ఇంటిపంట ఓ ప్రజా ఉద్యమం!

18 Jan, 2021 11:31 IST|Sakshi

ట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఆహారం లో పురుగు మందుల అవశేషాలు ఎరుగుతున్న నేపధ్యం లో 2011లో ‘సాక్షి’ దినపత్రిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం, హార్టీకల్చర్‌ సొసైటీలు కలిసి హైదరాబాద్‌ నగరంలో ఇంటిలోనే, వున్న స్థలం లోనే కొన్ని కూరగాయలు పండించుకోవటం, ఇంటిలో ఉండే జీవ వ్యర్ధాల్ని కంపోస్ట్‌గా మార్చి వాడుకోవటం వాడుకోవటంపై కొన్ని శిక్షణలు, అనుభవాలు పంచుకోవటానికి ఒక వేదిక గా ‘ఇంటిపంట’ ప్రారంభించటం జరిగింది. ప్రతి వారం రెండు రోజులు సాక్షి పత్రికలో వ్యాసాలు, అనుభవాలు పంచుకోవటం, హైదరాబాద్‌ నగరం ఏదో ఒక ప్రాంతంలో ఒక సాయంత్రం దీనిపై శిక్షణ ఏర్పాటు చేయటం వలన వేల మంది ఇందులో పలు పంచుకునే అవకాశం కలిగింది.

మా ఇంటితో పాటు నగరంలో చాలా ఇళ్లు ఇంటిపంటల ప్రదర్శన శాలలుగా మారాయి. ఉద్యానవన శాఖ, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఇంకా అనేక సంస్థలు తమ ఆఫీస్‌పైన కూడా కూరగాయలు పండించటం, భారతీయ విద్యా భవన్‌లాంటి స్కూళ్లలో కూడా పిల్లలతో ఇలాంటి ప్రయత్నాలు చేయటం జరిగింది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్‌ సంస్థల్లోను, స్వచ్ఛంద సంస్థలలోను ఈ శిక్షణలు ఏర్పాటు చేయటం, ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది.

కొన్ని అపోహలు, సమస్యలు.. పరిష్కారాలు

  • చాలా మందికి ఇంటిపైన పంటలు పెంచుకోవటానికి కుండీలు కాని, బెడ్స్‌ కాని ఏర్పాటు చేసుకుంటే బరువుకి ఇంటికి ఏమవుతుంది అని భయపడుతుంటారు. కుండీలు/ బెడ్స్‌లో సగానికంటే ఎక్కువ భాగం కంపోస్ట్, పావు వంతు కోకోపిట్‌ (కొబ్బరి పొట్టు) కలుపుకుంటే బరువు తగ్గుతుంది, నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది, అలాగే మట్టి గట్టిపడే సమస్య తగ్గుతుంది.
  • నీరు పెట్టటం వలన ఇంటి పై కప్పు పాడయ్యే అవకాశం వుంటుంది అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మనం కావలిసినంత మేరకే నీరు పెట్టుకోవాలి, నీరు కొద్దిగా బయటకు వచ్చినా పెద్ద సమస్య ఉండదు. 
  • సీజన్లో పండే కూరగాయలు, ఆకుకూరలు కలిపి ఈ కుండీలు/ కంటైనర్‌లు/ బెడ్స్‌ పైన పండించుకోవచ్చు. ‘ఇంటిపంట’తో వచ్చిన అనుభవాలతో ‘బడి పంట’ కూడా ప్రారంభించటం జరిగింది. చిన్న స్కూల్లో పిల్లలు నేర్చుకోవటానికి ఉపయోగపడే వాటి నుంచి, మధ్యాహ్న భోజన అవసరాలు తీరేలా, హాస్టల్‌ అవసరాలు తీరేలా ఈ బడి తోటలు డిజైన్‌ చేయటం జరిగింది. తెలంగాణ లో ఇప్పుడు కొన్ని రెసిడెన్సియల్‌ స్కూల్‌లో ఈ మోడల్స్‌ ఏర్పాటు చేయటం జరిగింది.


అలాగే, ఇంటిపంట సాగులో భాగస్వాములు అయిన అనేక మంది అనేక మోడల్స్‌ ఏర్పాటు చేయటం, విత్తనాల సేకరణ, పంచుకోవటం చేయటం చేసారు. ఒక సంవత్సరంలోనే 10 వేల మందికి పైగా ఇంటిపంటలు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ కార్యక్రమం ప్రభావం ఎంత వున్నది అన్నది అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికి అనేక పేర్లతో, అనేక వాట్సప్‌ గ్రూప్‌లలో, ఫేస్‌బుక్‌ గ్రూప్‌లలో ఇంటిపంటలు పండించుకునే వారు తమ తమ అనుభవాలు పంచుకోవటం, ఇతరుల నుంచి నేర్చుకోవటం చేస్తున్నారు.

చిన్న స్థలాన్ని కూడా సమర్ధవంతంగా ఇంటి ఆహారం పండించుకోవటానికి ఎలా వాడుకోవచ్చు అని అర్ధం చేసుకోవటంతో పాటు రెండు కీలకమైన అంశాలు ఈ శిక్షణలో భాగస్వామ్యం అయ్యాయి. ఒకటి, ఇంటి వ్యర్ధాల్ని  బయట పడేసి పర్యావరణాన్ని పాడు చేసే కంటే, ఇంటిలో, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లలో, కాలనీలలోనే కంపోస్ట్‌ చేసుకునే పద్దతులు, రెండు, ఇంటిపై, చుట్టూ పడిన వాన నీటిని ఫిల్టర్‌ చేసుకొని మరల వాడుకోవటానికి ప్రయత్నం చేయటం. ఈ మూడు పద్ధతులు కాని ప్రతి ఇంటిలో పాటిస్తే నగరంలో మనం చూస్తున్న చెత్త, వర్షం రాగానే జలమయం అవుతున్న రోడ్ల సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. ఇందుకు ప్రతి కాలనీ/అపార్ట్‌మెంట్‌ వేల్ఫేర్‌ కమిటీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రయత్నాలు చేయాలి.

ఒక చిన్న ఆలోచన, చిన్న ప్రయత్నం ఒక ప్రజా ఉద్యమంగా ఎలా తాయారు అవుతుంది అన్న దానికి మన ‘ఇంటిపంట’ ఒక ఉదాహరణ. ‘సాక్షి’ దిన పత్రిక ఆ తర్వాత చేసిన ‘సాగుబడి’ ప్రయత్నం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి తోడ్పడింది. ఇలాంటి అనేక ప్రయత్నాలు ‘సాక్షి’ చేయాలని, హైదరాబాద్‌ నగర వాసులు ఇలాంటి ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరికీ అభినందనలతో పాటు ఇలాంటి ప్రయత్నాలకి మా వంతు సహకారం ఇస్తామని మరల, ఒకసారి ఇలాంటి ప్రయత్నం అందరం చేయాలనీ ఆశిస్తున్నాం.

– డాక్టర్‌ జీ వీ రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం (90006 99702)

మరిన్ని వార్తలు