కాలచక్ర భ్రమణంలో మార్పులెన్నో! | Sakshi
Sakshi News home page

కాలచక్ర భ్రమణంలో మార్పులెన్నో!

Published Sun, Apr 7 2024 4:13 AM

Sakshi Guest Column On new small island

అభిప్రాయం

చాలామంది వచ్చే సంవత్సరం బతుకు ఎలా సాగుతుందని తెలుసుకోవాలి అనుకుంటారు. మరికొందరికి వచ్చే వారంలో విశేషాలు తెలియాలని ఆత్రం. రానున్న తరాల తీరు, మనుషుల బతుకు గురించి తెలుసుకోవాలనే వారు కూడా ఉన్నారు. నిజంగా తెలివి తెలిసిన తర్వాత కూడా వేల ఏళ్లు గడిచాయి. ఈ మధ్యన జరిగిన ఒక పరిశోధన ప్రకారం మన దేశంలో 54 వేల సంవత్సరాల కాలం నుంచి మనుషులు ఉన్నట్టు ఆధారాలు కనిపించాయి. ఇప్పటికి పదివేల సంవత్సరాల మునుపు వ్యవసాయం మొదలైంది. అప్పటి వరకు మనిషి ప్రకృతి మీద ఆధారపడి మాత్రమే బతికాడని అర్థం. వ్యవసాయం వచ్చిన తర్వాతే నగరాలు పుట్టుకొచ్చాయి. నగరాలు వచ్చాయి అంటే నాగరికత వచ్చిందని అర్థం. ఇప్పుడేమో ఏకంగా 21వ శతాబ్దిలోకి వచ్చేశాము మనము! 

ఉత్త రోజులు వస్తాయి అని అందరూ ఎదురుచూచిన కాలం ఇదేనేమో? కొంతకాలం పోతే నీళ్లు ఉండవు, తిండి ఉండదు, చివరకు గాలి కూడా ఉండదు, అంతా సర్వనా శనం అవుతుంది లాంటి మాటలు తరచుగా వినబడుతున్నాయి. అది నిజమేనేమో? ఇప్పటికే కొన్ని చోట్లలో మంచినీళ్లు దొరకక పెట్రోల్‌ కొన్నట్టు లీటర్ల ప్రకారం నీళ్లు కొంటున్నారట! అయినప్పటికీ మనిషి జాతి మరో లక్ష సంవత్సరాలు మనగలగడం మాత్రం గ్యారెంటీ అంటున్నారు మరికొందరు! 

అటువంటి పరిస్థితులలో మనిషి మనుగడ ఏ రకంగా ఉంటుంది? యువాల్‌ నోవా హరారి లాంటివారు రానున్న కాలంలో బ్రతుకులను గురించి తమ ఊహలను బయట పెట్టి సంచలనం సృష్టించారు. మనకు గతం గురించి తెలుసు కనుక, ఆ విషయాలు, వివరాల ఆధారంగా భవిష్యత్తును కూడా ఊహించడానికి వీలవుతున్నది.  

మనుషులు ఇలాగే ఉంటారా? మునుముందు కూడా ఈ రకంగానే మాట్లాడతారా? ఎక్కడ బతుకుతారు?ప్రకృతి మనకోసం ఇలాగే మిగిలి కొనసాగుతుందా? మనిషి విశ్వం లోతులలోకి వెళ్ళగలుగుతాడా? మనకు కావ లసిన కనీసపు వనరులు మిగులుతాయా? దొరుకుతూనే ఉంటాయా? ఎన్నో ప్రశ్నలు! వాటికి జవాబులు కూడా! 

ఈ ప్రశ్నలన్నీ వెనకటి నుంచి అడుగుతున్నవే. సాహస యాత్రికులు ఈ రకం ప్రశ్నలు ప్రేరణతో ప్రపంచమంతా తిరిగి కొత్త ప్రాంతాలను కనుగొన్నారు. భూమి పొరలలోని ప్లేట్ల కదలిక, మరిన్ని మార్పుల కారణంగా కొత్త భూభాగాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు సైంటిస్టులు. హవాయి ప్రాంతంలో సముద్రంలోనే అగ్నిపర్వతాల పేలుళ్ల కారణంగా ఎన్నో దీవులు పుట్టాయి. అలాంటి దీవులు అక్కడక్కడ మరిన్ని పుట్టే వీలు కూడా ఉంది. అవి ప్రపంచమంతా సముద్రంలో ఎక్కడయినా పుట్టవచ్చు. హవాయి ప్రాంతంలో సముద్రంలో లోహియీ అనే అగ్ని పర్వతం మునిగి ఉంది.

సముద్రమట్టంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ఒక కొత్త దీవి పుట్టడం తప్పదనిపిస్తుంది. అంటే బయటపడుతుంది. యూరప్, ఆఫ్రికా తీరాల వెంట కూడా కొత్త దీవులు పుడతాయి. ఈ రెండు ఖండాలు ఏటా రెండున్నర సెంటీమీటర్ల చొప్పున వాయవ్యం వైపు కదులుతున్నాయి. మరో కొన్ని మిలియన్‌ సంవత్సరాలలో జిబ్రాల్టర్‌ సంధి మూసుకుపోతుంది. అట్లాంటిక్‌ నీరు అందకుంటే మధ్యధరాసముద్రం ఎండి పోతుంది.

ఆఫ్రికా ఖండం తోసుకువచ్చి కలిసే లోపల, దక్షిణ యూరప్‌ తీరాలలో కొత్త ప్రాంతాలు బయటపడతాయి. అవి జరగడానికి చాలా కాలం పడుతుంది. మానవ ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు మనకు ఫాస్ట్‌ ఫార్వ ర్డ్‌గా కనిపిస్తున్నాయి. రానున్న మార్పులను మనం స్లో మోషన్‌లో చూడాలి. అసలు మార్పుల గురించి మనకు ఆలోచన అంటూ ఉంటే, చూడడం వీలు కుదురుతుంది.

శుభకృతు, శోభకృతు అని రెండు సంవత్సరాలు గడిచాయి. వాటిలో ఎంత శుభం జరిగింది, ఎంతటి శోభ కుది రింది అని అందరూ ఆలోచించుకోవాలి. ప్రమాది సంవ త్సరంలో ప్రమాదాలు మాత్రమే జరుగుతాయి అను కుంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఇక ఈ ఉగాది నుంచి మొదలయ్యే సంవత్సరం పేరు క్రోధి అంటున్నారు. క్రోధం అంటే కోపం అని అర్థం. సంవత్సరాల పేర్లను బట్టి ఏమీ జరగదు. ప్రపంచం మొదటి నుంచి ఒకే రకంగా ముందుకు సాగుతున్నది. ఇప్పుడు కూడా అదేరకంగా సాగు తుంది. క్రోధి అని పేరుగల సంవత్సరంలో కూడా ఎప్పటి లాగే మంచి చెడులు కలగలుపుగా ఉంటాయని అనుకుంటే ఇక సమస్య ఉండదు.
డా‘‘ కె.బి. గోపాలం 
వ్యాసకర్త సైన్స్‌ అంశాల రచయిత

Advertisement

తప్పక చదవండి

Advertisement