ఆంధ్రలో ‘చంద్ర’ కళాప్రదర్శన | Sakshi
Sakshi News home page

ఆంధ్రలో ‘చంద్ర’ కళాప్రదర్శన

Published Wed, Mar 13 2024 12:30 AM

Sakshi Guest Column On Chandrababu Politics In AP

అభిప్రాయం

చంద్రబాబు చూపుతున్న ధీమా నిజమే అయితే, ఒంటరిగా పోరాడి అధికారానికి రాగలనని నమ్మాలి. ఎవరితోనూ పొత్తు అవసరం లేదని భావించాలి. కానీ జరుగుతున్నదేమిటి? స్వయంగా చంద్రబాబే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. 2014 నాటి స్వల్ప మెజారిటీ భయం, 2019 నాటి ఘోర పరాజయ భయం చంద్రబాబు మానసిక స్థితిని, ఆలోచనలను ప్రభావితం చేయటం మొదలుపెట్టాయి. వయసురీత్యా బహుశా ఇవి ఆయనకు చివరి ఎన్నికలు కావచ్చు. తన వారసుడు సమర్థుడనే నమ్మకం టీడీపీ వాదులకే కలగటం లేదు. ఈసారి గెలవనట్లయితే అది పార్టీ పునాదుల కింద భూకంపం కాగలదు. ఏమి చేసైనా గెలవటమన్నది చంద్రబాబుకు జీవన్మరణ ప్రశ్నగా మారింది. మనకు కన్పిస్తున్నదంతా ఆ ప్రయత్నాలలో భాగమే.

జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనమైందని దృఢమైన స్వరంలో ప్రక టిస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒంటరిగా పోటీ చేసే ఆత్మవిశ్వాసం లేక బీజేపీ, జనసేనలతోపొత్తు కుదుర్చు కున్నారు. జనసేనతో పొత్తు కొంతకాలంగా ఉన్నదే కాగా, అది సరి పోదన్నట్లు ఇప్పుడు అకస్మాత్తుగా బీజేపీతోనూ అంగీకారం కుదిరింది. అందుకోసం పవన్‌ కల్యాణ్‌ ద్వారా నానా ప్రయత్నాలు చేశారు. జగన్‌ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబుకు ఇన్నిన్ని పొత్తులు ఎందుకనేది ఎవరికైనా వెంటనే మనసుకు వచ్చే సందేహం.

2014లో రాష్ట్రం విడిపోయినపుడు వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేయగా, ఒంటరిగా తలపడే ధైర్యం టీడీపీకి అప్పుడే లేకపోయింది. బీజేపీ మద్దతు కోరింది. పరోక్షంగా పవన్‌ మద్దతు తీసుకుంది. కొద్ది తేడాతో గెలిచి అధికారానికి వచ్చి ఎన్డీఏలో చేరింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు తన ఘనమైన పరిపాలనానుభవంతో మరెంతో ఘనంగా కొత్త రాష్ట్రాన్ని పాలించి, సర్వతోముఖాభివృద్ధి సాధించినట్లు టీడీపీ చెప్పుకొన్నది. అంతలో 2019 ఎన్నికలు రాగా, ఈ రికార్డులన్నింటి వల్ల ఈసారి చాలా పెద్ద మెజారిటీతో తిరిగి అధి కారానికి రానున్నట్లు ప్రకటించింది.

తీరా ఫలితాలు వెలువడినపుడు అంతా తలకిందులైంది. చాలా పెద్ద మెజారిటీ వైఎస్సార్‌సీపీకి రాగా, టీడీపీ చిత్తుగా ఓడింది. 2014లో మద్దతు ప్రకటించిన బీజేపీ 2019 వచ్చేసరికి దూరమైంది. 2019 ఓటమితో తమ వాస్తవ పరిస్థితి ఏమిటో బోధపడిన చంద్రబాబు కొంతకాలం కమ్యూనిస్టులతో, పవన్‌ కల్యాణ్‌తో దోబూచులాడి చివరకు పవన్‌ కల్యాణ్‌తో మైత్రిని స్థిరపరచుకున్నారు. కమ్యూనిస్టులతో మైత్రి అటూ ఇటూ సాగుతూ వస్తున్నది. ఇటీవలికి వచ్చేసరికి లెక్కలన్నీ వేసుకుని మరొకమారు ఎన్డీఏలో చేరుతున్నారు. 

పొత్తులు సరే, కానీ పొత్తు ఏ విధంగా జరుగుతుందనే దానిని బట్టి ప్రజలు తమ అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. 2014లో బీజేపీ మద్దతు తీసుకున్న చంద్రబాబు అధికారానికైతే వచ్చారుగానీ, ఆ మద్దతు ఉన్నప్పటికీ మెజారిటీ చాలా స్వల్పం కావటంతోనే ఆయనకు అపుడే ఒరిజినల్‌ భయం మొదలైందనుకోవాలి. బీజేపీ మద్దతు కారణంగా ఎన్డీఏలో చేరి, ఆ ప్రాతిపదికపై మోదీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా కొన్ని సాధించగలనని ఆశించారు. కానీ వివిధ కారణాల వల్ల అది అంతగా సిద్ధించకపోగా రాష్ట్రంలో తీవ్ర నిరాశ ఏర్పడి విమర్శలు రాగా, వాటిని తట్టుకోలేక ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు.

అన్నింటికన్నా ముఖ్యంగా తన పరిపాలన అస్తవ్యస్తంగా సాగి, అభివృద్ధి సంక్షేమాలు కన్పించక పోవ టంతో ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా పెరగ సాగింది. 2014 గెలుపే స్వల్ప ఆధిక్యతతో కాగా, వ్యతిరేకత వల్ల ఓటర్లతో దూరం అప్పటి భయాన్ని అనేక రెట్లు పెంచింది. అయినా మళ్లీ బీజేపీకి దగ్గరయే అవకాశం లేకుండా పోయింది. ఆ పార్టీని, మోదీని నానా మాటలతో దూషించారు గనుక. తానంటే నమ్మకం కుదరని కమ్యూనిస్టులు, జనసేన వేరే కూటమి పెట్టుకున్నాయి. అమరావతి కోసం భూసేకర ణతో పాటు తన పరిపాలనా చర్యలనేకం ఎదురు తిరగగా 2019లో దారుణ పరాజయం ఎదురైంది. తన ఘనమైన సుదీర్ఘ పాలనాను భవం, మేథాశక్తి, రాజకీయ చాతుర్యం ఏవీ ఉపయోగపడలేదు.

ఆ విధంగా 2014 నాటి స్వల్ప మెజారిటీ భయం, 2019 నాటి ఘోర పరాజయ భయం కలిసి ఈ 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు మానసిక స్థితిని, ఆలోచనలను ప్రభావితం చేయటం మొదలుపెట్టాయి. వయసురీత్యా బహుశా ఇవి ఆయనకు చివరి ఎన్నికలు కావచ్చు. తన వారసుడు సమర్థుడనే నమ్మకం టీడీపీ వాదులకే కలగటం లేదు. అటువంటి స్థితిలో ఈసారి గెలవనట్లయితే అది పార్టీ పునాదుల కింద భూకంపం కాగలదు. ఆ బృహత్‌ ప్రమాదం దృష్ట్యా ఏమి చేసైనా సరే గెలవటమన్నది చంద్రబాబుకు జీవన్మరణ ప్రశ్నగా మారింది. మనకు కన్పిస్తున్నదంతా ఆ ప్రయ త్నాలలో భాగమే.

తన ప్రయత్నాలలో మొట్టమొదటిది జగన్‌ పాలనపై ఎడతెరిపి లేని తీవ్ర విమర్శలు. అది కూడా తీవ్రాతి తీవ్ర స్వరంతో. ఈ విమర్శలు, ఆరోపణలలోని నిజానిజాలు చంద్రబాబుకైనా తెలుసునో లేదో చెప్పలేము. ఈ సంకుల అధికార సమరంలో అటువంటి విచక్షణకు ఎంతమాత్రం తావు లేదు. కానీ తార్కికంగా ఆలోచించినపుడు ఒకటి అనిపిస్తుంది.

ఉదాహరణకు, జగన్‌ పాలన అసమ ర్థమైనదని చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల పట్ల స్వయంగా ఆయనకు నమ్మకం ఉన్నట్లయితే, రాబోయే ఎన్నికల విషయమై పూర్తి ధీమా ఏర్పడాలి. తాను ఒంటరిగా పోరాడి గొప్ప మెజారిటీతో గెలిచి అధికారానికి రాగలనని తిరుగులేని విధంగా నమ్మాలి. ఎవరితోనూ పొత్తు అవసరం లేదని భావించాలి. ఇతరులే తనతో పొత్తు కోసం ప్రయత్నించే స్థితి ఏర్పడాలి. అట్లా ఎవరైనా అడిగినా, వారి కోసం కొన్ని సీట్లు వదులు కోవటం ఎందుకని వారిని తిరస్కరించాలి. 

కానీ జరుగుతున్నదేమిటి? స్వయంగా చంద్రబాబే ఇతరులతో పొత్తు కోసం కొంత కాలం నుంచే వెంపర్లాడుతున్నారు. జనసేనతో ఏమి జరుగుతూ వస్తున్నదో చూస్తున్నాము. కమ్యూనిస్టులతో సఖ్యత కోసం కూడా ప్రయత్నాలు సాగాయి. అంతటితో ఆగితే అందుకొక అర్థం ఉండేదేమో. అప్పటికైనా ఆయన బలహీనత తెలిసి వచ్చేదే గానీ కనీసం అది రాష్ట్ర స్థాయి రాజకీయంగా ఉండిపోయేది. కానీ, ఆ పొత్తులైనా తన విజయానికి సరిపోగలవన్న నమ్మకం చంద్రబాబుకు కలిగినట్లు లేదు. ఆ స్థితిలో ఇక మిగిలింది బీజేపీ అనే జాతీయ పార్టీ.

2014–19 మధ్య తన ఆశలను అడియాస చేసి, తన వైపు నుంచి తాను ఎన్నెన్నో కఠినమైన విమర్శలు సాగించి, సెక్యులరిజం, మతతత్త్వం వంటి పదాలను యథేచ్ఛగా దొర్లించి దాడులు చేసి, ఎన్డీఏ నుంచి ఈ కారణాల పరంపరతో నిష్క్రమించిన పార్టీ టీడీపీ. అయితేనేమిగాక. ప్రస్తుతం వరదలో కొట్టుకుపోతూ దారి తెన్ను కన్పించక, భవిష్యత్తు అంధకార బంధురంగా తోస్తున్న తనకు ఈ గత చరిత్ర గురించిన శషభిషలు అవివేకమవుతాయి. కనుక ‘పవన రాయబారం’ సాగించి నేటికి కృతకృత్యులయ్యారు. అయినప్పటికీ ఫలం సిద్ధిస్తుందా అంటే ఎవరూ చెప్పలేరు.

దానినట్లుంచితే, బీజేపీతో సంబంధాల విషయమై ఇంతలోనే ఈ మార్పు ఏమిటి? అని ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నలు ఎదురు కాగలవ న్నది చంద్రబాబు ఊహించలేని విషయం కాదు. అందుకు వివరణ లను ముందే సిద్ధం చేసి ఉంచుకున్నట్లు కనిపిస్తున్నది. వాటిని ఆయన స్వయంగా వివరించిన దానిని బట్టి మూడు మాటలు కన్పిస్తున్నాయి. ఒకటి, ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు కలిసి పని చేయాలను కోవటం.

రెండు, ఒకవేళ టీడీపీ అధికారానికి వచ్చినా కేంద్ర సహా యం లేకుండా రాష్ట్రాభివృద్ధికి సాధ్యం కాదు గనుక బీజేపీతో కలవాల నుకోవటం, మూడు, ఎన్డీఏ సమావేశంలో పాల్గొనవలసిందిగా ఇతర మాజీ మిత్ర పక్షాలతో పాటు టీడీపీకి కూడా ఆహ్వానం అందినందున ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలను కోవటం. ఈ వివరణలోని నిజాయితీ ఏమిటో, పొత్తులోని అసలు ఉద్దేశం ఏమై ఉంటుందో ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు.

ఈ వివిధ పరిణామాలన్నింటి వెనుక స్పష్టంగా కనిపిస్తున్నది మాత్రం ఒకటే. జగన్‌పై చంద్రబాబు విమర్శలు, ఆరోపణలైతే యథేచ్ఛగా సాగిస్తున్నారు గానీ, వచ్చే ఎన్నికలలో విజయావకాశాలపై నమ్మకం కలగటం లేదు. ఆ కారణంగా తన రాజకీయ కళలన్నీ ప్రదర్శి స్తున్నారు.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Advertisement
Advertisement