Sakshi News home page

లౌకిక వాదానికి హిందుత్వ వారధి

Published Mon, Feb 12 2024 4:51 AM

Sakshi Guest Column On LK Advani

‘భారతరత్న’ లభించడంతో వార్తలలోకి వచ్చిన బీజేపీ రాజకీయ దిగ్గజం లాల్‌ కృష్ణ అద్వానీ విలక్షణమైన నాయకుడు. ఆయన మాటల్లో దాపరికాలు ఉండవు. తన తప్పును అంగీకరించడానికి భేషజ పడటం ఉండదు. అవసరం అయితే క్షమాపణ అడిగేందుకు కూడా సుముఖంగా ఉంటారు! స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడిన నాయకుడాయన. హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయనంతటి ఆత్మనిశ్చయం గల శక్తిమంతులు ఓ గుప్పెడు మంది మాత్రమే కనిపిస్తారు. పరస్పర వైరుధ్యం కలిగిన హిందుత్వానికి, లౌకికవాదానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో అద్వానీ... లోకమాన్య తిలక్, గాంధీజీల దృక్పథాన్ని అనుసరించారు. 

నాకు చాలాకాలంగా, అతి సన్నిహితంగా పరిచయం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు – ఆయన ద్వారా ఆయన కుటుంబం కూడా – లాల్‌ కృష్ణ అద్వానీ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒక కాలం ఉండేది... నేను ఆయన విశ్వాసాన్ని స్పష్టంగా గెలుపొందిన కాలం; కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నా సలహాను సైతం ఆయన తీసుకున్న కాలం. ఆ క్రమంలో ఆయన నన్ను భారత రాజకీయాలలోని గుంభనమైన అంతర్గత కార్యకలాపాలపైన కూడా నా దృష్టి చొరబాటును అనుమతించారు. 

ఇప్పుడు ఆయనకు ‘భారతరత్న’ లభించడంతో ఆయనతో నా మొదటి ఇంటర్వ్యూ నా మదికి, మననానికి వచ్చింది. ఆయన్ని నిజమైన ప్రత్యేక రాజకీయ నాయకుడిగా మార్చిన ఆయనలోని లక్ష ణాలను సంగ్రహించిన ఇంటర్వ్యూ అది. తన మాటల్లో దాపరికాలు లేకుండా, నిజాయితీగా ఉండే నాయకుడు మాత్రమే కాదాయన... తన తప్పుల్ని అంగీకరించడానికి సైతం సుముఖంగా ఉండేవారు. అవసరం అయితే ‘మన్నింపు’ను కోరేవారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అతికొద్ది మంది మాత్రమే నాకు తెలుసు.  
1990లో అద్వానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నేను – ఆ ముందరే ఇండియాకు తిరిగి వచ్చిన – ఒక అనామక జర్నలిస్టుని. ‘హిందూస్థాన్‌ టైమ్స్‌ ఐవిట్నెస్‌’ ప్రారంభ ఎపిసోడ్‌ కోసం ఆ ఇంటర్వ్యూను చేశాన్నేను. డిసెంబరు నాటి ఒక అహ్లాదకరమైన అపరాహ్నవేళ అద్వానీ పండారా పార్క్‌ నివాసంలో ఆయనతో కలిసి కూర్చున్నాను. మరీ దీర్ఘంగా ఏం కాదు, బహుశా కేవలం పది నిముషాలు మా మధ్య సంభాషణ జరిగినట్లుంది.అందులోని చిన్న భాగం ఇది:

కరణ్‌ థాపర్‌: మీరు అధికారంలో ఉండి ఉంటే కనుక ఇండియాను హిందూ దేశంగా మార్చేవారా? ఒక అధికారిక హిందూ దేశంగా?
ఎల్‌.కె. అద్వానీ: ఇంగ్లండ్‌ క్రైస్తవ దేశం అయినట్లే, ఇండియా హిందూ దేశం అని నేను నమ్ముతాను. ఇందులో ఎక్కువ తక్కువలేం లేవు. 

‘‘మీరు మాటలతో ఆడుకుంటారనే భావన చాలామందిలో ఉంది. కాబట్టి హిందుత్వం అంటే అర్థం ఏంటో చెప్పండి?
హిందుత్వం కోసం మీరు నిలబడతారా, లేక తడబడతారా? హిందు త్వానికి మీరు అనుకూలమేనా?’’ 
‘‘నేను స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడతాను. కానీ తన హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని నమ్ముతాను. ఇంతకు మించి చెప్పేదేం లేదు.’’ 

‘‘ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. కచ్చితంగా ఇదీ అని చెప్పండి. మీరు కోరుకుంటున్నది లౌకిక భారతదేశాన్నా లేక హిందూ భారతదేశాన్నా?’’
‘‘నిశ్చయంగా, నిజాయితీగా నేను లౌకిక భారతదేశం కోసమే నిలబడతాను.’’

‘‘అక్కడే సమస్య వస్తోంది మిస్టర్‌ అద్వానీ. చాలామంది ప్రజలు మీరు అనుకూలంగా ఉన్న హిందుత్వకు, మళ్లీ మీరే అనుకూలంగా ఉన్న లౌకికవాదానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని చూస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు మీరు వంతెన వేయలేరని అనుకుంటున్న వాటికి మీరు వంతెన వేయటానికి ప్రయత్నిస్తున్నారు.’’

‘‘నేను విశ్వసిస్తున్నది లౌకికవాదం పట్ల నెహ్రూకి, లేదా సర్దార్‌ పటేల్‌కు ఉన్న దృక్పథాన్ని కాదు. లోకమాన్య తిలక్‌కు, గాంధీకి ఉన్న టువంటి దానిని. అయితే ఈ దృక్పథాన్ని గత నాలుగు దశాబ్దాలలో ఎన్నికల ప్రయోజనాలు వక్రీకరిస్తూ వచ్చాయి.’’

‘‘భారతదేశంలోని పది కోట్లమంది ముస్లింల పట్ల మీ వైఖరి ఏమిటి? వారు ఈ దేశంలోని విడదీయరాని భాగం అని మీరు విశ్వసిస్తారా?’’
‘‘కచ్చితంగా. కచ్చితంగా. నిస్సంకోచంగా.’’
‘‘అప్పుడైతే, దేశంలోని దాదాపు 3,000 మసీదులను కూల్చివేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలనే వీహెచ్‌పీ డిమాండ్‌కు వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకం అని నేను నమ్మొచ్చా?’’
‘‘నేను వ్యతిరేకమే.’’
‘‘పూర్తిగా?’’
‘‘పూర్తిగా.’’
కావలిస్తే ఈ సంభాషణను మళ్లీ చదవండి. ప్రశ్నల దృఢత్వాన్ని, జవాబులలోని నిజాయితీని గమనించండి. అద్వానీ తర్వాతి నాయకు లలో ఎవరితోనైనా ఇలాంటి సంభాషణ ఈరోజు సాధ్యం అవుతుందని నేను అనుకోను. వాళ్లు దీనిని ఏమాత్రం సహించలేరు. లేచి వెళ్లి పోతారు. 

అయితే అసలు విషయం, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందన్నది. తర్వాత నేను ఆద్వానీని కలిసినప్పుడు ‘‘ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అడిగాను. అందుకు ఆయన కఠిన మైన పలుకులతో... అదొక హాస్యాస్పదం అని కొందరు తనతో అన్నట్లు చెప్పి, ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు!
ఆయన ప్రవర్తన నన్ను నిరుత్తరుడిని చేసింది. ఆయనకు ఇంటర్వ్యూ వీడియోను పంపి, స్వయంగా తననే చూడమని కబురు పెట్టాను. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టించారని నా నమ్మకం. 

వారాలు, నిజానికి నెలలు గడిచినా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నేను కూడా వస్తుందని ఎదురు చూడటం మానే శాను. హఠాత్తుగా... చీకటి పడుతున్న ఒక వేసవి సాయంత్రం నా ఫోన్‌ మోగింది. అటువైపు ఎల్‌.కె. అద్వానీ. 

‘‘కరణ్, నేనిప్పుడే ఇంటర్వ్యూ చూశాను. అందులో కొంచెం కూడా నాకు తప్పు కనిపించలేదు. కానీ నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని సాకుగా చూపడం నా వయసుకు తగినది కాదు. మనం చివరిసారి కలుసుకున్నప్పుడు నీతో అనుచితంగా ప్రవర్తించాను. క్షమాపణలు చెప్పడానికే నీకిప్పుడు ఫోన్‌ చేశాను’’ అన్నా రాయన.  

తప్పును అంగీకరించడానికి ఏ సంకోచమూ లేని సంసిద్ధతే బహుశా అద్వానీలోని గొప్ప గుణంగా తక్షణం ఆయన పట్ల నాకు అక ర్షణ కలిగేలా చేసింది. ఆయన తర్వాత మళ్లీ అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఓ గుప్పెడు మంది భేషజాలు లేకుండా తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగగల శక్తిమంతులు ఉన్నారు. అద్వానీ గురించి ఇంకా మీరేం అనుకున్నా – ఆయనపై ఇతరులకు భిన్నాభిప్రా యాలు ఉంటాయని నేను అంగీకరిస్తాను – ఒక మంచి మనిషి మాత్రమే అలా ఉండగలరు. 
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement
Advertisement