Sakshi Guest Column Special Story On Folk Singer Gaddar Revolutionary Songs In Telugu - Sakshi
Sakshi News home page

Gaddar Revolutionary Songs: జవ సత్వాలున్న జన గళం

Published Tue, Aug 8 2023 12:26 AM

Sakshi Guest Column On Gaddar Songs

ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్‌. ఆయన ఆలోచన, రచనలు... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్‌ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు.

స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. ఆయన భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తుపాకీ తూటా సహా ‘మహాబోధి’ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ... విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనంలో ఉండిపోతాయి.

న్యాయం కోసం తనకు తానుగా ఒక ప్రజా గీతంగా, ఒక ప్రజాయుద్ధ నౌకగా అవతరించిన గద్దర్‌ (75) – గుమ్మడి విఠల్‌ – ఆగస్టు 6న కన్నుమూశారు. ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్‌. ప్రజా గేయ రచయితగా ఎదుగుతున్న క్రమంలో 1970లలో గద్దర్‌ రాసిన పాట తెలుగునాట మోతెత్తిపోయింది.

సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా / నీవు సినబోయి గూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా
రాడికల్‌ విద్యార్థి ఉద్యమం వైపు మళ్లి, తర్వాత ఒక జాతీయ బ్యాంకులో క్లర్కుగా చేసి, కొంతకాలానికే ఆ ఉద్యోగాన్ని వదిలి, తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత, నక్సలైట్‌ ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు విప్లవోద్యమంలో పూర్తి సమయం గాయ కుడిగా మారారు. చిన్న చిన్న సభల్లో, కొన్నిసార్లు వీధుల్లో పాటలు పడుతూ, జనాన్ని సమీకరిస్తూ సీపీఐ–ఎంఎల్‌ (పీపుల్స్‌ వార్‌)లో అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యారు.

పీడిత వ్యవసాయ ఉత్పాదక రంగ ప్రజానీకం మీద; భూస్వాముల దోపిడీలు, దౌర్జన్యాల మీద తనదైన శైలిలో పాటలు రాసి, పాడి, భారతదేశ సాంస్కృతిక రంగాన్ని కదం తొక్కించారు. సాయుధ విప్లవం మాత్రమే ప్రస్తుత వ్యవస్థకు ప్రత్యా మ్నాయాన్ని నిర్మించగలదని చాలాకాలం పాటు నమ్మికతో ఉన్నారు.  

గద్దర్‌ అనే తన పేరును ఆయన అమెరికా గదర్‌ ఉద్యమం నుంచి తీసుకున్నారు. చివరికి ఆ పేరు మావోయిస్టు పోరాటాలకు భారతీయ చిహ్నంగా మారింది. 1997లో గద్దర్‌ అజ్ఞాతం నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు ఆయనపై జరిగిన కాల్పులలో ఐదు తూటాలు ఆయన శరీరంలోకి దిగబడ్డాయి.

వైద్యులు నాలుగు తూటా లను బయటికి తీయగలిగారు. మిగతా ఒక తూటా మొన్నటి రోజున ఆయన అంతిమ శ్వాస తీసుకునే వరకు పాతికేళ్లకు పైగా ఆయన శరీరం లోపలే ఉండిపోయింది.
 
ధైర్యం, దృఢచిత్తం, వివేకం, వినయం... అదే సమయంలో చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఇవీ గద్దర్‌లోని గుణాలు. క్రమంగా ఆయనకు తెలిసి వచ్చినదేమంటే... మావోయిస్టు విప్లవం ఎక్కడికీ దారి తీయడం లేదని. దాంతో దళిత ఉద్యమం వైపు మళ్లి, ప్రజాదరణ పొందే విధంగా పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టాడు. 1985లో కారంచేడు కమ్మ భూస్వాములు ఎనిమిది మంది దళితులను దారుణంగా హత్య చేసినప్పుడు ఆయన రాసిన పాట ఇది:

కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరుచేసిన దళిత పులులమ్మా 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్‌ దళితులను ఏకం చేసేందుకు ఈ పాట ఆయుధంగా మారింది. అక్కడి నుంచి ఆయన అంటరాని తనం, అంబేడ్కరిజం, రాజ్యాంగవాదంపై పాటలు రాయడం ప్రారంభించారు. 

1990లో మండల్‌ వ్యతిరేక ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. సామాజిక న్యాయం, ప్రతిభ అన్నవి మండల్‌ అనుకూల,మండల్‌ వ్యతిరేక శక్తుల సైద్ధాంతిక లంగర్లు అయ్యాయి. కమ్యూనిస్టు విప్లవకారులు కూడా తమ అగ్రవర్ణ నాయకుల నేతృత్వంలో స్పష్టమైన వైఖరిని తీసుకోడానికి వెనుకంజ వేస్తున్నారు.

‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ అప్పటి ఎడిటర్‌ అరుణ్‌శౌరీ మేధోపరమైన మండల్‌ వ్యతిరేక ఉద్య మానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో గద్దర్‌ రాసిన పాట మండల్‌ అనుకూల శక్తులకు ఆయుధంగా మారింది. 

అరుణ్‌శౌరిగో నీకు ఆకలి బాధేమెరుక నెయ్యి కాడ నువ్వుంటే పియ్యికాడ మేముంటం
ఈ పాట చాలామంది అగ్రవర్ణ విప్లవకారులకు నచ్చలేదు. కానీ మండల్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్న ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీలకు స్ఫూర్తినిచ్చేందుకు గద్దర్‌ ఆ పాటను బహిరంగ సభలలో పాడుతూనే ఉన్నారు. 

1990వ దశకం చివరిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. మెల్లిగా గద్దర్‌ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల శక్తిగా మారారు. 

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా... బలే.. బలే.. బలే...
ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. గద్దర్‌ ఎప్పుడూ టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతుదారు కానప్పటికీ మావోయి స్టుల మద్దతుతో సమాంతర రాడికల్‌ తెలంగాణ అనుకూల గ్రూపు లను నడిపించారు. 

ఈ క్రమంలో మావోయిస్టు భావజాలంతో గద్దర్‌ వ్యతిరేకించారు. వర్గపోరు మాత్రమే సరిపోదు, కులపోరాటాన్ని చేపట్టాలని భావించారు. అనేక విముక్తి బలాలను కలిగి ఉన్న భారత రాజ్యాంగాన్ని గుర్తించడం ప్రారంభించారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేడ్కర్‌ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలని మావోయిస్టులను ఒప్పించేందుకు పార్టీతో అంతర్గతపోరును సాగించారు.

అయితే సహజంగానే వారు తమ పాత వర్గ పోరాట పంథాను మార్చుకోడానికి నిరాకరించారు. దాంతో పార్టీ నుంచి బయటికి వచ్చి నేటి భారత రాజ్యాంగాన్ని సమర్థించిన, సమర్థిస్తున్న అనేక ఇతర శక్తులతో కలిసి పని చేశారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభిన్న రాజకీయ, సైద్ధాంతిక శక్తులతో సన్నిహితంగా మెలిగారు. అప్పటికే గద్దర్‌పై ఆయన మావోయిస్టుగా ఉన్నప్పటి కేసులు అనేకం ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. ఆ సమయంలోనే కొంత కాలం గద్దర్, నేను... సీపీఎం మద్దతు ఉన్న బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌లో కలిసి పని చేశాం. మరోవైపు ఆయన కాంగ్రెస్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తెలంగాణలో రాహుల్‌ గాంధీ ప్రసంగించిన కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్‌ను, సోనియాగాంధీని కలిశారు. 

గద్దర్‌ జీవితం వీరోచిత పోరాటాల అవిశ్రాంత గాథ. ఒక్క రెండు పాటలు తప్ప మిగతా ముఖ్యమైన పాటలన్నీ తనే రాసి, పాడినవి. గద్దర్‌ పాడటంతో ప్రాచుర్యం పొందిన ‘బండెనక బండి కట్టి’ పాట 1940లలో నిజాంకు, రజాకర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో యాదగిరి రాసినది. రెండో పాట: ఈ ఊరు మనదిర, ఈ వాడ మనదిర / దొర ఏందిరో, వాని పీకుడేందిరో. ఈ పాటను మరో ప్రముఖ దళిత గాయకుడు, రచయిత గూడ అంజయ్య రాశారు. గద్దర్‌ తన గళంతో ఆ పాటను ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ప్రతి పల్లెకు తీసుకెళ్లారు. 

గద్దర్‌ ఆలోచన, రచన... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్‌ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. వంటపని, వీధుల పారిశుధ్యం,ఇంటిని శుభ్రంగా ఉంచే హింసాత్మక శ్రమలలోని నొప్పిని పాటలుగా మలిచారు. ఇంటికి చీపురు చేసే సేవలోని గొప్పతనంపై ఆయన రాసి, పాడిన పాట అత్యంత తాత్వికమైనది. 

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో గద్దర్‌ తన పూర్వపు కమ్యూనిస్టు నాస్తికత్వాన్ని పక్కనపెట్టి సరైన బౌద్ధేయుడు అయ్యారు. గద్దర్‌ భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తూటా సహా ‘మహాబోధి’ (పేద పిల్లల కోసం ఆయనే స్థాపించిన పాఠశాల) ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ, మానవ సమానత్వంపై ఆయన ప్రేమ, విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనం జీవనంలో ఉండిపోతాయి. 
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

Advertisement
Advertisement