Why Should People Do Not Prefer To Eat Non-Veg in Shravan Masam? - Sakshi
Sakshi News home page

Shravan Masam: అందుకే పెద్దవాళ్లు చెప్పేది.. శ్రావణమాసంలో నాన్‌వెజ్‌ తింటే జరిగేది ఇదే

Published Sat, Aug 19 2023 3:40 PM

Why Should People Do Not Prefer To Eat Non-Veg in Shravan Masam? - Sakshi

శ్రావణమాసం అంటేనే శుభ ముహూర్తాల సమ్మేళనం. ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలతో నియమ, నిబంధనలతో పూజలు ఆచరిస్తారు.

ఇక శ్రావణమాసం పూర్తయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? మాసం పూర్తయ్యే వరకు నాన్‌వెజ్‌ ముట్టుకోకపోవడానికి సైంటిఫిక్‌ రీజన్స్‌ ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు చూద్దాం.

శ్రావణం కోసం కోసం తెలుగు లోగిళ్లలో చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి.నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు.. ఇలా పలు శుభకార్యాలు జరగనున్నాయి. 

ఎప్పటివరకు శ్రావణమాసం?

సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంటుంది. సగటున జులై మధ్య నెలలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. కొన్నిసార్లు అధికమాసం వస్తుంటుంది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈనెల 17 నుంచి  మొదలైన నిజ శ్రావణమాసం సెప్టెంబర్‌ 15వరకు ఉండనుంది. అయితే ఈ మాంసంలో శాకాహారానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వెనుక సైంటిఫిక్‌ రీజన్స్‌ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. 

మాంసం ముట్టరు.. కారణాలు అవేనా?

► శ్రావణమాసం వర్షాకాలంలోనే వస్తుంది. సాధారణంగానే వర్షాకాలంలో కొన్నిరకాల ఆహార పదార్థాలను తినకూడదంటారు. వాటిలో ముందు వరుసలో ఉండేది మాంసాహారం. ఎందుకంటే ఈ కాలంలో హెపటైటిస్, కలరా, డెంగీ వంటి అనేక రోగాలు చుట్టుముడతాయి.
► నీరు నిల్వ ఉండటం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో వ్యాధులు వ్యాపిస్తాయి. ఇదే సమస్య జంతువులకు కూడా ఎదురవుతుంది. దీంతో వాటి ద్వారా ఇన్‌ఫెక్షన్లు మనుషులకు కూడా వస్తాయని అంటుంటారు. 

► ఈ కాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.మాంసం అరగక పేగుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
వాతావరణ మార్పులతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తేలికపాటి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. 
► ఇక మరో కారణం ఏంటంటే.. చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేపడతాయి. ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు జలచరాలు కొన్ని వ్యర్థాలను నీటిలో విడుదల చేస్తుంటాయి. మళ్లీ వాటినే చేపలు తింటుంటాయి. అలా ఈ మాసంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలని అంటారు. పైగా, గర్భంతో ఉన్న జీవాలను చంపి తినడం మంచిది కాదన్న విశ్వాసం కూడా దీనికి మరో కారణం.


 

Advertisement
Advertisement