పాక్‌ నాయకత్వానికి అసలు పరీక్ష | Sakshi
Sakshi News home page

పాక్‌ నాయకత్వానికి అసలు పరీక్ష

Published Tue, Mar 12 2024 12:25 AM

Sakshi Guest Column On Pakistan leadership


విశ్లేషణ

ఎన్నికలపై రాజకీయ గందరగోళం, వివాదాలతో కూడిన వాతావరణంలో పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానిగా తన రెండవ పదవీ కాలంలో, షెహబాజ్‌ షరీఫ్‌ బలహీనమైన ఆరు పార్టీల సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది పాలనాపరమైన పని నుండి ప్రభుత్వ దృష్టిని మరల్చగలదు. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని ‘పీటీఐ’ భావించడం కూడా పాలక కూటమికి సవాలే. పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేసేదే. ఇక ఆర్థిక సవాలు, అత్యంత ముఖ్యమైనది. పాక్‌ దారుణమైన సంక్షోభంలో ఉంది.

అయితే, కఠినమైన ఆర్థిక చర్యల ద్వారా భారత్‌ సహా పలు దేశాలు భయంకరమైన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాయని గుర్తుంచుకోవాలి.పూర్తి మెజారిటీ లేని నాయకుడిగా షెహ బాజ్‌ షరీఫ్‌ తన ప్రభుత్వ మనుగడ కోసం పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)పై ఆధారపడ్డారు. ఈ పార్టీ కేబినెట్‌లో చేరడానికి నిరాకరిస్తూ ప్రభుత్వానికి మద్దతునిచ్చింది. దీని అర్థం ఏమిటంటే, పీపీపీ, ఇతర మిత్రపక్షాలను సంతోషంగా ఉంచడానికీ, వారి డిమాండ్లను నెరవేర్చడానికీ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలలో నిమగ్నమై ఉంటుంది. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ) భావిస్తున్నందున ఇది పాలక కూటమికి నిరంతరం సవాలును విసురుతుంది.

జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షం పెద్ద కూటమిగా ఏర్పడినందున పార్లమెంటరీ వ్యవహారా లను నిర్వహించే పనిని అది మరింత కష్టతరం చేస్తుంది. అసెంబ్లీ ప్రారంభ సెషన్లలో పీటీఐ మద్దతుగల జాతీయ అసెంబ్లీ సభ్యుల విఘాతకరమైన ప్రవర్తన, రాబోయే పరిణామాల స్వరూపాన్ని సూచి స్తోంది. ప్రత్యేకించి వారు ప్రతి సెషన్ లోనూ నిరసనలు తెలుపుతామని తేల్చి చెప్పారు. ఈ ఘర్షణ శాసన నిర్మాణానికి అడ్డంకులుగా మారు తుంది. పైగా పార్లమెంట్‌ కార్యకలాపాలను కూడా స్తంభింపజేస్తుంది.

పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికా రాన్ని పరిమితం చేస్తుంది. తన మునుపటి పదవీకాలంలో, షెహబాజ్‌ షరీఫ్‌ సైనిక వ్యవస్థకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన మార్గంలో దానిపై తిరగబడడం లేదా దాని పాత్రను తగ్గించడం అసంభవం. కాబట్టి దేశం ఎలా నడుస్తుందనే అంశంపై సైన్యం అజమాయిషీ కొనసాగుతుందని దీని అర్థం.

తర్వాత క్లిష్టమైన ప్రాదేశిక ముఖచిత్రం కూడా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి పిఎమ్‌ఎల్‌–ఎన్‌ ఒక ప్రావిన్ ్సను మాత్రమే నియంత్రి స్తోంది. మిగిలిన మూడు ప్రావిన్సులను వేర్వేరు పార్టీలు నియంత్రి స్తున్నాయి. పైగా ఖైబర్‌ పఖ్తున్‌క్వాలో పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం కొనసాగుతోంది. ఇది కూడా కొత్త ప్రభుత్వానికి పరిమితులు విధిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను నిర్వహించడం ఒక స్పష్టమైన సవాలుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకమైన తత్వం, దృఢంగా వ్యవహరించడం మధ్య తెలివైన కలయిక అవసరం.

అయితే దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పరిమితులు ఏవీ ప్రభుత్వాన్ని నిరోధించకూడదు. ఏదేమైనా, అది ప్రభుత్వ బాధ్యత. దీని కోసం, ప్రధానమంత్రి తన మునుపటి పదవీకాలంలో నియమించిన విచిత్రమైన, సంఖ్యరీత్యా పెరిగి పోయిన క్యాబినెట్‌ను కాకుండా, ఒక సమర్థమైన బృందాన్ని ఎంచు కోవాలి. స్పష్టమైన, పొందికైన విధాన ఎజెండాను రూపొందించాలి. 

ఆర్థిక సవాలు, వాస్తవానికి అత్యంత ముఖ్యమైనది. పాకిస్తాన్‌ భారీ విదేశీ రుణ సేవా బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుండి కోరుకోవాల్సింది పొందేందుకు షరీఫ్‌ ప్రభుత్వం కఠినమైన, రాజకీయంగా బాధాకరమైన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక సవాలు తీవ్రమైనది అయినప్పటికీ ఈ సంక్షోభంలోనూ ప్రభుత్వం ఒక అవకాశాన్ని చూడాలి.

ఎక్కువ రుణాలు తీసుకోవడం, ఉద్దీపనలు, సంస్కరణలను వాయిదా వేయడం, అధిక స్థాయి రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సృష్టించకుండా ఎక్కువ రుణాలు సేకరించడం– ఇవన్నీ పాక్‌ రహదారిపై మరొక సంక్షోభానికి మాత్రమే హామీ ఇస్తాయి. వృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి లేదా రికార్డు స్థాయి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విషయంలో ఏమీ చేయదు.

కాబట్టి రోగాన్ని దాచిపెట్టే బ్యాండ్‌ ఎయిడ్‌ విధానం, ఏ విధంగానూ ఇప్పుడు ఆమోదయోగ్యం కాదు. ప్రత్యామ్నాయంగా ఈ సంక్షోభాన్ని విస్తృత శ్రేణి నిర్మాణాత్మక సంస్కరణలను ప్రారంభించడానికీ, ఆర్థిక వ్యవస్థను విష వలయం నుండి బయట పడేయటానికీ ఉపయోగించవచ్చు. నిలకడలేని ఆర్థిక అసమతుల్య తలు, భారీ దేశీయ, విదేశీ రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ పొదుపులు, పెట్టుబడి, స్తంభించిన వృద్ధి– ఇవన్నీ ఈ విషవలయంలో భాగమే.

ప్రపంచంలోని పలు దేశాలు పాకిస్తాన్‌ ఎదుర్కొంటున్న దాని కంటే  భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. కానీ అవి సంక్షోభాన్ని బలంగా, మరింత స్థితిస్థాపకంగా తిరిగి లేచినిలబడేలా ఉపయోగించుకోగలిగాయి. 1997లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆగ్నేయాసియా దేశాలు ప్రాథమిక సంస్కరణలను చేపట్టడం ద్వారా, కఠినమైన ఆర్థిక చర్యలతో నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడం ద్వారా గట్టెక్కాయి. అదేవిధంగా, 1990లలో భారతదేశం, 1980లు, 1990లలో అనేక లాటిన్‌ అమెరికన్‌ దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాయి.

అవి తర్వాత కోలుకోవడమే కాకుండా పటిష్టమైన వృద్ధి బాటలో పయనించగలిగాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాయి. ప్రతి సందర్భంలోనూ, దీర్ఘకాల నిబద్ధత చూపుతూ, స్థిరమైన విధానాలను ఈ దేశాల నాయకులు అమలుపరిచారు. అతుకుల బొంత పరిష్కారాలు నిజానికి పరిష్కారాలే కావనీ, నిర్మా ణాత్మక సర్దుబాట్లు, కఠినమైన ఆర్థిక విధానం, ఇతర సంస్కరణ చర్యలు ముందుకు సాగడానికి చాలా అవసరమనీ విశ్వసించిన సమర్థ బృందాల దన్నుతో నాయకులు తగు చర్యలు ప్రారంభించారు. 

స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మరొక సంక్షోభం కూడా షరీఫ్‌ ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తుంది. ఇది మానవాభివృద్ధిలో సంక్షోభం. అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, పేదరికం, సామాజిక న్యాయం, మానవ సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలు ఇటీ వలి సంవత్సరాలలో క్షీణిస్తున్నాయి. ప్రపంచ మానవాభివృద్ధి ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ బ్యాంక్‌ దీనిని ‘నిశ్శబ్ద, లోతైన మానవ మూలధన సంక్షోభం’గా పేర్కొంది.

అత్యధిక సంఖ్యలో బడి మానేసిన 2 కోట్లకు పైగా పిల్లలతో ప్రపంచంలోనే పాకిస్తాన్‌ రెండవ స్థానంలో ఉందనే భయంకరమైన వాస్తవం, దాని విద్యా అత్యవసర పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. 40 శాతం మంది నిరక్షరాస్యులతో అక్షరాస్యత స్థాయిలు నిలిచి పోయాయి. అంతకుముందటి సంవత్సరంతో పోలిస్తే 2023లో 1.25 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని అంచనా. మానవ అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇది దేశ స్థిరత్వం, ఆర్థిక పురోగతి గొప్ప ప్రమాదంలో పడనుందనే వాస్తవాన్ని తెలియజేస్తోంది. పాకిస్తాన్‌ నిద్రలో నడుచుకుని వెళ్తూ విపత్తులో పడిపోవచ్చని సూచిస్తుంది.

ఈ సవాళ్లను నిండు రాజకీయ వాతావరణంలోనే పరిష్కరించవలసి ఉంటుందనీ, ప్రభుత్వ అధికారంపై ఉన్న పరిమితులు, ప్రధాన విధాన చర్యలను అమలు చేయగల దాని సామర్థ్యంపై భారంగా పడతాయనీ అంగీకరించాలి. రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడానికీ, కీలక చర్యలపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికీ  ప్రభుత్వం మార్గాలను అన్వేషించాలి. ఇది సులభం కాదు. ప్రభుత్వ సంకీర్ణ భాగస్వాములు కఠినమైన ఆర్థిక చర్యల నుండి తమను తాము దూరం చేసుకోవాలనుకుంటున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీకి చెందిన నాయకులను వారి పోరాట మార్గం నుండి తప్పించడం కూడా అంతే కష్టం. అందుకే, షెహబాజ్‌ షరీఫ్‌కు ఇది నాయకత్వ పరీక్ష.

మలీహా లోధి 
వ్యాసకర్త పాకిస్తాన్‌ దౌత్యవేత్త; ఐరాసలో పాక్‌ మాజీ ప్రతినిధి
(‘ద డాన్‌’ సౌజన్యంతో)

Advertisement
Advertisement