Sakshi News home page

ఎన్ని తగ్గిస్తే అన్ని నెగ్గినంత!

Published Tue, Jan 23 2024 12:55 AM

Sakshi Guest Column On Congress INDIA alliances

28 పార్టీల ‘ఇండియా’ కూటమి ప్రధాన లక్ష్యం ఏమిటి అన్నదాన్ని బట్టే అది తన లక్ష్యం సాధించగలదా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నియంత్రించి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా? ఈ రెండు కూడా వేర్వేరు లక్ష్యాలు. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే ‘ఇండియా’ కూటమి లక్ష్యమైతే... చేజేతులా బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే! అలా కాకూడదంటే, ఓట్లు చీలకుండా ఆ యా పార్టీలు తాము గెలవలేని రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం సీట్లను త్యాగం చేయవలసి ఉంటుంది.

ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం సరళమైనది, సూటిగా మాట్లాడు కోబోయేదీ. అదేమిటంటే – వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీని, భార తీయ జనతా పార్టీని ‘ఓడించాలన్న’  28 పార్టీల ‘ఇండియా’ కూటమి కల నిజం అవుతుందా అన్నది! అయితే ఆ కల నిజం అవటం అన్నది ఒకే ఒక ప్రశ్నకు లభించే సమాధానం పైనే అధారపడి ఉంటుంది. ‘ఇండియా’ కూటమి లక్ష్యం ఏమిటన్నదే ఆ ప్రశ్న. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నెట్టేసి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి ఆ పార్టీ తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా?

ఇవి రెండూ వేర్వేరు లక్ష్యాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే లక్ష్యంగా అవి కూటమి కలను సాకారం చేయగలిగినవి కావు. రెండు లక్ష్యాలకు వేటికవిగా భిన్న విధానాలు, భిన్న వ్యూహాలు అవసరం. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే తన లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి పెట్టు కున్నట్లయితే... అది చేజేతులా చాలా పెద్ద సంఖ్యలో సీట్ల గెలుపుతో బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే!

బీజేపీని 272 సీట్లకు దిగువనే ఉంచటానికి కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ తన పరిమితుల్ని అంగీకరించవలసి ఉంటుంది. పైకి అదే మంత పెద్ద విషయంగా అనిపించకపోయినా ప్రధానంగా అదే పెద్ద విషయం. కూటమి లబ్ధి కోసం పార్టీలు తమ ప్రయోజనాలను త్యాగం చేయటం అవసరం. అప్పుడు మాత్రమే ఇండియా కూటమి కనీసం 400 సీట్లలో ప్రత్యర్థితో ముఖాముఖి తలపడగలదు. అప్పుడు మాత్రమే ప్రతిపక్ష కూటమికి పడిన 60 శాతం ఓట్లు... పోటీలో ఉన్న ఎక్కువమంది అభ్యర్థుల మధ్య చీలిపోయే అవకాశం ఉండదని ఆశించవచ్చు.  

ఈ విషయం మీకు వివరంగా చెప్పడానికి కాంగ్రెస్‌ను నేను ఒక ఉదాహరణగా తీసుకుంటాను. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఇటీవలి చరిత్రలను చూస్తే కనుక అక్కడ కాంగ్రెస్‌కు ఉన్న విజయా వకాశాలు పరిమితమేననీ, వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలకు కూడా ఇది సమయం కాదనీ నిర్ధారణగా తెలుస్తుంది. 

2014లో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ రెండంటే రెండే లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. యూపీలోనే 2022 విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు కూడా రెండే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఓట్లు వరుసగా 6.4. శాతం, 2.4 శాతం. బెంగాల్‌లో మరీ హీనం. అక్కడ 2019లో కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2021 శాసనసభ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు వరుసగా 5.7 శాతం, 3.1 శాతం. 

స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే, కాంగ్రెస్‌ ఎన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేస్తే బీజేపీ అన్ని ఎక్కువ సీట్లలో గెలుస్తోంది. బిహార్‌లో సరిగ్గా ఇదే జరిగింది. 2020 బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70 చోట్ల పోటీ చేస్తే, గెలిచింది 19 సీట్లు మాత్రమే. అంతకు ముందరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాలే ఇక్కడా పునరావృతం అయ్యాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 9 సీట్లకు పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది.  

అయితే, ‘ఇండియా’ కూటమిలోని తక్కిన పార్టీలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా త్యాగాలు చేయవలసిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అవి: మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ రాష్ట్రాల్లో సమాజ్‌వాది, ఆమ్‌ ఆద్మీ వంటి పార్టీలు తమ ప్రయోజనాలకు అతీతంగా పని చేయాలి. ఆశల రెక్కల్ని చాపుకోడానికి వాటికిది సమయం కాదు. బీజేపీని ఆ రాష్ట్రా లలో ఓడించగల స్థానంలో ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే ఉంది.  

అలాగే ‘ఇండియా’ కూటమికి సమస్యాత్మకమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాటిల్లో పంజాబ్, ఢిల్లీ ప్రధానమైనవి. పంజాబ్‌లో లోక్‌సభ స్థాయిలో కాంగ్రెస్‌ 8 సీట్లు, ఆమ్‌ ఆద్మీ 1 సీటు గెలుచు కున్నాయి. శాసనసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. ఆప్‌ 92 చోట్ల, కాంగ్రెస్‌ 18 చోట్ల విజయం సాధించాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్‌ గానీ, ఆప్‌ గానీ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేక పోయాయి. అయితే ఆప్‌ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ రెండవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం ఆప్‌దే పైచేయిగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా కూటమి పార్టీల మధ్య సీట్ల విభజన అంత సులభమేమీ కాదు. అయినప్పటికీ అత్యాశతో అవి విభజనకు ప్రయత్నించాయా... బీజేపీ గెలిచినట్లే! 

నేను చెప్పాలనుకున్న ఈ విషయం ఎందుకింత సరళంగా, సూటిగా... అదే సమయంలో ఎందుకింత ముఖా నికి కొట్టొచ్చినంత స్పష్టంగా కూడా ఉన్నదో మీకు అర్థ మయిందా? నా ఈ విశ్లేషణతో విభేదించడం ‘ఇండియా’ కూటమికి స్వయంకృత పరాజయం మాత్రమే అవుతుం దన్న విషయాన్ని కూడా మీరు అంగీకరించగలరా? బీజేపీని 272 సీట్లకంటే తక్కువకు పరిమితం చేయడానికి ప్రతి పక్షాలు కనీసంలో కనీసంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. త్యాగాలకు సిద్ధపడటం, అత్యాశను వదులుకోవటం. ఇవి కాకుండా వారు తెలుసుకోవలసినవి ఇంకొన్ని కూడా ఉన్నాయి. 

మొదటిది: ప్రధానమంత్రిపై వ్యక్తిగత విమర్శలు పనికిరావు.
రెండు: అదానీ, క్రోనీ క్యాపిటలిజం (రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కుమ్మక్కు అవటం), చైనా వైఖరి పట్ల మోదీ బలహీనమైన ప్రతిస్పందన, లేదా మైనారిటీలను తక్కువగా చూడటం అనే అంశా లేవీ ఓట్లు రాల్చేవి కాదు. ఈ రెండు విషయాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్న ద్రవ్యో ల్బణం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, పేదరికం వంటి వాటిపై కూటమి దృష్టి పెట్టాలి. 

ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళతాను. ‘మోదీకి పోటాపోటీ ఎవరు?’ అనే ప్రశ్న... ‘ఇంకెవరు? రాహుల్‌గాంధీ’నే అనే సంసిద్ధ సమాధానంతో పూర్తవదని ఇండియా కూటమి స్పష్టతను కలిగి ఉండాలి. రాహుల్‌ గాంధీ కూడా తను కనీసం సంభావ్య ప్రధాని మంత్రి అభ్యర్థినైనా కానని స్పష్టం చెయ్యాలి. అవసరమైతే, నిస్సందే హంగా అది ఆమోదం పొందేవరకూ రాహుల్‌ పదే పదే దాన్ని పున రుద్ఘాటించాలి.

చివరిగా కాంగ్రెస్‌కు ఒక మాట. మోదీని, బీజేపీని ఓడించడం తేలిక కాదు. ఆ పార్టీని 272 సీట్ల దిగువకు దింపడమే కాంగ్రెస్‌ పార్టీ 2024 లక్ష్యం కావాలి. 2029లో మాత్రమే కాంగ్రెస్‌ తను సొంతంగా మెజారిటీ సాధించేందుకు పని చేయాలి. 

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Advertisement