ్‌తో పాటు 15 ఏళ్లుగా చేస్తున్న జిమ్‌ వ్యాయామాలు, వీటికి తోడు మార్షల్‌ ఆర్ట్స్‌పై అవగాహన.. ఇవన్నీ దుండగులు తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం బెదరక ధైర్యంగా నిలబడేలా చేశాయి. దోచుకోవడానికి వచ్చిన వారిని తరిమి కొట్టేలా చేశాయి’’ అని తెలిపింది నలభై ఆరేళ్ల అమిత. ఊహించని విధంగా ఆ తల్లీకూతుళ్ల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది.

కొరియర్‌ బాయ్స్‌ వేషంలో..
ఆన్‌లైన్‌ అమ్మకాలు పెరిగాక కొరియర్‌ బాయ్స్‌ మన ఇళ్ల ముందుకు వస్తుంటారు. వారి గురించి మనకేవిధంగానూ తెలియదు. అలాగని, కొరియర్‌ వారంతా ప్రమాదకారులే అని మనం చెప్పలేం. కానీ, ఒక్కోసారి సమస్య ఈ విధంగానూ మనల్ని పలకరించవచ్చు అని గ్రహించాలి అనడానికి గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ‘‘మా ఇంటి గుమ్మానికి, ప్రధాన గేటుకు 200 ఫీట్ల దూరం ఉంటుంది. కొరియర్‌బాయ్స్‌ ఎవరొచ్చినా గేటు బయటనే ఉండి పిలుస్తారు.

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాగ్‌తో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు హెల్మెట్‌ ధరించి ఉండగా మరొకరు మాస్క్‌ ధరించి ఉన్నారు. నేను మొదటి అంతస్తులోనే ఉండి కొరియర్‌ వివరాలు అడిగాను. అమిత (నా పేరు), ఎన్‌కె జైన్ (నా భర్త) పేర్లు చెప్పి కొరియర్‌ వచ్చిందని చెప్పారు. అక్కడే ఉండాలని, వచ్చి తీసుకుంటామని చెప్పాను. నేను కిందికి వచ్చేసరికి గేటు లోపలి నుంచి గుమ్మం వద్దకు వచ్చేశారు.

ఎదుర్కొని .. కనిపెట్టి..
బ్యాగ్‌లో నుంచి కొరియర్‌ పార్శిల్‌ తీస్తున్నట్లుగా తీసి ఒకరు తపంచా (నాటు తుపాకీ)తో నాపై ఎక్కుపెట్టాడు. మరొకరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి కిచెన్ లో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. నా అరుపులకు మొదటి అంతస్తులో ఉన్న కుమార్తె కూడా వచ్చింది. మాపై అటాక్‌ చేస్తుండగా మేం కూడా తిరిగి అటాక్‌చేశాం. ఇద్దరం కలిసి ఆ వ్యక్తి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి, తపంచాను లాగేసుకున్నాం. దీంతో అచేతనుడైన ఆ వ్యక్తి వెంట తెచ్చుకున్న తాళ్లతో మమ్మల్ని కట్టేసేందుకు ప్రయత్నించగా, ఎదురుతిరిగాం.

దాదాపు 20 నిమిషాల సేపు ఘర్షణ జరిగింది. చివరకు ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని బలవంతంగా తోసుకుంటూ బయటకు వచ్చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మేము ఎంతగానో వెంబడించాం. ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకుని కిచెన్ లో ఉన్న మరో వ్యక్తి ఎక్కడ దొరికిపోతాడో అని ఆందోళనపడ్డాం. అతను కూడా పారిపోయేందుకు కత్తితో బెదిరిస్తూ బయటకు వచ్చాడు. మా అరుపులకు ఈ లోగా స్థానికులు రావడంతో అతన్ని పట్టుకోగలిగాం.

తెలిసిన వారే అయ్యుంటారని మేం వారు ధరించిన హెల్మెట్, మాస్క్‌ను తీసేయడంతో వారెవరో కనిపెట్టగలిగాం. కిందటేడాది దీపావళి సమయంలో పది రోజులపాటు మా ఇంటి క్లీనింగ్‌ విషయంలో ఓ ఏజెన్సీని సంప్రదిస్తే, వారు పంపించిన వ్యక్తులే వీళ్లు. మా ఇంటిని క్లీన్‌ చేసే సమయంలో ఏయే వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి, ఇంట్లో ఆడవాళ్లం మాత్రమే ఉండే సమయం చూసి, ఇలా దొంగతనం చేయడానికి ప్లాన్‌ చేసుకున్నారని తెలిసింది. మేం ఎదురు తిరగడంతో వచ్చిన పని గురించి కాకుండా మేము తమ ముఖాలను చూడకుండా కాపాడుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేశారు.

ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే..
గతంలో ఐదేళ్లు బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేశాను. రోజూ జిమ్‌కు వెళ్తుంటాను. మార్షల్‌ ఆర్ట్స్‌పై కూడా అవగాహన ఉంది. అవే నన్ను ధైర్యంగా ఉండేలా, సాహసం చూపేలా చేశాయి. ఎదురొచ్చిన విపత్తు నుంచి కాపాడేలా చేశాయి. ఒక తపంచా, రెండు కత్తులు, తాళ్ల సహాయంతో వారు మమ్ముల్ని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. వారి ప్రతి చర్యను తిప్పికొట్టగాలిగామంటే బాక్సింగ్, ఫిట్‌నెస్‌లే కారణమని కచ్చితంగా చెప్పగలను’’ అని తామ ఎదుర్కొన్న సంఘటనను వివరించారు అమిత.
ఈ తల్లీకూతుళ్లు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత అమిత, ఆమె భర్త, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

డీసీపీ ప్రశంసలు.. సన్మానం..
అమిత, ఆమె కుమార్తె బాబీ ఇద్దరూ చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయం అని నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బేగంపేట పైగా కాలనీలోని అమిత నివాసానికి నేరుగా వచ్చిన డీసీపీ అమితతో పాటు ఆమె కుమార్తెనూ ప్రశంసించి, శాలువాతో సత్కరించారు. మైనర్‌ బాలిక అయినా ఆమె చూపిన తెగువ ఎంతో అభినందనీయమన్నారు.

ఆత్మరక్షణకై మెలకువలు అవసరం
మహిళలు ఆత్మరక్షణ దిశగా మెలకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ఎదురైన అనుభవం లాగా ఎవరి జీవితాల్లోనూ రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వస్తే మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి.
– అమిత

– కోట కృష్ణారావు, సాక్షి, హైదరాబాద్‌

Advertisement

What’s your opinion

Advertisement