Sakshi News home page

కూటమికి ఓటమి తప్పదు!

Published Tue, Mar 12 2024 12:34 AM

Sakshi Guest Column On TDP BJP Janasena Alliance

అభిప్రాయం

రెండో ప్రపంచ యుద్ధం గొప్ప సైన్యాధ్యక్షుడైన జనరల్‌ మెకార్థర్‌ ఒక సందర్భంలో ‘‘నిజమైన నాయకుడు ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా నిలబడ తాడు, కఠిన నిర్ణయాలకు వెనుకాడడు, ప్రజా సంక్షేమమే తన కర్తవ్యంగా భావిస్తాడు’’ అంటారు. మార్చి పదో తేదీ మేదరమెట్ల సిద్ధం సభలో జగన్‌ ప్రసంగం విన్న వారు, 58 నెలల పాలన చూసిన వారు జనరల్‌ మెకార్థర్‌ చెప్పిన ధీరోధాత్తుడి లక్షణాలు ఆయనలో చూస్తారు. మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి కట్టుగా వచ్చినా ప్రజా బలం ఉన్న తనను ఏమీ చేయలేరన్న ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపించింది. తన స్టార్‌ క్యాంపైనర్లు ప్రజలే నంటూ ఒంటరిగానే 175 సీట్లు గెలుస్తామన్న ధీమాను ఆయన మరోసారి వ్యక్తం చేశారు.  

కూటమిలోని పార్టీల గత ఎన్నికల ఫలితాలు, తాజా పరిణామాలు, సంక్షేమాభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి పరిశీలిస్తే మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.కూటమిలోని ప్రధాన పార్టీ తెలుగుదేశం క్రమంగా ప్రజాదరణ కోల్పోతోంది. ఎన్టీ రామారావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి సగటున 43.22 శాతం వోట్లు పొందగా చంద్రబాబు హయాంలో ఐదు సార్లు దేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళి 36.20 శాతం వోట్లు పొందింది. చంద్రబాబు హయాంలో సుమారు 7.02 శాతం ఓట్‌ బ్యాంక్‌ కోల్పోయిన ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ గతంలో కన్నా తక్కువ ఓట్లు పొందడం విశేషం.

1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్దినెలలకే చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చి వేశారు. ఆ ఏడాదితో పోల్చితే 1999 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయకత్వంలోని పార్టీ సుమారు ఒక శాతం, 2004 ఎన్నికల్లో 6.55 శాతం, 2009 ఎన్నికల్లో 9.47 శాతం, 2014 ఎన్నికలో 15.41 శాతం, 2019 నాటికి 3.54 శాతం ఓట్లు కోల్పోయింది. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు ఎన్నిక లకు వెళితే రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.

అంతేకాక గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ 40 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సారి కూడా గెలవలేకపోయింది. పొత్తు వల్ల తాను తిరిగి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వెళతాననే భావనతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఆయనకు మద్దతునిస్తున్న మిత్రుల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగినా ఆశ్చర్యపోనక్కర లేదు. కాపుల చిరకాల వాంఛ రాజ్యాధికారం. గతంలో చిరంజీవిని నమ్ముకున్న కాపులు నట్టేట మునిగారు.

పవన్‌ను తమ ఆశయ సాధకుడిగా సామాన్య కాపులతో పాటు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్లు కూడా ఆశించారు. అయితే పవవ్‌ కమ్మ పాలకవర్గ ప్రతినిధైన చంద్రబాబుతో చేతులు కలిపి ఆయననే ముఖ్యమంత్రి చేయాలనే కృతనిశ్చయంతో ఉండడంతో కాపు సామాజిక వర్గం మరో సారి నిరాశకు గురయింది.

అంతే కాక పవన్‌ గత ప్రసంగాల్లో పట్టుమని పదివేల ఓట్లు తెచ్చుకోలేని వారు కూడా టికెట్లు కావాలంటున్నారని నాయకులను ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని కాపుల కోసం మాత్రమే  పెట్టలేదంటూ ఆ వర్గాన్ని దూరం చేసుకునే విధంగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కులాల ప్రభావం అతిగానే ఉంది. కాపులు– కమ్మల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రంగా హత్యానంతరం ప్రారంభమైంది. చంద్రబాబుతో పవన్‌ చేతులు కల
పడం,  టికెట్ల విషయంలో దిగజారుడు తనాన్ని ప్రదర్శించడం; పవన్‌కు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి  పదవులపై లోకేష్‌ చేసిన ప్రకటన తదితరాలను  చాలామంది కాపులు జీర్ణించు కోలేకపోతున్నారు. 

గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు 20 లక్షల వోట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి ‘నోటా’ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీతో పొత్తుకు చంద్రబాబు తహ తహలాడారు. ఆయన తన లక్ష్యమైతే  నెరవేర్చుకున్నారుగానీ ఆ పార్టీ వల్ల సంభవించబోయే నష్టాన్ని అంచనా వేయలేక పోయారనిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీ పట్ల అనుమానంతో, అభద్రతా భావంతో ఉన్నారు. ఈ అభ ద్రతా భావమే వారిని ఏకం చేస్తోంది. కర్ణాటకలో హిజాబ్‌ వివాదం తర్వాత ముస్లిం పెద్దలందరూ ఏకమై  బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌కు మద్దతునిచ్చి ఆ పార్టీ విజయానికి దోహద పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తినా ఆశ్చర్య పోనక్కర లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో ముస్లిమ్‌లకు మూడు నుంచి 17 శాతం ఓట్లు ఉన్నాయి. 40 అసెంబ్లీ స్థానాల్లో, ముఖ్యంగా కర్నూలు (17 శాతం), కడప (16 శాతం), గుంటూరు (12 శాతం), అనంతపురం (11 శాతం), నెల్లూరు (10 శాతం), చిత్తూరు (10 శాతం) కృష్ణా (7 శాతం), ప్రకాశం (7 శాతం) జిల్లాల్లో జయాప జయాలపై వీరి ప్రభావం ఉంటుంది. జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ముస్లిమ్‌ కుటుంబాల్లో 90 శాతం మంది లబ్ధిపొందారు. అందువల్ల వారిలో ఎక్కువ మంది  వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికే మద్దతునిచ్చే అవకాశం ఉంటుంది.
 
జగన్‌ ప్రభుత్వం కాలం మహిళలు, పేదలకు  స్వర్ణయుగంగా మారింది. రాష్ట్రంలోని 90 శాతం గృహాలకు సంక్షేమ ఫలాలు అందాయి. గత 58 నెలలుగా ఈ ప్రభుత్వం వీరికి రూ. 12.75 లక్షల కోట్ల సంపద సమకూర్చింది. వీరికి నగదు బదిలీ, సంక్షేమ పథకాల రూపంలో సుమారు రూ. 4 లక్షల కోట్ల రూపాయలు,గృహాల రూపంలో లక్ష కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చింది. అంతేకాక మహిళలకు 31 లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా అందజేసింది. ఒక్కో ఇంటి స్థలం  కనీస విలువ రెండున్నర లక్షల రూపాయలు అనుకుంటే  ఆ 31 లక్షల ఇళ్ళ స్థలాల విలువ సుమారు రూ. 7.75 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.

అంటే జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సంక్షేమ పథకాల  విలువ రూ. 12.75 లక్షల కోట్లుగా భావించాలి. ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. దేశంలోని మరే రాష్ట్రం పేదలకు, మహిళలకు ఇంత పెద్ద మొత్తంలో సంపద సమ కూర్చలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి వారే నిర్ణయా త్మక శక్తిగా మారే అవకాశం ఉంది.

వి.వి.ఆర్‌. కృష్ణంరాజు 
వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ 
మొబైల్‌: 89859 41411

Advertisement

తప్పక చదవండి

Advertisement