Sakshi News home page

దేశ భవిష్యత్తుకు దిక్సూచి!

Published Sun, Apr 14 2024 1:59 AM

Sakshi Guest Column On DR BR Ambedkar and Constitution of India

సందర్భం

ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్‌ అంబేడ్కర్‌ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్‌ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. 

ఆయన ఒక వాల్టేర్‌ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది.

ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్‌ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్‌లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. 

అంబేడ్కర్‌ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్‌ 1913లో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్‌ ఇండియాలో ప్రొవెన్షియల్‌ ఫైనాన్స్‌ పరిణామం’ అనే థీసిస్‌ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డాక్టరేట్‌ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. 

విద్య పట్ల అంబేడ్కర్‌ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్‌ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్‌ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్‌ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు.

‘పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్‌ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు.

సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్‌ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్‌ ఆలోచన. 

అంబేడ్కర్‌ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్‌లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది.

రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్‌ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు.  

అంబేడ్కర్‌ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ’(ఐఎల్‌పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్‌ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్‌ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్‌’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు.

ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సుల్లో  కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్‌ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌సీఎఫ్‌) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు.  

1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్‌సీఎఫ్‌ నుండి రిపబ్లికన్‌ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. 

ఈ విధంగా అంబేడ్కర్‌ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. 

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
(నేడు డా‘‘ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి)

Advertisement

తప్పక చదవండి

Advertisement