ఈ విజయం ఎలా సాధ్యమైంది? | Sakshi
Sakshi News home page

ఈ విజయం ఎలా సాధ్యమైంది?

Published Sat, Mar 26 2022 12:45 AM

Development Gives Victory To BJP Guest Column By Himanta Biswa Sarma - Sakshi

నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుందని ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిరూపించాయి. కేంద్ర పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే గీటురాయి. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజకీయ వివేచనను ప్రశ్నించాయి. ఈ విజయానికి కారణమైన ప్రభుత్వ నమూనా ఏమిటి? ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది.

ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. నూతన భారత్‌ వైపుగా సాగే ప్రయాణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మ.

ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయానికిగానూ, నా తోటి కార్యకర్తలకూ, పార్టీ నేతలకూ, తోటి ముఖ్యమంత్రులకూ అభినందనలు తెలుపుతున్నాను. ఈ చారిత్రక విజయం వైపు మనల్ని ఏది నడిపించింది అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వచ్చాను. భారత రాజకీయ చరిత్రలో 2014 సంవత్సరం మూల మలుపును తీసుకొచ్చింది. ప్రజలను హృదయంలో నిలుపుకొన్న సరికొత్త పాలనా వ్యవస్థ, పరిపాలన ఆ సంవత్సరమే ఉనికిలోకి వచ్చింది. నరేంద్ర మోదీ పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే గీటురాయి అని చెప్పాలి.

మోదీ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే శక్తిమంతంగా పనిచేస్తుందనీ, రాష్ట్రాల ఎన్నికల్లో అది పెద్దగా ప్రభావం చూపదనీ రాజకీయ పండితులు చెబుతూ రావడంతో ప్రతిపక్ష పార్టీలు దాని ఆధారంగా అనేక తప్పులెక్కలు వేసుకున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, కులపరమైన ప్రయోగాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అనుకూలంగా పనిచేయలేదు. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజ కీయ వివేచనను ప్రశ్నించాయి.

సత్పరిపాలనను కీలకంగా తీసుకోని అల్పరాజకీయాలను అవి తుంగలో తొక్కాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోనూ (37 సంవత్సరాలు), ఉత్తరా ఖండ్‌లోనూ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీనే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజాతీర్పు ఇంత అద్భుతంగా ఉంటుందని కొన్ని సంవత్స రాల క్రితం అయితే ఏ రాజకీయ పండితుడూ, వ్యూహకర్తా ఊహించ లేదు.

ఈ అభివృద్ధి నమూనా ఏమిటి?
మరి, మోదీ ప్రభుత్వ నమూనా అంటే ఏమిటి? గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేను చాలా సన్నిహితంగా ఈ నమూనాను పరిశీలుస్తూ అసోంలో విజయం కోసం ప్రయత్నిస్తూ వచ్చాను. ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది. ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి కార్యాలయంతో, ఇతర కేంద్ర మంత్రివర్గ కార్యాలయాలతో సంపూర్ణంగా మిళితం అయ్యాయి కాబట్టే ప్రధాని ప్రారంభించిన కీలక పథకాలను కూడా అత్యంత నిర్దిష్టంగా చివరివరకూ అమలు చేయగలుగుతున్నారు. ఈ డబుల్‌ ఇంజిన్‌ పాలనా నమూనా వల్లే పథకాలను అమలు చేయగలుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రశంసిస్తున్నాయి. ఇదే గేమ్‌ చేంజర్‌ అయింది.

ఉత్తరప్రదేశ్‌ ఉదంతమే తీసుకోండి. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన వల్ల 2.5 కోట్లమంది రైతులు ప్రయోజనం పొందారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిద 1.5 కోట్ల సిలిండర్లను ఉత్తరప్రదేశ్‌ మహిళలు పొందగలిగారు. అంటే ఆఖిల భారత స్థాయిలో ఇది 17 శాతం అన్నమాట. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం కింద పది లక్షల గృహాలు నిర్మించి ఇచ్చారు. 1.3 కోట్ల ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను యూపీలో పంపిణీ చేశారు. మరో 15 కోట్లమంది ప్రజలు ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఉచిత రేషన్‌ కార్డులు పొందారు. మణిపూర్‌లో ఈ పథకం కింద 22 లక్షలమంది ప్రజలు ఉచిత రేషన్‌ కార్డులు పొందారు. మరో 60 వేల గృహాలను పీఎం ఆవాస్‌ యోజన కింద నిర్మించి ఇచ్చారు. ఇవన్నీ విజయవంతమైన పాలనకు సాక్ష్యాధారాలు. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాలు, తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లే గోవా, మణిపూర్‌ ప్రజలు బీజేపీ ప్రభుత్వాలపై తమ విశ్వాసాన్ని మళ్లీ ప్రకటించారు.

నేరుగా అందించే తరహా సంక్షేమం
2014 నుంచి ప్రధాని నరేంద్రమోదీ కొన్ని పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లనే కుటుంబం ఒక యూనిట్‌గా అసలైన అభివృద్ధినీ, దారిద్య్ర నిర్మూలననూ సాధించడానికి వీలుపడింది. జిల్లాల అభి వృద్ధితో మొదలై బ్లాక్‌ అభివృద్ధి వరకు పథకాలు సాధించిన విజయం గానీ, జల్‌ జీవన్‌ మిషన్‌ గానీ, దేశవ్యాప్తంగా టాయిలెట్ల నిర్మాణం గానీ ఏది తీసుకున్నా సరే... నూతన భారత్‌ వైపుగా సాగే ప్రయా ణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మగా నిలుస్తుంది. జన్‌ధన్, ఆధార్, మొబైల్‌ త్రయం వంటి టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా పేదల్లోని నిరు పేదలకు ప్రయోజనాలను నేరుగా అందించే తరహా సంక్షేమ నమూనాకు ఈ పాలనా నమూనా అత్యంత సన్నిహితంగా ఉంటుంది. టెక్నాలజీ ప్రాతిపదికన సాగే ఈ వైఖరి ఉచిత సరఫరా యంత్రాంగానికి సరైన నిర్వచనం ఇచ్చింది. ‘యూపీఏ’ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వైఖరి ఉండేది కాదు. వాస్తవానికి మోదీ ప్రభుత్వ నమూనా ఆయన రేడియో షో ‘మన్‌ కీ బాత్‌’కు విస్తృత రూపమే అని చెప్పాలి. ఈ షోలో ఆయన తన ప్రజలతో నేరుగా కనెక్ట్‌ అవుతారన్నది తెలిసిందే.

దీన్ని మరింతగా వివరించాలంటే, ఈ నమూనా నుంచి పుట్టుకొచ్చిన అన్ని పథకాలూ అంటే పీఎం ఉజ్వల, పీఎం కిసాన్, జన్‌ ధన్, ఎన్‌ఆర్‌ఈజీఏ, పీఎం ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్, పీఎం గరీబ్‌ కళ్యాణ్‌... ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించిన అన్ని రాష్ట్రాల్లోనూ విజయవంతంగా అమలవుతూ వచ్చాయి. ఈ పథకాలకు చాలావరకు కేంద్రమే నిధులిచ్చింది గానీ రాష్ట్రస్థాయిలో అమలయ్యాయి. ప్రధానమంత్రి కార్యాలయంతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహితంగా సమన్వయంతో పనిచేసింది కాబట్టే ఈ విజయం సాధించగలిగాము. ప్రధాని నిర్దేశించిన అన్ని పథకాలూ లబ్ధిదారులకు అందేలాగా అమలు చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రిగా నేను తీసుుకున్నాను. 

పథకాలే గెలిపించాయి
ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాని గరీబ్‌ కళ్యాణ్‌ యోజన, పీఎమ్‌ కిసాన్, పీఎమ్‌ ఉజ్వల, జన్‌ధన్, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలను అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వ పథకాలుగా భావించారని 2022 సీఎస్‌డీఎస్‌ పోస్ట్‌ పోల్‌ సర్వే నివేదించింది. ప్రత్యేకంగా ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ యోజన ద్వారా లబ్ధి పొందినవారే బీజేపీకి ఎక్కువగా ఓటేశారని సర్వేలు చెప్పాయి. ఈ వివరాలు బీజేపీ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తలేదు గానీ... ఇతరులకు మాత్రం ఈ నమూనా ప్రభుత్వ వ్యతిరేకతనూ, వ్యతిరేక ప్రచారాన్నీ తటస్థం చేసిందని బోధపడేలా చేసింది.
ప్రధానమంత్రి కార్యాలయంతో అవాంఛిత ఘర్షణలకు దిగే వారికీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా వంచించే వారికీ ఎన్నికల్లో విజయాలు సిద్ధించవని రాజకీయ పరిశీలకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుణపాఠం నేర్పాయి. పంజాబ్‌ దీనికి చక్కటి ఉదాహరణ. నూతన భారత ఓటర్లు అభివృద్ధిని డిమాండ్‌ చేస్తున్నారు గానీ డ్రామాలను కాదు. నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుంది. దీనికోసం రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశాన్ని మరోసారి విశ్వగురుగా మార్చాలనే దార్శనికతతో మనం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జరుపుకొంటున్నాం. మనం కలిసి పనిచేయడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించగలం. మోదీ నమూనా ఈ లక్ష్యాన్ని సాధించేలా కనబడుతోంది.
హిమంతా బిశ్వ శర్మ
వ్యాసకర్త అస్సాం ముఖ్యమంత్రి

(‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో...)

Advertisement

తప్పక చదవండి

Advertisement