జల విలయం నేర్పుతున్న గుణపాఠం | Sakshi
Sakshi News home page

జల విలయం నేర్పుతున్న గుణపాఠం

Published Fri, Feb 12 2021 12:27 AM

Uttarakhand Glacier Burst Guest Column - Sakshi

అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి కశ్మీర్‌ వరకు అభివృద్ధి పేరిట హిమాలయా నదీప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రతిచోటా విధ్వంసాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం సాగుతున్న అభివృద్ది నమూనా వల్ల స్థానిక ప్రజలు హిమాలయ ప్రాంతం నుంచి వలస వెళ్లిపోతున్నారు. పైగా పర్యావరణ వ్యవస్థ కూడా ధ్వంసమైపోతోంది. అందుకే భారతీయ హిమాలయ ప్రాంతంలో పూర్తిగా విభిన్నమైన అభివృద్ధి నమూనా ఎంతైనా అవసరం. వేగంగా లాభాలు సాధించడానికి ప్రాజెక్టులను ముందుకు నెడుతున్నారు తప్పితే దాని పరిణామాలను పట్టించుకోవడం లేదు. కేంద్రప్రభుత్వం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టి కోసం వెంపర్లాడుతుండటంతో అనేక తప్పుడు ప్రాజెక్టులు చలామణిలోకి వస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ సమతుల్యత దెబ్బతినడమే కాదు.. భవిష్యత్తుతో పూర్తిగా రాజీపడిపోవడం కూడా జరుగుతుంది.

ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలి జిల్లాలో రిషి గంగా, ధౌలి గంగా ప్రాంతంపై విరుచుకుపడిన మెరుపు వరదలు ఏ రకంగా చూసినా అకాల వరదలేనని చెప్పాలి. అందుకే తాజా విధ్వంసాన్ని అర్థం చేసుకోవాలంటే హిమాలయాలు, టిబెటన్‌ పీఠభూమికి చెందిన జల భౌగోళిక లక్షణాలను లోతుగా అవగాహన చేసుకోవలసిన అవ సరముంది. విషాదమేమిటంటే ఫిబ్రవరి 7న సంభవించిన విషాదానికి సంబంధించిన వాస్తవ సమాచారం చాలా తక్కువగా లభ్యమవడమే. ఒక అతిభారీ మంచుగడ్డ ఎక్కడినుంచి విరుచుకుపడింది, ఊహించని వి«ధంగా కిందికి దూసుకొచ్చిన జలప్రవాహం ధాటికి తాత్కాలికంగా ఏర్పడిన ధౌలిగంగా ముఖద్వారం ఎలా తుడిచిపెట్టుకుపోయింది అనే విషయాలపై భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇప్పటికీ అంచనా వేస్తూనే ఉన్నారు. ఇటీవలే కొంతమంది శాస్త్రజ్ఞులు ఆ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ దుర్ఘటనకు దారితీసిన వాస్తవ ప్రక్రియపై ఈ సర్వే కాస్త వెలుగును ప్రసాదించింది. అకాలంలో సంభవించిన ఈ జలవిలయానికి దారితీసిన ఘటనల క్రమాన్ని పునర్‌నిర్మించడానికి షెఫీల్డ్‌ యూనివర్సిటీ జియాలజిస్ట్‌ డేవ్‌ పెట్లీ గట్టి ప్రయత్నం చేశారు.

1. కొద్ది నెలలక్రితం హిమాలయ పర్వత శిఖరాగ్రంలో ఒక అతిపెద్ద భూఖండ విచ్ఛిత్తి సంభవించింది. 2. ఫిబ్రవరి 7 ఉదయం ధౌలిగంగా సమీపంలో అతిపెద్ద మంచుదిబ్బ విరుచుకుపడింది. 3. ఈ కొండచరియ భారీ మొత్తంలో మంచును, హిమనదీయ శి«థిలాలను కిందికి నెట్టుకుంటా వచ్చింది. 4. ఈ మంచు ప్రవాహం పశ్చిమ ప్రాంత లోయలోకి శరవేగంతో ప్రవహించి జనాభాతో కిక్కిరిసి ఉన్న ఆవాసాలపై విరుచుకుపడింది.

ఊహించని విధంగా విరుచుకుపడిన ఈ ఉత్పాతం దుర్బలమైన, పెళుసైన హిమాలయా పర్యావరణ వ్యవస్థపై జరుగుతున్న పరిశోధనలకు, పరిశీలనలకు ఎంత తక్కువ మదుపు పెట్టారనేందుకు భీతిగొల్పించే జ్ఞాపికగా మిగిలింది. ఇప్పటికీ హిమాలయ పర్వతాలు సంవత్సరానికి 1–10 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయని (మన చేతివేళ్లు పెరిగే వేగం అన్నమాట) ఒక సమతుల్యతా స్థితిని పొందడానికి నిత్యం ప్రయత్నిస్తున్నాయని ప్రపంచానికి తెలుసు, 5 కోట్ల సంవత్సరాల క్రితం భారత భూఖండం, యూరేసియన్‌ భూఖండంతో ఢీకొన్న తర్వాత భూ ఉపరితలం ఒక్కసారిగా పైకి ఎగిసి హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ రెండు భూఖండాల కింద ఇప్పటికీ తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడుతూ వస్తోందని శాస్త్రజ్ఞుల అంచనా.

రెండు భూఖండాల కిందిభాగంలో చెలరేగుతున్న ఈ బిగువును లేదా రెండు భూఖండాలను నొక్కిపెట్టడానికి జరుగుతున్న ప్రాకృతిక ప్రయత్నం కారణంగానే పర్వతప్రాంతం పైభాగంలో తీవ్ర చలనాలు ఎప్పటికప్పుడు ఏర్పడుతున్నాయి. కానీ కింది భాగంలో మాత్రం ఘర్షణ శక్తి పెరగడం కొనసాగుతూనే ఉంది. దీనివల్లే ఈ ప్రాంతం మొత్తంలో సూక్ష్మస్థాయిలో భూకంపాలు నిరంతరం ఏర్పడుతూ వస్తున్నాయి. అందుకే హిమాలయ పర్వత నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి చిన్న స్థాయిలో జరిగే విశ్లేషణలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయనే చెప్పాలి. చాలా స్థిరత్వంతో కనిపించే టిబెటన్‌ పీఠభూమితో పోలిస్తే భారత హిమాలయాలు అత్యంత పెళుసుగా ఉండి సులువుగా విరిగిపడే స్వభావంతో ఉంటున్నాయి. అందుకే ఈ ప్రాంతంపై దీర్ఘకాలి కంగా సాగాల్సిన పరిశోధనలకు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో హిమాలయ ప్రాంతాన్ని ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉండిపోతున్నాయి.

అన్నిటికంటే మించి పెద్ద సమస్య ఏదంటే శాశ్వత డేటా సేకరణ వ్యవస్థల నెట్‌వర్క్‌ ఈ ప్రాంతంలో దాదాపుగా లేకపోవడమే. లభ్యమవుతున్న కాస్త డేటా తాత్కాలికమైనదే. హిందూ కుష్‌ హిమాలయా, టిబెటన్‌ పీఠభూమి ప్రాంతంలో జరుగుతున్న విభిన్న పర్యావరణ మార్పులకు సంబంధించిన పలు అంశాలను అర్థం చేసుకోవడం కష్టమైపోతోంది. ప్రకృతి సహజ కారణాలకు మించి ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మన పేలవమైన పథకరచన, నిర్వహణనే ఎక్కువగా వేలెత్తి చూపాల్సి వస్తుంది. అందువల్లే భూగర్భ సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినప్పుడు, వారి సంఖ్యను కచ్చితంగా నిర్ధారించడం అసంభవమైపోతోంది. గల్లంతైన కార్మికులు, ప్రజల కుటుం బాల వేదనను చూస్తే మనం మన కార్మికులను ఎంతగా పీడిస్తున్నామో అర్థమవుతుంది. ఇలాంటి ఉత్పాతాలలో చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలీకపోవడం, వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం వింత గొలుపుతుంది.

మన పాలకులు వేగంగా లాభాలు సాధించడానికి ప్రాజెక్టులను ముందుకు నెడుతున్నారు తప్పితే వాటి పరిణామాలను పట్టించుకోలేదు. అధికారం, రిబ్బన్‌ కటింగ్‌తో సంతృప్తి పడిపోవడం అనేవి మన రోడ్లు, బ్రిడ్జీలు వంటి వాటిలో నాణ్యత పూర్తిగా దెబ్బతినేలా చేస్తున్నాయి. ఇటీపలి కాలంలో జలవిద్యుత్‌ ప్రాజెక్టుల కోసం సొరంగాలు, డ్యామ్‌ల నిర్మాణం ఎక్కువగా సాగిస్తున్నారు. హిమాలయ పర్వతాలపై రాళ్లను పేల్చే ప్రక్రియ యుద్ధ స్థాయిలో జరగటం కూడా పర్యావరణ విధ్వంసాన్ని మరింతగా పెంచుతోంది. భారీగా విద్యుత్‌ లభ్యత, విద్యుత్‌ రంగంలో పోగుపడే సంపదలు, ఈ రంగాన్ని బంగారు బాతుగుడ్డుగా చూసే పరిస్థితులు వంటివి ఈ ప్రాంతంలో ఆర్థిక, పర్యావరణ విధ్వంసానికి బాటలేస్తున్నాయి. ఒక్క ఉదాహరణ చూద్దాం.

కిన్నార్‌ ప్రాంతంలో జేపీ ఇండస్ట్రీస్‌ విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించి 50 కోట్ల డాలర్ల లాభాన్ని ఎగురేసుకుపోయింది. కానీ దాని దుష్ఫలితాలను తర్వాత కిన్నార్‌ గ్రామస్తులు అనుభవిస్తున్నారు. ఇదేవిధంగా దేశంలో సమృద్ధిగా లభిస్తున్న సిమెంట్, ఉక్కు నిల్వల సామర్థ్యం కూడా దేశ వ్యాప్తంగా మతిహీనమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు పరుగు తీసేలా చేస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతంలో డ్యాములు లేక రహదారులకు చెందిన పర్యావరణ నిర్వహణ ఘోరంగా తయారవడం విషాదం. అయితే వాటి దుష్ఫలితాలకు ప్రత్యక్షంగా గురవుతున్న ప్రజలు, సామాజిక బృందాలు పదే పదే చేస్తున్న ఆందోళనల కారణంగా కాస్త మార్పు వస్తోంది.

మన సరిహద్దుల్లో చైనా సాగిస్తున్న మౌలిక సదుపాయాల కల్పనతో పోటీపడటంవల్ల ప్రజలకు ఉపయోగం లేని, భూగర్భ పరిస్థితులను కుదుటపరిచేందుకు వీలులేని వివిధ రకాల నిర్మాణ పనులను భారత సరిహద్దుల్లోనూ వేగవంతం చేస్తున్నారు. పైగా కేంద్రప్రభుత్వం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టి కోసం వెంపర్లాడుతుండటంతో అనేక తప్పుడు ప్రాజెక్టులు చలామణిలోకి వస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కూలిపోవడమే కాదు.. భవిష్యత్తుతో పూర్తిగా రాజీపడిపోవడం కూడా జరుగుతుంది. 

అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి కశ్మీర్‌ వరకు అభివృద్ధి పేరిట హిమాలయా నదీప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రతిచోట విధ్వంసాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం సాగుతున్న అభివృద్ది నమూనా వల్ల స్థానిక ప్రజలు హిమాలయ ప్రాంతం నుంచి వలస వెళ్లిపోతున్నారు. పైగా పద్ధతి ప్రకారం పర్యావరణ వ్యవస్థ కూడా ధ్వంసమైపోతోంది. అందుకే భారతీయ హిమాలయ ప్రాంతంలో పూర్తిగా విభిన్నమైన అభివృద్ధి నమూనా ఎంతైనా అవసరం. పైగా వాణిజ్య కార్యకలాపాల నుంచి దూరం జరిగిపోవాలని భారత ప్రభుత్వం భావిస్తున్నందువల్ల కార్పొరేట్‌ లాభాలు, దలాల్‌ స్ట్రీట్‌ సెంటిమెంట్లకే ప్రాధాన్యత లభిస్తూ ప్రజలు దుష్పరిణామాల బారిన పడుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పలు ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడాన్ని చూస్తే దారిమళ్లుతున్న పెట్టుబడులపట్ల ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమవుతున్నట్లు బోధపడుతుంది.

-ఆర్‌. శ్రీధర్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త
(ది వైర్‌ సౌజన్యంతో)

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియవల్ల మారిన ప్రవాహ గతి

Advertisement
Advertisement