Sakshi News home page

సామాజిక బందీల విముక్తి ప్రదాత!

Published Tue, Dec 6 2022 2:42 AM

Sakshi Guest Column On Dr BR Ambedkar Vardhanti

ప్రపంచంలోని వివిధ సమాజాలు తమకు నచ్చిన తాత్త్విక మార్గాల్లో ప్రయాణిస్తూ మనుగడ సాగించడం అనాదిగా వస్తున్నదే. అయితే కొన్ని సమాజాల్లో అనేక సమూహాలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా బందీలై కనీస మానవ హక్కులకూ దూరమయ్యాయి. భారతీయ సమాజంలోని అస్పృశ్యులూ, ఆదివాసులూ, మహిళలూ, ఇతర అణగారిన సమూహాల వారు అటువంటి వారిలో కొందరు. తత్త్వశాస్త్రానికి మూల జీవం మానవ దుఃఖ నివారణ. ఇందుకోసం బుద్ధుడు, సోక్రటీస్, మార్క్స్‌ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. ఇటువంటి తాత్త్వికులను అధ్యయనం చేసి అంబేడ్కర్‌ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు ప్రయత్నించారు. ఆయన ఫిలాసఫీ భారత రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది.

అంబేడ్కర్‌ ప్రాసంగికత నానాటికీ పెరుగు తుందనడానికి నవంబర్‌ 26వ తేది రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరగడం వల్ల మనకు అర్థమౌతోంది. అంబేడ్కర్‌ సిద్ధాంతాలు ప్రపంచ తాత్త్వికులకు సమ తుల్యమైనవి, తులనాత్మకమైనవి కూడా. అంబేడ్కర్‌ రచనా వైవి ధ్యంలో సోక్రటీస్, ప్లేటో, బుద్ధుడు, అరిస్టాటిల్‌ ఉన్నారు. ‘జ్ఞానవం తుడైనవాడు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడ వుతాడు’ అనే సత్యాన్ని సోక్రటీస్‌ చెప్పాడు. అందుకు రాజ్యానికి, దేశానికి భయపడని నిర్భీతి తత్త్వాన్ని ఆయన ప్రదర్శించాడు. అదే తత్త్వం అంబేడ్కర్‌లో మనకు కనిపిస్తుంది.

అందుకు సత్యాన్వేషణ, ధీశక్తి, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత అవసరం. వాటిని సోక్రటీస్‌ స్థాయిలో ఆధునిక యుగంలో వ్యక్తీకరించిన వాడు అంబేడ్కర్‌. ఆయన ముఖ్యంగా వేదాలకూ, స్మృతులకూ ప్రత్యామ్నా యంగా భారత రాజ్యాంగ దర్శనాన్ని రూపొందించాడు. అందుకు బుద్ధుని తత్త్వం ఆయనకు వాహిక. ఆయన సమాజంలో మానవతా స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశాడు. అందుకు కారణం ఆయన హృదయ భావం, ఆయన చాలా సున్నిత హృదయుడు. ఆయన సున్నితత్వంలో కరుణ వుంది, ప్రేమ వుంది, ఆత్మీయత వుంది. అంకిత భావం వుంది. ఈ గుణాలు నాయకుణ్ణి ప్రవక్తగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన అణ గారిన ప్రజల తరఫున మాట్లాడాడు. 

ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అస్పృశ్యత అనే శాపంతో క్రుంగిపోయారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఉపద్రవం ఇది. ప్రతి మానవుడికీ ఉండవలసిన ప్రాథమిక హక్కులు వారికి తిరస్క రించబడ్డాయి. నాగరికత, సంస్కృతి ఫలాల లబ్ధిని వారికి అంద నివ్వలేదు. అస్పృశ్యులే కాకుండా ఈ దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఆదిమ జాతులు, గిరిజన తెగలు ఉన్నాయి. నాగరిక, సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా వారిని ఆటవిక, సంచార జాతులలా తిరిగేలా వదిలి పెట్టారు కులీనులు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన తన వాదాన్ని తాత్త్వికంగా మలిచాడు. కుల నిర్మూలనా వాదాన్ని ఇలా ప్రతిపాదించాడు.

‘‘కుల వ్యవస్థను సమర్థించడానికి వారసత్వం గురించీ, నరసంతతి శుద్ధి శాస్త్రం గురించీ చెత్తవాదన ఎంతో లేవనెత్తబడింది. నరవంశ శుద్ధిశాస్త్రం (యూజెనిక్స్‌) ప్రాథమిక సూత్రానికి కుల వ్యవస్థ అనుగుణంగా ఉంటే దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందు కంటే స్త్రీ పురుషులను వివేకంతో జత కలపడం ద్వారా జాతి అభి వృద్ధిని సాధించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వివేక వంతమైన స్త్రీ, పురుష సంయోగాన్ని కుల వ్యవస్థ ఏ విధంగా సాధిస్తున్నదో అర్థం కావడం లేదు.

కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన ఒక కృత్రిమ వ్యవస్థ. అది చేస్తున్నదల్లా వివిధ కులాల స్త్రీ పురుషులు కులాంతర వివాహాలను చేసుకోకుండా నిషేధించడం. ప్రకృతి సిద్ధమై నది కాదది, ఒక కులంలో ఏ ఇద్దరు కలసి వివాహం చేసుకోవాలని ఉన్నదో నిర్ణయించే పద్ధతి కాదది. జాతి శుద్ధి శాస్త్రం దృష్ట్యా ఒక కులమే ఒక ప్రత్యేక మూల జాతి అయితే... ఉపకులాల పుట్టుక కూడా అదే విధంగా అయి వుండాలి. అయితే ఉప కులాల మూలం కూడా యూజినిక్సే అని నిజంగా ఎవరైనా వాదించగలరా? అలాంటి వాదన పూర్తిగా అసంగతం.’’

ఇకపోతే ఈ కులనిర్మూలన సిద్ధాంత ఆచరణకు మహాత్మాగాంధీ రాజకీయంగా మతవాద ధోరణితో అడ్డు వచ్చారు. అంబేడ్కర్‌ సాంఘికంగా కుల నిర్మూలనా వాది. ఆర్థికంగా స్టేట్‌ సోషలిజం ప్రతిపాదకుడు. రాజకీయంగా బహుజన రాజ్య నిర్మాణ దక్షుడు. ఈ మూడింటినీ సాధించడానికి ఆయన బుద్ధునిలో సంఘ వాదాన్నీ, మహాత్మా ఫూలేలోని సాంస్కృతిక విప్లవ వాదాన్నీ పోరాట ఆయుధాలుగా మలచుకున్నాడు. అందువల్ల ఆయన కుల నిర్మూలనా పునాదులపై పునర్నిర్మించే తత్త్వశాస్త్ర నిర్మాతగా ముందుకొచ్చాడు. జ్యోతిబా ఫూలే స్త్రీల కోసం చేసిన ఉద్యమం అంబేడ్కర్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది.

స్త్రీని విముక్తి చేయడం భారత పునరుజ్జీవ నోద్యమంలో ప్రధానాంశంగా ఆయన భావించాడు. హిందూ సంస్కరణవాదులు ప్రతిపాదించే పద్ధతిలో విధవా వివాహాలు, సతీసహగమన నిర్మూలన వంటి సంస్కరణల వలే కాక స్త్రీల హక్కులకు సంబంధించిన అంశం మీద ఆయన ఎక్కు పెట్టాడు. స్త్రీని భావ దాస్యం నుండి విముక్తి చేయడం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృ తిక, రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా స్త్రీలకు కల్గించడానికి ఆయన తీవ్రమైన కృషి చేశాడు. అంబేడ్కర్‌ తనకు ముందున్న భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలన్నింటినీ చదివి భారత దేశ పున ర్నిర్మాణానికి పూనుకున్నాడు. 

అంబేడ్కర్‌లోని మరొక కోణం సామాజిక వ్యక్తిత్వ మనో విశ్లేషణ. ఈ ప్రత్యేకతను ప్లేటోలోని రచనా వైవిధ్యం, జ్ఞానతృష్ణ, సంభాషణా ప్రావీణ్యత, అంతరాంతర పరిశీలనల నుండి ఆయన సంతరించుకున్నారు. తత్త్వశాస్త్రానికి మూల జీవమైన మానవ దుఃఖ నివారణ పట్ల సోక్రటీస్‌ ఎంత వేదన పడ్డాడో, అంబేడ్కరూ అంత వేదన పడ్డాడు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని అధిగమించి, సామాజిక దుఃఖాన్ని గుర్తించి, దాని నివారణ కోసం సిద్ధాంతపరంగా, ఆచరణ పరంగా కృషి చేసినవారు సోక్రటీస్, అంబేడ్కర్‌లు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినా వారు సత్య నిరూపణ కోసం ముందడుగు వేస్తారు.

ఇకపోతే అంబేడ్కర్‌ విద్యా తాత్త్విక వాది. ఆయన తన ప్రతిభా సంపత్తితో అçస్పృశ్యుల గురించి అనేక కమిషన్‌లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో తనను తరగతి గదిలో బయట కూర్చో బెట్టి, బైట పాఠాలు చెప్పిందో, అదే భారతంలో తన ప్రజలను విద్యావంతులను చేయడానికి... అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడు. ఆయన ఒక్కడుగా ఒక సైన్యంగా పని చేశాడు.  

అంబేడ్కర్‌కు అధ్యయనంతో పాటు లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ వున్నాయి. అందుకే ఆయన మాటలు సత్య నిష్టం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబే డ్కర్‌ రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొందుపరుస్తూ వెళ్ళాడు. ఈనాడు అంబేడ్కర్‌ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నవంబర్‌ 26న భారత రాజ్యాంగ దినోత్సవం అనే పేరు మీద  భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసీహెచ్‌ఆర్‌) హిందూ పునరుద్ధరణవాద పత్రాన్ని రాష్ట్రాల గవర్నర్లకు, విశ్వవిద్యాలయాలకు పంపింది. అంటే అంబేడ్కర్‌ రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరగు తోందన్న మాట!

రాజ్యాంగం పీఠికలో చెప్పబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దెబ్బతీయాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం బౌద్ధ యుగాన్ని దెబ్బతీయడానికి కౌంటర్‌ రివల్యూషన్‌గా వచ్చిన గుప్తుల కాలం నాటి మతోద్ధరణ వాదం లాగా వుంది. అంబేడ్కర్‌ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాన్ని ప్రచారం చేయా లనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని సామా జిక సామ్యవాద భావాన్ని దెబ్బతీయలేరనేది కూడా మరో ప్రక్క రుజువవుతూ వస్తోంది. మతం ఎప్పుడూ తత్త్వశాస్త్రానికి ప్రత్యా మ్నాయం కాలేదు. మతం కొందరికే పరిమితమైంది. రాజ్యాంగం అందరిని సమన్వయీకరించుకుంటుంది. ఆ శక్తి దానికుంది. ప్రపంచ తాత్త్విక దృక్పథం నుంచి ఏర్పడింది రాజ్యాంగం.

అంబేడ్కర్‌వాదులు, మార్క్స్‌వాదులు, లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు ఐక్యంగా అంబేడ్కర్‌ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని తప్పక కాపాడుకుంటారు. ఈ యుగం అంబేడ్కర్‌ది. ఆయన నిర్మిం చిన తాత్త్విక సామాజిక మార్గంలో నడుద్దాం.


డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు 
మొబైల్‌: 98497 41695

(నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి) 

Advertisement
Advertisement