డ్రాగన్‌కు పావురంతో పనేంటి? | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌కు పావురంతో పనేంటి?

Published Mon, Feb 19 2024 5:05 AM

Sakshi Guest Column On

కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక చైనీస్‌ అక్షరాలున్న ఒక పావురాన్ని గత మే నెలలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘అనుమానాస్పదమైన సమాచారం’ లభించకపోవడంతో విడుదల చేశారు. చివరకు అది తైవాన్‌ నుంచి తప్పిపోయి వచ్చిన రేసు పావురం అని తేలింది. ఇవి రోజుకు వెయ్యి కిలోమీటర్లు ఎగరగలవు. భారత అధికారులు ఒక పావురాన్ని బంధించటం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2020లో కూడా ఇలా జరిగింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కాలంలో పావురాలను నిఘా కోసం ఉపయోగించారు. కానీ గూఢచర్యం కోసం ఇప్పుడు అనేక అత్యాధునిక సాధనాలు ఉన్నప్పుడు, చైనా ఒక రేసు పావురాన్ని వదిలిపెడుతుందా?

తరచూ మన దేశంలో చిత్ర విచిత్రాలు, అద్భుతమైన విషయాలు సంభవిస్తూ ఉంటాయని మనందరికీ తెలుసు. అసలలా ఉండటమే ఇండియాను ఉత్సుకతను రేకెత్తించేలా, ఉత్తేజం కలిగించేలా, అనేకసార్లు ఊహాతీత మైనదిగా చేస్తుంటుంది. అయితే ‘ద వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో ఇటీవల వచ్చిన ఒక కథనం ఇవేవీ కానటువంటి పూర్తి భిన్నమైన కొత్త కోణాన్ని ఇండియాకు జోడించింది. నిజం చెప్పాలంటే, ఆ కొత్త కోణాన్ని నేను ఏ విధంగానైనా వివరించగలనేమో నాకు తెలియటం లేదు. మీకే వదిలేస్తాను. 

‘ద పోస్ట్‌’లో వచ్చిన కథనం ఇలా మొదలౌతుంది: ‘‘చైనా తరఫున గూఢచర్యానికి వచ్చి వాలిందన్న అనుమానంపై ఎనిమిది నెలల పాటు బందీగా ఉంచిన ఒక పావురాన్ని చివరికి అది గూఢచారి ఏజెంట్‌ కాదనీ, దిక్కుతోచక దారి తప్పి వచ్చిన తైవాన్‌ రేసింగ్‌ పక్షి అనీ నిర్ధారించుకున్న భారత అధికారులు దానికి విముక్తి కల్పించారు.’’

కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక ఈకల చాటున చైనీస్‌ అక్షరాలు కలిగి ఉన్న ఈ పావురాన్ని గత మే నెలలో ముంబైలోని ఒక ఓడరేవు సమీపంలో కనిపెట్టిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. 

‘‘లోతైన మరియు సరైన దర్యాప్తుతో పాటుగా, అనేక విచా రణలను’’ జరిపిన అనంతరం ‘‘అనుమానాస్పదమైన సమాచారం గానీ, తగిన సాక్ష్యాధారాలు గానీ’’ తమకు లభించలేదని ముంబై పోలీసులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. తదనుగుణంగా – ఇప్పటికి దాదాపు మూడు వారాల క్రితం – విడుదలైన ఆ పక్షి మంచి ఆరోగ్యంతో ఉంది. 

‘ద పోస్ట్‌’ పత్రిక సంప్రదించిన నిపుణులు చెప్పటం ఏమిటంటే– బహుశా ఆ పావురం పరుగు పందేల్లోని పక్షి అయుండి, ‘‘తైవాన్‌ తీరానికి సమీపంలో జరిగిన రేసింగ్‌ పోటీల నుంచి దారి తప్పి, అక్కడి నుంచి పడవలో దాదాపు 3,000 మైళ్లు ప్రయాణించి’’ ఉండొచ్చని! 

అయితే రేసు పావురాల వ్యాపారం చేస్తుండే తైవాన్‌ కంపెనీ ‘నైస్‌ పీజన్‌’ యజమాని యాంగ్‌ త్సంగ్‌–టే ‘‘ఒక రేసు పావురం ఒక రోజులో 1,000 కిలోమీటర్ల వరకు ఎగరగలదనీ, అయితే అది ఇండియా వరకు ఎగురుతూ వెళ్లగలిగిందీ అంటే మధ్యలో కొన్ని మజిలీలు చేసి ఉంటుందనీ’’ అన్నారు. ‘‘ఏమైనా, కొన్ని పావురాలు తైవాన్‌ తీర ప్రాంతం నుంచి యూఎస్, కెనడా వరకు కూడా వచ్చిన ఉదంతాలు ఉన్నాయి’’ అని ఆ పత్రిక రాసింది. తైవాన్, ఉత్తర అమెరికాల మధ్య విస్తారమైన మహా సముద్ర జలం తప్ప వేరే ఏమీ లేనందున, పక్షులు అంతదూరం ఎలా వెళ్లగలిగాయో నాకైతే అంతు పట్టటం లేదు. ఒకవేళ పావురాలకు ఈత కొట్టటం గానీ తెలిసి ఉంటుందా?

భారత అధికారులు ఒక పావురాన్ని పట్టి బంధించటం ఇదే మొదటిసారి కాదు. ‘ద పోస్ట్‌’ చెబుతున్న దానిని బట్టి 2015లో,మళ్లీ 2020లో ఇలా జరిగింది. ఆ సందర్భంలోనే... ‘‘భారీ సైనిక మోహరింపులతో ఉండే సరిహద్దుల మీదుగా ఎగిరొచ్చిన ఒక పాకి స్తానీ మత్స్యకారుడి పావురాన్ని పోలీసులు స్వల్పకాలం పాటు అదుపులోకి తీసుకున్నారు.’’

ఇప్పుడు మీరు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతను కలిగి ఉన్న ముంబై పోలీసులను చూసి పరిహసించే ముందు, చరిత్రలో పక్షుల గూఢ చర్యం నిజంగానే ఉండేదని ఆ పత్రిక రాసిన విషయాన్ని గమనించాలి. ‘‘మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ... పావురాల ఛాతీకి కెమెరాలను కట్టి శత్రు దేశాల గుట్టుమట్లను కనిపెట్టేందుకు వాటిని ప్రయోగించేది. పక్షి కంటే కూడా ఆ పక్షికి కట్టిన కెమెరా పెద్దదిగా ఉండేదని నేను రూఢిగా చెప్పగలను.

‘‘రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు (జర్మనీని వ్యతిరేకించే బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మొదలైన దేశాలు) తమ మధ్య రహస్య సందేశాల బట్వాడాకు పక్షులను ఉపయోగించాయి.’’ దీని వెనుక ఉండే కారణానికి పెద్ద వివరణేమీ అక్కర్లేదు. ‘‘పావురాలు సాధారణ పక్షి జాతులు. కెమెరా కట్టి ఉన్న పావురాలైనా సరే, గూఢచారి పక్షుల్లా ప్రత్యేకంగా కాక, వేలాది ఇతర పక్షుల కార్యకలాపాల మధ్య దాగిపోయేవి’’ అని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చెప్పడమే కాకుండా, అలాంటి ఒక రహస్య కెమెరాను సైతం వృద్ధి చేసింది. స్వయంగా సీఐఏనే ఈ విషయాన్ని వెల్లడించింది కనుక అది నిజమే అయి వుంటుంది. 

అయితే ‘ద పోస్ట్‌’ సంప్రదించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై ఏకాభిప్రాయాన్నేమీ కలిగి లేరని తెలుస్తోంది. న్యూయార్క్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, ‘ద గ్లోబల్‌ పీజన్‌’ పుస్తక రచయిత కాలిన్‌ జరోల్‌మాక్‌కు ఇందులో భారతదేశ అసంబద్ధ పరిస్థితే కనిపించింది. ఆ స్థితిని సరిగ్గా చెప్పాలంటే, ‘చాలా హాస్యాస్పదం’ అన్నారు. ‘‘గూఢచర్యం కోసం చైనా అనేక అత్యాధునిక సాధనాలను కలిగి ఉందనీ, వాటిని విజయవంతంగా భారత్‌పై ప్రయోగిస్తుంది తప్పితే, రేసు పావురాలనైతే వదిలిపెట్టదు కదా’’ అని కాలిన్‌ జరోల్‌మాక్‌ వ్యాఖ్యానించారు. కావొచ్చు!

నేను కిటికీ దగ్గర కూర్చొని, పావురాల ‘గూ.. గూ’ లను వింటు న్నప్పుడు, అవి నాపై నిఘా పెట్టేందుకు రాలేదు కదా అని అనుకోకుండా అయితే ఉండలేకపోయాను. నేను ఏం చేస్తున్నానో మన ప్రియమైన ప్రభుత్వం ఈ విధంగానే తెలుసుకుంటుందా? పావురాలు తరచూ కిటికీ అంచులపైన కనిపించడానికి కారణం అవి తమ రెట్టలను అక్కడ వదిలి వేయడానికే అయుంటుందా అన్నది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే వాటి చిన్నికళ్ల లోతుచూపులను బట్టి, అక్కడ అవి వదిలిన దాని కన్నా ఎక్కువగా తీసుకుని ఉంటాయా అని యోచిస్తాను.

కాబట్టి, ఈసారి ఒక పక్షి మీ తలపైన ఎగురుతూ ఉండటాన్ని, లేదా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని కిందికి చూస్తూ ఉండటాన్ని మీరు గమనించినప్పుడు అది ఏదైనా ప్రయోజనం కోసం అక్కడికి వచ్చి వాలిందా అని ఆలోచించండి. బహుశా అంతదూరంలోని బీజింగ్‌ నుండి కాకపోయినా, దగ్గర్లోని ‘సౌత్‌ బ్లాక్‌’ (ప్రధానమంత్రి కార్యా లయం ఉండే చోటు) నుండి అది వచ్చి ఉండొచ్చు. అలాంటి పక్షులకు మేత మాత్రం వేయకండి. మనం వాటికి అందించే ఆహారపు తునకలు అవి తమ యజమానుల నుండి పొందే ప్రతిఫలాల ముందు పెద్ద విషయమేం కాదు. 

చివరిగా, ఈ వ్యాసం పక్షులకు సంబంధించినదని మీరనుకుంటే కనుక మీరలా అనుకోవటం సరైనదే కావచ్చు.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement
Advertisement