మహిళలే నవ భారత నిర్మాతలు | Sakshi
Sakshi News home page

మహిళలే నవ భారత నిర్మాతలు

Published Tue, Mar 8 2022 12:32 AM

International Womens Day Special Article By ABK Prasad - Sakshi

ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు.

కొన్ని దశాబ్దాల క్రితమే చిలకమర్తి లక్ష్మీ నరసింహం ‘ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నాడు. స్త్రీ–పురుష విభ జన జీవశాస్త్ర సంబంధమైనదే తప్ప పురుష ఆధి క్యతా ధోరణికి ఆమోద ముద్ర కాదని ప్రకటిం చాడు. ఆస్తిని విభజించినట్టే... స్త్రీ–పురుషుల్ని ఒక యూనిట్‌గా కాకుండా రెండు ‘వర్గా’లుగా చీల్చి తమ ఆధిక్యతా సామ్రాజ్యాన్ని స్త్రీమూర్తిపై స్థాపిం చుకోవడం కోసం పురుషులు తహతహలాడి నందునే మహిళా ఉద్యమాల ఆవశ్యకత వచ్చింది. ‘సెక్స్‌’ అనే పదం చాటున జరిగే ఈ కృత్రిమ విభజనకు 20వ శతాబ్దపు ఫ్రెంచి మహిళా ఉద్యమ నాయకురాలైన సిమన్‌ దిబోవర్‌ అడ్డుకట్ట వేసింది. ఆదిమ మానవుల్లో స్త్రీ–పురుషులు ఎదురు బొదురుగా నిల్చిన రెండు మానవా కృతులనీ, ఈ ఏకత్వాన్ని చెదర గొట్టింది స్త్రీమూర్తి కాదనీ దిబోవర్‌ ప్రకటిం చింది. యాజ్ఞవల్క్య ముని సహితం ‘రెండుగా చీలిన వెదురు బొంగే – సతి, పతి’ అన్నాడు! దిబోవర్‌ కన్నా పాతికేళ్లముందే గుడి పాటి వెంకటచలం... ‘స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి’ అన్నాడు! దిబోవర్‌ ఈ సమరంలో ‘పురుషులను తుడిచిపెట్టి ముందుకు సాగిపోవాలన్న దుష్ట తలంపు స్త్రీకి కలలో కూడా రా’దని చెబుతూ...  కేవలం ఉద్య మాల వల్లనే, ఆచరణలో వినియోగంలోకి రాని కొన్ని అరకొర చట్టాలను సాధించుకున్నంత మాత్రాన్నే నిజమైన విమోచన కాదని చెప్పింది. స్త్రీలోని అంతర్‌ శక్తి ప్రబుద్ధమై తానూ జీవితానికి సాధికార వ్యాఖ్యాత కావాలన్నది ఆమె  ప్రబోధం. అందుకే పితృస్వామిక వ్యవస్థలో అణగారుతూ వచ్చిన ‘మాధవి’కి తగిన ‘మాధ వుడు’ దొరికేదాకా ఈ పోరాటం ఆగబోదని చెప్పింది.  స్త్రీ–పురుషుల మధ్య ఉన్న సంబంధం కేవలం మానవుల మధ్య అనుబంధం తప్ప మరొ కటి కాదన్న మార్క్స్‌ వాక్యాలతో దిబోవర్‌ తన ‘సెకండ్‌ సెక్స్‌’ ఉద్గ్రంథాన్ని ముగించడం విశేషం. 

అసలు ఫ్రెంచి విప్లవానికి మహిళలే పూర్తిగా నాయకత్వం వహించి ఉంటే ప్రపంచ చరిత్ర ఎలాంటి మలుపులు తిరిగి ఉండేదోనని సోవియెట్‌ సోషలిస్టు నేత వ్లాదిమిర్‌ లెనిన్‌ నిబిడాశ్చర్యం ప్రకటించాడు. ఎందు కంటే, అరకొర మార్పు లతో, పురుషాధిక్యతా రాజ కీయ పాలకవర్గాలు చేసే స్వార్థపూరిత చట్టాలు ఆచ రణలో ఉన్నంతకాలం, అవి ‘ఉనికి’లో ఉంటాయే గానీ, వాటి ‘ఉసురు’కు విలువ లేదు, రాదు. ఈ దుఃస్థితిలో ‘మహిళల అభ్యున్నతి కోసమే చట్టా లున్నా’యన్న పాలకవర్గాల మాటకు విలువ లేకుండా పోయింది. కారణం, చెప్పిన మాటకు, చేస్తున్న చట్టాలకు ఆచరణలో పొంతన లేకపోవ డమే. విలువ ఉన్న పక్షంలో శాసన వేదికల్లో వారి ప్రాతి నిధ్య శాతాన్ని ఎందుకు కుదిస్తున్నారు? 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించవలసిన ప్పుడు కనీసం దాన్ని వారు రాజీపడి సర్దుకుం టున్న 30 శాతానికి కూడా ఎందుకు పెంచలేకపోతు న్నారు? విశ్వకవి టాగోర్‌ మాటలకు నేటికీ విలువ తగ్గ లేదు. ‘మన శత్రువు మన సంకెళ్లను ఎంత గట్టిగా బిగిస్తే, అంత బలంగానూ మన సంకెళ్లు తెగి పోతాయి. శత్రువు కళ్లు ఎంతగా చింత నిప్పులైతే, అంతగానూ మన కళ్లూ నిప్పులు చెరగగలవు’.

ఇవాళ కాదు, 1950 నుంచీ అవినీతికి వ్యతి రేకంగా గళమెత్తిన ఉద్దండులైన దేశ ఉన్నతాధి కారులు – కౌల్దార్, వాంఛూ, సంతానం, దగ్లీ, కాల్కర్, వోహ్రా కమిటీల సిఫారసులన్నీ ఏ గంగలో కలిశాయి? చివరికి లోక్‌పాల్‌ గతి ఏమైంది? 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రోద్యమం తర్వాత కూడా గాంధీజీ సంధించిన ప్రశ్నకు ఈ రోజుదాకా మనం సూటైన సమాధానం చెప్పలేని దుర్గతిలో ఉన్నాం. మన దేశంలో అర్ధరాత్రి వేళ స్త్రీ ఒంటరిగా, నిర్భయంగా బజారులో వెళ్లగల పరిస్థితి ఉందా? ‘పది గంటల పనిదినం’ యూరప్‌లో మొదటి సారిగా ప్రవేశపెట్టిన రోజున కారల్‌మార్క్స్‌ ఆ చట్టం గురించి చిత్రంగా వ్యాఖ్యానించాడు: ‘ఇది కష్టజీవులైన శ్రామిక వర్గానికి సూత్రబద్ధమైన విజయం. ఎందుకంటే, చరిత్రలో మొదటిసారిగా మధ్యతరగతి రాజకీయ అర్థశాస్త్రం కార్మికవర్గ రాజ కీయ అర్థశాస్త్రానికి పట్టపగలే లొంగిపోయింది. ధనస్వామ్య వ్యవస్థలో ‘విశ్రాంతి’ కూడా కొలది మందికి మాత్రమే అందుబాటులో గల ‘విలువైన వస్తువే’గానీ, రెక్కాడితేగానీ డొక్కాడని అసంఖ్యాక శ్రమజీవులైన స్త్రీ–పురుషుల బతుక్కి మాత్రం శాంతీ లేదు, విశ్రాంతీ లేదు’ అన్నాడు. 

‘భారత ప్రజలమైన మేముగా రచించుకుని అంకితమిచ్చుకున్న’ రాజ్యాంగాన్ని ప్రజలకు వ్యతి రేకంగా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొనే హక్కు దేశ పాలక వర్గాలకూ, పార్టీలకూ లేదని చాటి చెప్పిన రాజ్యాంగం మనది. అయినా, మహిళా హక్కులకు సంబంధించి మహిళా ప్రతి నిధులు ప్రవేశపెడుతూ వచ్చిన పెక్కు ప్రతిపాదన లను ఏదో ఒక మిష పైన అమలులోకి రాకుండా శతధా అడ్డుకుంటూనే వచ్చారని మరవరాదు. ఫ్రెంచ్‌ మహిళల చొరవ వల్లనే బానిస దుర్గంగా పేరొందిన బాస్టిల్లీ స్థావరం కుప్పకూలింది. అదే యావత్తు ఫ్రెంచ్‌ ప్రజలకు ప్రజాస్వామ్య రక్షణ దుర్గంగా చరిత్రలో కీర్తికెక్కింది. 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement