భారతీయ గ్రామాల్లో ఇంగ్లిష్‌ విప్లవం | Sakshi
Sakshi News home page

భారతీయ గ్రామాల్లో ఇంగ్లిష్‌ విప్లవం

Published Mon, Oct 3 2022 11:41 PM

Kancha Ilaiah Guest Column English Education In Villages Of India - Sakshi

ఇంతవరకు దేశంలో ఆంధ్రప్రదేశ్‌ లాంటి ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్రాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి.

ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్‌ పదాలు వచ్చి చేరుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్‌ పదాలు వచ్చిచేరాయి. ఇంగ్లిష్‌ పదాలతో మార్కెట్‌ అనేది మార్పుకు అసలైన యజమానిగా మారిపోయింది. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆపలేవు. 

అక్టోబర్‌ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అదే రోజు భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవం కూడా. భారతదేశంలో ఇంగ్లిష్‌ భాషలో విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. యాదృచ్ఛికంగా అక్టోబర్‌ 5న నా 70వ జన్మదినం కూడా! ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందుబాటులోకి తేవాలంటూ గత 30 సంవత్స రాలుగా నేను చేస్తూ వస్తున్న ప్రచారం ఇప్పుడు ఒక అర్థవంతమైన దశకు చేరుకుంది.

విలియం కారీ, రాజా రామమోహన్‌ రాయ్‌ 1817లో నాటి కలకత్తాలో దేశంలోనే మొట్టమొదటి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను ప్రారంభించారు. 2022 నాటికి ప్రధానంగా వైద్యశాస్త్రం వల్ల ప్రపంచం కాస్త ఉపశమనం చెందింది. అంతర్జాతీయ ప్రసార కర్తగా ఇంగ్లిష్‌ భాషను ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం నిజంగానే ప్రపంచం ధ్వంసం కాకుండా కాపాడింది. సైన్స్, ఇంగ్లిష్‌ రెండూ కలిసి మనలేకపోయి ఉంటే, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మరుభూమి అయిపోయి ఉండేది. 

భారతదేశంలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ఒకట్రెండు రాష్ట్రాలే తమ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇప్పటికే చాలాకాలంగా నాగాలాండ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధన కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి.

కశ్మీర్‌ చాలా కాలానికి ముందే ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా ప్రారంభిం చేసింది. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్‌ బోధించడాన్ని ఎంతగానో ప్రోత్సహించింది. వీటితో పాటుగా, భారతదేశ వ్యాప్తంగా వేలాది ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు కూడా ఉన్న విషయం తెలిసిందే.

నా చిన్నతనంలో నా కుల ప్రజలు మానవులతోనే కాకుండా, జంతువులతో కూడా కురుమ అని పిలిచే భాషలో మాట్లాడేవారు. చాలా కొద్దిమంది ప్రజలు మాత్రమే ఆ భాషను అర్థం చేసుకునేవారు. దానికి లిపి ఉండేది కాదు. నా మొత్తం కమ్యూనిటీ నిరక్షరాస్య కమ్యూనిటీ. లిపి లేని భాష తమలో తాము మాత్రమే మాట్లాడుకునేది. ఇతర గ్రామీణులకు ఆ భాష అర్థమయ్యేది కాదు. 

నా చిన్ని గ్రామం చుట్టూ లంబాడా గిరిజన గుడిసెలు ఉండేవి. వారు గొర్‌ బోలి అనే లంబాడా భాషను మాట్లాడేవారు. గ్రామం లోపల కొన్ని ముస్లిం ఇళ్లు ఉండేవి. వారి పిల్లలు ఉర్దూ మాట్లాడే వారు. ఇక వ్యవసాయ పనులు చేసే అనేక కులాలు తెలంగాణ మాండలికంలోని తెలుగు మాట్లాడేవారు. దాంట్లో చాలా ఉర్దూ పదాలు ఉండేవి. గత 65 సంవత్సరాల నా చైతన్యపూర్వకమైన, భావ ప్రసార జీవితంలో ఒక మందగమనంతో కూడిన నిశ్శబ్ద విప్లవం చోటుచేసుకుంది.

అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, గ్రామీణులు, పట్టణ వాసులు తేడా లేకుండా అన్ని ఇళ్లలో నిదానంగా ఇంగ్లిష్‌ మెల్లగా అడుగుపెట్టేసింది. మార్పు తీసుకురావడానికి ఇది ప్రారంభం. ఈ క్రమంలో బియ్యం స్థానంలో రైస్‌ అనే పదం వచ్చి చేరింది. మాంసం స్థానంలో మటన్‌ వచ్చి చేరింది. చేపలు అనే పదాన్ని ఫిష్‌ తోసి పారేసింది. కోడికూర స్థానంలో చికెన్, కూరగాయల స్థానంలో వెజిట బుల్స్‌ వంటి ఇంగ్లిష్‌ పదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల్లో, కుగ్రామాల్లో అన్ని కమ్యూనిటీలకు సొంతమైపోయాయి. 

గ్రామాల్లోని అన్ని సంతల్లో, అంగళ్లలో కూడా తెలుగు పదాలు పక్కకుపోయి ఇంగ్లిష్‌ పదాలు వచ్చి చేరాయి. ఒక తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. సరుకులకు ఉపయోగించే రోజువారీ పేర్లు, పదాలకు సంబంధించి కూడా ఇంగ్లిష్‌ పదాలు చలామణిలో ఉంటున్నాయి. నిదానంగా అయినా సరే, భారతీయ జీవనం తప్పనిసరిగా ఆంగ్లీకరణకు గురవుతోందని చెప్పాలి. తెలుగు, ఉర్దూ లేదా లంబాడి భాష మాట్లాడే ప్రజలు కూడా నిత్యం ఉప యోగించే ఆహార పదార్థాలు, పేర్లు, నూతన టెక్నాలజీలకు ఇంగ్లిష్‌ పదాలు జోడించడం అలవాటైపోయింది.

వారి జీవితంలోకి ప్రవేశి స్తున్న ఇంగ్లిష్‌ వారి భవిష్యత్తును కూడా మారుస్తోంది. ఇప్పటికైతే ప్రతి గ్రామంలోనూ స్త్రీ పురుషులకు కొన్ని వందల ఇంగ్లిష్‌ పదాలు తెలుసు. ఈరోజు ఇంగ్లిషులో ఉన్న మెషిన్లను ఉపయోగిస్తున్నవారు సెల్‌ ఫోన్‌ వంటి ఇంగ్లిష్‌ పేర్లనే వాడుతున్నారు. వీరి మాతృభాషలో సెల్, ఫోన్‌ వంటి ఇంగ్లిష్‌ పదాలకు సరిసమాన పదాలు లేవు. ప్రాంతీయ టీవీ ఛానల్స్‌ అయితే 30 నుంచి 40 శాతం వరకు ఇంగ్లిష్‌ పదాలు, వాక్యాలనే వాడుతున్నాయి. మార్నింగ్‌ న్యూస్, ఈవెనింగ్‌ న్యూస్, బర్నింగ్‌ టాపిక్, గన్‌ షాట్, బిగ్‌ ఫైట్, బిగ్‌ డిబేట్, న్యూస్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటివి తెలుగు టీవీ స్క్రీన్‌లపై సాధారణంగా ఉపయో గించే పదాలుగా మారిపోయాయి. ప్రాంతీయ భాషలను మాత్రమే ఉపయోగించే ఛానల్స్‌కు వీక్షకులు పెద్దగా లేరు. 

1950లలో బస్సు, ట్రెయిన్‌ వంటి ఇంగ్లిష్‌ పదాలు మన గ్రామా లను చేరుకున్నాయి. ఎందుకంటే ఈ వాహనాల్లో వారు ప్రయాణిం చడం మొదలెట్టారు. అలా ప్రయాణిస్తున్నప్పుడు టికెట్, కండక్టర్‌ వంటి పదాలను కూడా వారు నేర్చేసుకున్నారు. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచే కొద్దీ పనిముట్ల పేర్లు, మెషిన్లు వంటి యంత్రాల పేర్లకు పలు ఇంగ్లిష్‌ పదాలు వాడటం వారి జీవితంలో భాగమై పోయింది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర అనే తేడా లేకుండా ఈ మార్పు జరుగుతూ వచ్చింది. నా తొలి బాల్యంలో నేను ఉపయోగించిన కురుమ భాష అంతరించిపోయినందుకు నేను విచారించలేదు.

అప్పట్లోనే అనేక ఉర్దూ పదాలు కలిసిపోయిన తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. మా గ్రామం మాజీ నిజాం రాజ్యంలో ఉంటున్నందున నాటి తెలుగును గ్రామంలో లేదా సమీ పంలోని పట్టణంలో చాలామంది ప్రజలు అర్థం చేసుకునేవారు. ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్‌ పదాలు వచ్చి చేరుతున్నాయి. వ్యాకరణంతో కూడిన భాషలో మాట్లాడకుండానే ఒక ఇంగ్లిష్‌ పదం లేదా పేరును ఉపయోగించడం ద్వారా చాలామంది ప్రజలు ఇప్పుడు పరస్పరం భావ ప్రసారం చేసుకుంటున్నారు.

గ్రామంలో ఉత్పాదక భాష ఎన్నడూ వ్యాకరణ కేంద్రకంగా ఉండేది కాదు. అది భావ ప్రసార కేంద్రకంగా ఉండేది. ఇంగ్లిష్‌ పదాలు తమ కమ్యూనికేషన్‌ పరిధిని విస్తరించుకున్నాయి. నా తొలి బాల్యంలో గ్రామస్థులు ఇంగ్లిష్‌ పేర్లు కలిగి ఉన్న మెషిన్లను వాడటం మొదలెట్టారు. వాటి విడిభాగాలు కూడా ఇంగ్లిషులోనే ఉండేవి. ఉదా. 1960ల మొదట్లో సైకిల్‌ అనే పేరున్న వాహనం వారి జీవితంలోకి వచ్చేసింది. అలాగే చైన్లు, హ్యాండిల్స్‌ వంటి పదాలు కూడా. ఆ కాలంలోనే వారి గ్రామంలోకి వచ్చిన కరెంట్‌ అదే పేరుతో చలామణీ అయ్యేది. ఆయిల్‌ ఇంజిన్ అదే పేరుతో పిలిచేవారు. వాటి పేర్లతోనే ప్రజలు వాటి పాత్రలను, విధులను అర్థం చేసుకునేవారు.

ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్‌ పదాలు వచ్చిచేరాయి. ఆరెస్సెస్‌– బీజేపీ, కాంగ్రెస్‌ లేదా కమ్యూనిస్టు లేక ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చినా, లేకున్నా ఈ భాషా విప్లవాన్ని ఆపలేకపోయాయి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టులు, పార్సీలు వంటి అన్ని మతాల వాడుకలో ఇంగ్లిష్‌ పదాలు వచ్చి చేరాయి. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆప లేవు.

ఇంగ్లిష్‌ పదాలతో మార్కెట్‌ అనేది మార్పుకు అసలైన యజ మానిగా మారిపోయింది. ఈ మార్పును నేను చూడగలిగాను. ఇత రుల భాషను అర్థం చేసుకోలేని గ్రామాల్లోని ఇరుగుపొరుగు వారు కూడా ఇంగ్లిష్‌ పదాలను ఉత్తమంగా అర్థం చేసుకోవడం మొద లెట్టారు. ఎందుకంటే ఇంగ్లిష్‌ పదాలు వారిని మార్కెట్‌కు అను సంధానం చేశాయి. ఇంగ్లిష్‌ పదాలతో గ్రామ ప్రజలు ఇండియన్స్‌ అయిపోయారు. ఇంగ్లిష్‌ వారిని జాతీయవాదులను చేసింది. హిందీతో సహా ఏ ఇతర ప్రాంతీయ భాష కూడా దీన్ని సాధించలేకపోయింది.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌

వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

Advertisement
Advertisement