భరత జాతికి ఒక ఆంగ్ల నాడి | Sakshi
Sakshi News home page

భరత జాతికి ఒక ఆంగ్ల నాడి

Published Mon, Oct 17 2022 12:25 AM

karan thapar Guest Column Anglo Indian Barry OBrien Book - Sakshi

‘ఎవరు ఆంగ్లో–ఇండియన్‌?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. బ్యారీ ఒబ్రయన్‌ పుస్తకం దీనికి జవాబు చెబుతుంది. ‘‘ఇండియాకు మొదట వచ్చిన పోర్చుగీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్‌లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్‌ రాశారు. స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్‌లు కీలకమైన పాత్రను పోషించారు. ఇక అందరికీ కచ్చితంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్‌ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని!

ప్రచురణకర్తలు నాకు కొత్త పుస్తకాలు పంపిన ప్రతిసారీ వాటిలో ఒకటి అమూల్య మైన రత్నం అయి ఉంటుంది. నా వృత్తిపరమైన సంతోషాలలో అదొకటి. తాజాగా నా చేతికి వచ్చిన ‘ది ఆంగ్లో–ఇండియన్స్‌ : ఏ పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ ఎ కమ్యూనిటీ’ అనే బ్యారీ ఒబ్రయన్‌ పుస్తకం అటువంటి రత్నమే. పుస్తకం గొప్పగా ఉంది. అయితే కొన్ని చోట్ల సాహితీ శైలి కానటువంటి వివరణాత్మమైన దీర్ఘ సంభాషణలతో సాగుతుంది. అదొక అభిభాషణ... రచయితే నేరుగా మీతో మాట్లాడు తున్నట్లు, మీకు చెప్పడానికి ఇంకా ఎంతో ఉన్నట్లు!
‘‘మొదటొక మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నలే కదా మొదట వేయాలి! తర్వాత మిగతా విషయాలు. సరే, ఏంటంటే... మీరెప్పుడూ కూడా తమిళియన్‌ అంటే ఎవరు? బిహారీ అంటే ఎవరు? మలయాళీ అంటే ఎవరు? సిక్కులు అంటే ఎవరు? అనే ప్రశ్నల్ని దాదాపుగా విని ఉండరు. అయితే ఆంగ్లో–ఇండియన్‌ల విషయం పూర్తిగా వేరైనది. ‘ఆంగ్లో–ఇండియన్‌లు ఎవరు?’ అనే సందేహాన్ని ఒక ప్రశ్నగా మీరే కొన్నిసార్లు వేసుకుని ఉండొచ్చు. నిజం చెప్పాలంటే, ‘ఎవరు ఆంగ్లో–ఇండియన్‌?’ అనే ప్రశ్న... ‘ఎవరు బెంగాలీ?’ అనే ప్రశ్న కంటే సమాధానం చెప్పడం చాలా కష్టమైన ప్రశ్న’’ అంటారు బ్యారీ ఒబ్రయన్‌ ఉపోద్ఘాతంగా. గ్రీకు, రోమన్‌ పురాణాలలో సిరులు పొంగి పొర్లుతుండే ‘కార్నుకోపియా’ కొమ్ము వంటి (మన అక్షయ పాత్ర లాంటిది) ఈ పుస్తకంలో... ఆంగ్లో–ఇండియన్‌ల గురించిన సమస్త సమాచారమూ గ్రంథస్థమై ఉందా అనిపిస్తుంది కూడా... మనకు తెలిసింది బాగా తక్కువ కనుక!

బ్యారీ ఒబ్రయన్‌ స్వయంగా ఆంగ్లో – ఇండియన్‌. తన సమూ హపు నాడిపై వేలు ఉంచి ప్రత్యక్షంగా పరిశీలించి చూసినవారు. వారసత్వం, సంస్కృతి, జీవన విధానం, సామాజిక అంశాలలో తన వారి సంపూర్ణ చైతన్యాన్ని లోతుగా పరిశోధించినవారు. ఆయన రాసిన ఈ పుస్తకంలో ఐరోపా సముద్ర శక్తుల ఆగమనం, ఆంగ్లో– ఇండియన్‌ల అవతరణ, స్వతంత్ర భారత నిర్మాణంలో వారి భాగ స్వామ్యం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఒబ్రయన్‌ ఆంగ్లో ఇండియన్‌ అయి ఉండటం ఒక్కటే ఈ పుస్తకానికి ప్రామాణికతను చేకూర్చలేదు. ముప్పై ఏళ్లకు పైగా ఒక సామాజిక కార్యకర్తగా తన సమూహం వ్యవహారాలలో పాల్పంచుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభలో ఆంగ్లో–ఇండియన్‌లకు నామినేటెడ్‌ ప్రతినిధిగా కూడా ఉన్నారు. తన సమూహానికి సంబంధించిన ప్రతి వివరం, ప్రతి విశేషం, గణాంకాలతో సహా ఆయనకు అందుబాటులో ఉంచే విద్యా వంతులైన పరిశోధక విద్యార్థులు ఆయనతో ఉన్నారు. పైగా రచయిత. ఇంకేం కావాలి ఒక అమూల్యమైన పుస్తకం రావడానికి! 

ఆంగ్లో–ఇండియన్‌లు అనుకోకుండా, యాదృచ్ఛికమైన కలయిక లతో అవతరించిన ప్రత్యేక సంతతి కానే కాదని ఈ పుస్తకం చదివే వరకు నాకు తెలియదు. వలసవాదులు ఉద్దేశ పూర్వకమైన ప్రయత్నా లతో శ్రద్ధగా అంటుకట్టి వీళ్లను సృష్టించారు. ‘‘ఆంగ్లో – ఇండియన్‌ల పుట్టుక అప్రమేయమైనది కాదు. ఇండియాకు మొదట వచ్చిన పోర్చు గీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్‌లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్‌ రాశారు. 

నాకు తెలియని మరొక విషయం – స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్‌లు కీలక మైన పాత్రను పోషించారని! ముఖ్యంగా వాళ్లు భారత వైమానిక దళంలో పైలట్‌లుగా ఉన్నారు. ‘‘1947–48 ఇండో–పాక్‌ యుద్ధంలో తమ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించిన పైలట్‌లలో సగంమంది ఆంగ్లో– ఇండియన్‌లే. 1965, 1971 యుద్ధాలలో గగనతలంలో మెరుపులా ఉరిమిన వారిలోనూ ఆంగ్లో–ఇండియన్‌లు ఉన్నారు. శత్రువుపై వీరోచితంగా వైమానిక దాడులు జరిపిన ఆనాటి గ్రూప్‌ కెప్టెన్‌లలో 20 శాతం మంది, వింగ్‌ కమాండర్‌లలో 30 శాతం మంది ఆంగ్లో– ఇండియన్‌లే’’ అంటారు ఒబ్రయన్‌. ఇంకా అనేక ఆసక్తికరమైన వివ రాలు పుస్తకంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 0.01 శాతంగా ఉన్న ఆంగ్లో–ఇండియన్‌లు ఎన్ని యుద్ధ పతకాలు సాధించారో చూడండి. 4 మహావీర చక్ర, 25 వీర చక్ర, 2 కీర్తి చక్ర, 2 శౌర్యచక్ర అవార్డులతో పాటు, 22 వాయుసేన, 13 పరమ విశిష్ట సేవ, 17 అతి విశిష్ట సేవా పతకాలను వీరు సాధించారు! ఆంగ్లో– ఇండియన్‌లు ఎక్కువగా కోల్‌కతాలో, చెన్నైలలో నివాసం ఏర్పరచుకుని ఉండేవారు. స్వాతంత్య్రానంతరం అరవైలు, డెబ్బైలు, ఎనభైలలో అధిక సంఖ్యలో కలకత్తా నుంచి బ్రిటన్‌కు వెళ్లి స్థిరపడ్డారు. మెరుగైన జీవితం కోసం వారు అటువైపు మళ్లారని అంటారు. 

ఇప్పుడిక నాకు తెలిసిన విషయం – నేననుకోవడం మీకూ కచ్చి తంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్‌ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని! ఆ పాఠశాలల నుంచి ఏ స్థాయిలోని వారు వచ్చారో చూడండి. ఒబ్రయన్‌ చెబుతున్న దానిని బట్టి... జె.ఆర్‌.డి. టాటా, సల్మాన్‌ రష్దీ, ఫరీద్‌ జకారియా (వీళ్లంతా ముంబైలోని క్యాథడ్రల్‌ అండ్‌ జాన్‌ క్యానన్‌లో విద్యను అభ్యసిం చినవారు), సయీద్‌ జాఫ్రీ (విన్‌బెర్గ్‌ అలెన్, ముస్సోరీ); అమితాబ్‌ బచ్చన్, కబీర్‌ బేడీ (షేర్‌వుడ్‌ కాలేజ్, నైనితాల్‌), అరుంధతీ రాయ్‌ (లారెన్స్, లోవ్డేల్‌), డాక్టర్‌ రాజా రామన్న, నందన్‌ నీలేకని, కిరణ్‌ మజుందార్‌ షా (బిషప్‌ కాటన్, బెంగళూరు), విశ్వనాథన్‌ ఆనంద్‌ (సెయింట్‌ బీడ్స్, చెన్నై) ఆంగ్లో – ఇండియన్‌లైన టీచర్‌లు, లెక్చ రర్‌లు, ప్రొఫెసర్‌ల దగ్గరే పాఠాలను, అనర్గళమైన ఆంగ్లభాషను నేర్చు కున్నారు. 

ఇప్పుడు మన దేశంలోని పెద్ద వాళ్లంతా మాట్లాడుతున్నది ఆంగ్లో–ఇండియన్‌ ఆంగ్లమేనని మనం మర్చిపోకూడదు. ఈ విష యాన్ని రూఢి పరచడానికి ఒబ్రయన్‌ ప్రముఖ భారతీయ రచయిత ఆలెన్‌ సీలే మాటల్ని మద్దతుగా తీసుకున్నారు. ‘‘భారతదేశంలో ఆంగ్లభాషను బ్రిటిష్‌ పాలకులు అధికారికంగా ఏమీ నిర్వీర్యం చేయ లేదు. నిజానికి ఆంగ్లో – ఇండియన్‌లే ఆ పనిని అనధికారికంగా చేశారు. మెకాలే ఇక్కడ ఆంగ్ల విద్యాబోధనకు పునాదులు వేసినా కూడా బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ వ్యాప్తి జరగకపోవడానికి కారణం ఆంగ్లో – ఇండియన్‌లు తమదైన శైలిలో ఆంగ్ల భాషను బోధించడమే.’’ 

‘ఆంగ్లో – ఇండియనిజమ్స్‌’పై ఉన్న అధ్యాయాన్ని చదివి ఉల్లాస భరితుడినయ్యాను. జిగ్గెరీ పోక్‌ (మోసపూరితమైన లేదా నిజాయితీ లేని ప్రవర్తన), గోయింగ్‌ ఫర్‌ ఎ లోఫ్‌ (సోమరిగా పచార్లు కొట్టడం), గ్యాసింగ్‌ టూ మచ్‌ (పొగడ్తలతో ఉబ్బేయడం) అనే పదబంధా లన్నిటినీ ఆంగ్లో–ఇండియన్‌లే సృష్టించారని ఒబ్రయన్‌ అంటారు. అది నిజమైనా, కాకున్నా అవి నన్నెంతో ఆకట్టుకున్నాయి.

మాట తీరును బట్టి ఆంగ్లో ఇండియన్‌లను ఇట్టే కనిపెట్టవచ్చని అని కూడా ఆయన చెప్తారు. ‘గివ్‌–ఎవే’ పదంతో వారు మాటను పూర్తి చేస్తారు. కొందరు ‘నో’ లేదా ‘నా’ అనే పదాన్ని మాటకు కలుపుతారు. మరికొంతమంది అంత్య ప్రత్యయం (సఫిక్స్‌)గా ‘అప్‌’ అని గానీ, ‘అండ్‌ ఆల్‌’ అని గానీ అంటారు. అత్యంత సాధారణ పదం వచ్చేసి ‘మెన్‌’. ‘కమ్‌ ఆన్‌ మెన్‌’, ‘నో, మెన్‌’, ‘ఐ హ్యావ్‌ హ్యాడ్‌ ఎనఫ్‌ ఆఫ్‌ దిస్‌ మెన్‌’ (విసిగిపోయానబ్బా)... ఇటువంటివి.

ఒక ఫ్రేజ్‌ మాత్రం నన్ను నా బాల్యంలోకి లాక్కెళ్లింది. ‘లెటజ్‌ గో నిన్నీ బైస్‌’(టు స్లీప్‌). మా అమ్మపాడిన ఈ లాలిపాట మూలం ఆంగ్లో–ఇండియన్‌ అని నాకు తెలీదు. ‘నిన్నీ బాబా నిన్నీ / మఖాన్, రోటీ, చిన్నీ / మేరా బాబా సోగయా / మఖాన్, రోటీ హో గయా / నిన్నీ బాబా నిన్నీ’.


కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

 

Advertisement
Advertisement