Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి.. | Sakshi
Sakshi News home page

Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి..

Published Sat, Apr 6 2024 7:50 AM

Ruchira Gupta: Founder Apne Aap Women - Sakshi

సెక్స్‌–ట్రాఫికింగ్‌ సర్వైవర్స్‌కు అండగా నిలబడి వారికి ఒక దారి చూపుతోంది రుచిర గుప్తా. యాంటీ–ట్రాఫికింగ్‌ యాక్టివిస్ట్, యూఎన్‌ అడ్వైజర్, విజిటింగ్‌ ప్రొఫెసర్, ‘అప్నే ఆప్‌’ కో–ఫౌండర్, రైటర్‌ రుచిర ఎందరో బాధితులకు అక్కగా, అండగా నిలబడింది.

యువ జర్నలిస్ట్‌గా రుచిర గుప్తా నేపాల్‌కు వెళ్లింది. ‘సహజ వనరులను గ్రామాలు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయి’ అనే అంశంపై కథనాలు రాయడానికి ఎన్నో గ్రామాలకు వెళ్లింది. సహజవనరులకు సంబంధించిన సమాచారం మాట ఎలా ఉన్నా చాలా గ్రామాల్లో వినిపించిన మాట..

‘మా ఊళ్లో కొందరు అమ్మాయిలు కనిపించడంలేదు. వారి ఆచూకి తెలియడం లేదు’ మారుమూల హిమాలయ కుగ్రామం అయిన సిందుపాల్‌చౌక్‌లో పేకాట ఆడుతున్న వారిని అమ్మాయిల అదృశ్యం గురించి అడిగింది రుచిర.
    ‘వాళ్లు ముంబైలో ఉన్నారు’ అని అసలు విషయం చెప్పారు వాళ్లు.
నేపాల్‌ నుంచి మన దేశానికి వచ్చిన తరువాత ముంబైలోని  రెడ్‌లైట్‌ ఏరియా కామాటిపురాకు వెళ్లింది రుచిర. అక్కడ చిన్న చిన్న గదుల్లో అమ్మాయిలు బంధించి ఉండటాన్ని గమనించింది. బాధగా అనిపించింది. అయితే ఆమె బాధ దగ్గరే ఆగిపోలేదు. ‘ వారికోసం ఏదైనా చేయాలి’ అని మనసులో గట్టిగా అనుకుంది.
    నేపాల్‌ గ్రామాల నుండి ముంబైలోని వ్యభిచార గృహలకు యువతులు, బాలికల అక్రమ రవాణాను బహిర్గతం చేయడానికి కెనడియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ కోసం ‘ది సెల్లింగ్‌ ఆఫ్‌ ఇన్నోసెంట్స్‌’ అనే డాక్యుమెంటరీ తీసింది.

ఈ డాక్యుమెంటరీ కోసం ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది. వారు చీకటికూపాల్లో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం.. కటిక పేదరికం. ఈ డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు ఆమైపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒకడు కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆమెను రక్షించారు.

అవుట్‌ స్టాండింగ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం ఇచ్చే ఎమ్మీ అవార్డ్‌ను ‘ది సెల్లింగ్‌ ఆఫ్‌ ఇన్నోసెంట్స్‌’  గెలుచుకుంది. అవార్డ్‌ అందుకుంటున్నప్పుడు చప్పట్ల మధ్య, ప్రకాశవంతమైన దీపాల మధ్య ఆమెకు కనిపించిందల్లా చీకటి కొట్టాలలోని బాధితుల కళ్లు మాత్రమే. ‘జర్నలిజంలో నేను మరో మెట్టు పైకి చేరడానికి కాకుండా మార్పుకోసం ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడాలని కోరుకున్నాను’ అంటుంది రుచిర.

అక్రమ రవాణాపై కఠిన చట్టాలు తీసుకురావడానికి సహాయపడాల్సిందిగా అప్పటి యూఎస్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ సెక్రటరీ డోనా షలాలాతో మాట్లాడింది రుచిర. డోనా ద్వారా ఐక్యరాజ్య సమితి సమావేశంలో తన డాక్యుమెంటరీని ప్రదర్శించడమే కాదు వివిధ దేశాలకు చెందిన 180 మంది ప్రతినిధులతో మాట్లాడింది.

ఇరవై రెండు మంది మహిళలతో కలిసి ‘అప్నే ఆప్‌–ఉమెన్‌ వరల్డ్‌ వైడ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ్రపారంభించింది రుచిర గుప్తా. అక్రమ రవాణ నిరోధించడానికి, బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ఈ సంస్థ అలుపెరుగని కృషి చేస్తోంది. వ్యభిచారాన్ని‘కమర్షియల్‌ రేప్‌’గా పిలుస్తున్న ‘అప్నే ఆప్‌’ బాధితులకు సంబంధించి విద్య, ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌ స్కిల్స్, చట్టపరమైన రక్షణ, ప్రభుత్వ పథకాలు... మొదలైన వాటిపై దృష్టి పెట్టింది.

ఇప్పటివరకు ఇరవై రెండు వేలమందికి పైగా మహిళలు, బాలికలను వ్యభిచార కూపాల నుంచి బయటికి తీసుకురావడంలో సహాయపడిన రుచిర ఎంతోమంది అమ్మాయిలు చదువుకునేలా చూసింది. సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది.

దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డ్‌లు అందుకుంది రుచిరా గుప్తా. అయితే వాటి కంటే కూడా చీకటి కూపం నుంచి బయటికి వచ్చిన బాధితుల కంట్లో కనిపించే వెలుగే తనకు అతి పెద్ద అవార్డ్‌గా భావిస్తానంటుంది రుచిర.

ఇవి చదవండి: Thodu Needa Founder Rajeswari: సీనియర్‌ సిటిజన్స్‌కు భరోసా ఏది?

Advertisement
Advertisement