పిడుగులున్నారు... హై‘టేక్‌ కేర్‌’..! | Sakshi
Sakshi News home page

పిడుగులున్నారు... హై‘టేక్‌ కేర్‌’..!

Published Wed, Feb 28 2024 12:05 AM

Sakshi Guest Column On Children habits In Social Media

సారాంశం

సోషల్‌ మీడియాలో తిరుగుతోన్న ఓ జోక్‌ చూడండి. 
ఏడేళ్ల  పిల్లాడు ఫొటో దిగడానికి వాళ్ల నాన్నతో కలిసి  స్టూడియోకి వెళ్లాడు. పిల్లాడు కుదురుగా కూచుంటాడో లేదోనని కంగారు పడుతున్న వాళ్ల నాన్నని చూసి  ఫొటోగ్రాఫర్‌  ‘‘మై హు“ నా.. ’’ అన్నట్టు  కళ్లతో సైగ చేస్తూ.. చిరునవ్వుతో పిల్లాడితో ఇలా అన్నాడు.‘‘ఇటు చూడమ్మా.. కెమెరానే చూడాలి.. ఫ్లాష్‌ వస్తుంది.. కళ్లు మూయకూడదు. ఇలా అలా కదలకూడదు.  

చూడు కెమెరాలోంచి పిట్టలొస్తాయి....’’ తన చేతిలో ఉన్న ఫోన్‌ పక్కన పెడుతూ ఏడేళ్ల్ల పిల్లాడి జవాబు ఇది.. ‘‘ఏం కతలు పడుతున్నావా.. సరిగా ఫోకస్‌ చెయ్యి..పోట్రెయిట్‌ మోడ్‌ యూస్‌ చెయ్యి. ఐఎస్‌ఓ 200 కంటే తక్కువ పెట్టు. హై రెజల్యూషన్‌ పిక్‌ కావాలి. ఫేస్‌బుక్‌  ప్రొఫైల్‌ కోసం. ముచ్చట్లాపి సరిగ్గా తియ్యి.. పిచ్చుకలెలా వస్తాయి కెమెరాలోంచి ఏం మీ అయ్యగూడు పెట్టిండా  కెమెరాలోపల...’’– ఫొటోగ్రాఫర్‌ ఫేస్‌ ఫీలింగ్స్‌... పిల్లాడి నాన్న కళ్లలో భయం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా...

పిల్లలు పిడుగులవుతున్నారు.. నిన్నటి  చందమామ కథలు ఇకవారి దగ్గర నడవవు.సమస్త ప్రపంచం, టెక్నాలజీ వారి చేతిలోకి వచ్చింది.ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు మామూలే.. ఓ చిన్నారి.. ఏవో చిన్నచిన్న వస్తువులతో రోబో వంటి ఆకృతిని తయారు చేసింది. సముద్రాలెన్ని, ఖండాలెన్ని, వాటి పేర్లేమిటన్న పాఠాలనూ అప్పజెప్తోంది. మరో చిన్నారి ఉన్నట్టుండి చక్కగా బొమ్మలు వేయడం మొదలుపెట్టేసింది.

ఇంకో చిన్నారి పేపర్‌ను మడిచి విభిన్న ఆకృతులను (ఒరిగామి) తయారు చేస్తోంది. ఇవేవీ బడిలో చెప్పినవి కాదు. తల్లిదండ్రులు నేర్పినవీ కాదు.. మరెక్కడివి? యూట్యూబ్‌లో ఎడ్యుకేషన్  వీడియోలు చూశారు. తామూ సొంతంగా ఏదో చేయాలనుకున్నారు. అంతే.. ఇలాంటి చిన్నారులెందరో ‘టెక్నాలజీ’ గురువుకు ఏకలవ్య శిష్యులు.

రోజూ మూడు గంటలు సోషల్‌ మీడియాలో...
గత ఏడాది మన దేశంలో పిల్లల సోషల్‌ మీడియా అలవాట్లపై సర్వే జరిగింది. అందులో 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 60 శాతం మంది రోజూ 3 గంటలకుపైనే సోషల్‌ మీడియాలో గడుపుతున్నట్టు తేలింది. 

► 13–17 ఏళ్ల మధ్య టీనేజర్లలో 95 శాతం 8–12 మధ్య పిల్లల్లో 40 శాతం మంది సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారు.
► పిల్లల్లో 15 శాతం మంది రోజూ 6 గంటలకుపైగా ఫోన్ తో గడిపితే.. 46 శాతం మంది మూడు నుంచి ఆరు గంటల వరకు వాడుతున్నారు. మరో 39 శాతం మంది గంట నుంచి 3 గంటల వరకు వినియోగిస్తున్నారు.
► 18 ఏళ్లలోపువారు ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాల వినియోగించాలంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేయాలని 73 శాతం తల్లిదండ్రులు సర్వేలో పేర్కొనడం గమనార్హం.

టెక్‌... కిక్‌...
ప్రముఖ ప్యూ రీసెర్చ్‌ సంస్థ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. టీనేజ్‌ పిల్లలు తాము సాధించిన విజయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 49 శాతం మంది తాము సాధించినది చెప్పుకొంటుంటే.. 44 శాతం మంది కుటుంబానికి సంబంధించిన పోస్టులు..విహార యాత్రలు, సంబరాలు, ఫంక్షన్లు వంటివి చేస్తున్నారు.

► 34 శాతం మంది తమ ఎమోషన్లను సోషల్‌మీడియాలో పంచుకుంటుంటే.. అందులో పర్సన ల్‌ విషయాలనూ ప్రస్తావిస్తున్నవారు 13 శాతం ఉన్నారు. 
► మతపరమైన అంశాలపై 11 శాతం, రాజకీయ అంశాలపై 9 శాతం టీనేజర్లు పోస్టులు పెడుతున్నారు. ఇక  ఎడ్యుకేషన్, సోషల్,  ఎంటర్‌టెయిన్‌మెంట్‌ వంటి ఇతర అంశాలపై 28 శాతం మంది పోస్టులు పెడుతున్నారు. 

డిజిటల్‌ ఏజ్‌ తగ్గుతోంది...
ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాల ప్రకారం.. పిల్లల చేతికి ‘టెక్‌’ అందుతున్న వయసు క్రమంగా తగ్గుతూ వస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాల విస్తృతే దీనికి కారణం. ఆడుతూ, పాడుతూ నేర్చుకునే క్రమంలో.. ఇటు ఇళ్లలో, అటు స్కూళ్లలో కూడా డిజిటల్‌ పరికరాల వినియోగం బాగా పెరిగింది. నడక నేర్చుకునే కంటే ముందే.. ‘ఫోన్ ’ను ఆపరేట్‌ చేయడం, గేమ్స్‌ ఆడటం నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది.

కరోనా లాగా స్పీడ్‌గా...
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏడాదికిపైగా లాక్‌డౌన్లు పెట్టాయి. పెద్దవాళ్లకు కాస్త వెసులుబాటు ఇచ్చినా.. పిల్లల బడులైతే ఏడాదిన్నర పాటు నడవలేదు. ఇంట్లోంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఏదీ ఆగలేదు. ఆన్ లైన్  క్లాసులతో పిల్లల చదువులు భేషుగ్గా సాగాయి. సరికొత్త బోధన దిశగా అడుగులు పడ్డాయి. అదే సమయంలో పిల్లలు తోటివారితో వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడుకోవడం, చాటింగ్‌ చేయడం ద్వారా ఒంటరితనాన్ని అధిగమించగలిగారు... అక్కడ నుంచి సోషల్‌ మీడియా వేగంగా అంటుకుంది. 

నిపుణుల అబ్జర్వేషన్‌ ఇదీ..
► టెక్నాలజీ చిన్నారులు కొత్త విషయాలను నేర్చుకునేందుకు అద్భుత అవకాశాలను ఇస్తోంది. ఎడ్యుకేషన్  యాప్స్, వీడియోలు, ఇంటరాక్టివ్‌ గేమ్స్‌ వంటివి కొత్త, కఠినమైన 
అంశాలను కూడా అరటిపండు  ఒలిచి నోటికి అందించినట్టుగా అతి సులువుగా, సొంతంగా నేర్చుకోగలిగిన సామర్థ్యాన్ని ఇస్తున్నాయి.
► విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉండటంతో పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచుతోంది. ఏదైనా ఓ అంశానికి సంబంధించిన కొత్త కొత్త సంగతులను శోధించి తెలుసుకునే అవకాశాలు ఉంటున్నాయి.

► టెక్నాలజీ పిల్లల్లో చిన్ననాటి నుంచే సృజనాత్మకతకు పదును పెడుతోంది.  కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయగలిగే సామర్థ్యాన్ని ఇస్తోంది.
► సొంతంగా కంటెంట్‌ను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా పంచుకోగలగడంతో పిల్లల్లో వినూత్న ఆలోచనలకు, ఆత్మవిశ్వాసం పెరగడానికి తోడ్పడుతోంది.

► పజిల్స్‌ను పరిష్కరించడం, ఎడ్యుకేషన్  సంబంధిత గేమ్స్‌ ఆడటం ద్వారా.. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం అలవడుతోంది. ఏదైనా సమస్యకు కొత్త తరహాలో, సులువైన పరిష్కారం కనుగొనే దిశలో ఏకాగ్రత పెంపొందుతోంది.
►  ఇంటర్నెట్, సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విభిన్న నేపథ్యాలున్న పిల్లలను కలిసే అవకాశంతో సామాజిక సంబంధాలపై, భిన్నమైన ప్రాంతాల్లో పరిస్థితులపై అవగాహన ఏర్పడుతోంది. విభిన్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, ఎలా స్నేహం చేయాలనే సామర్థ్యం సమకూరుతోంది.

వారి సూచన ఇదీ...
ఇదే సమయంలో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్  వంటి పరికరాల అతి వినియోగం కాస్త చేటుకూ దారితీస్తోంది. పిల్లల శారీరక, మానసిక అంశాలపై ముఖ్యంగా భావోద్వేగాలపై ప్రభావం చూపుతోంది. చిన్నవయసులోనే టెక్నాలజీ వాడకంతో దుష్ప్రభావాలపైనా చాలా అధ్యయనాలు జరిగాయి. ఇబ్బందికరమైన, తప్పుడు సమాచారం, సైబర్‌ బుల్లీయింగ్‌ వంటివి పిల్లల మానసిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపుతున్న ఘటనలూ ఉన్నాయి. రూపాయికి బొమ్మా బొరుసు రెండూ ఉన్నట్టే.. టెక్నాలజీ వెంట మంచి, చెడు రెండూ వస్తున్నాయి.  తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే చాలు. 
- సరికొండ చలపతి

Advertisement

తప్పక చదవండి

Advertisement