అప్పటి కాంగ్రెస్‌ ఏదీ? | Sakshi
Sakshi News home page

అప్పటి కాంగ్రెస్‌ ఏదీ?

Published Sun, Jan 8 2023 12:34 AM

Vanam Jwala Narasimha Rao Guest Column About Congress Party - Sakshi

ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీని చూస్తుంటే ఒకప్పటి కాంగ్రెస్‌ పార్టీయేనా ఇది అనిపి స్తుంది. పాత కాంగ్రెస్‌లో నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీసుకున్న వైనప్పటికీ, సంఖ్యా పరంగా మైనార్టీ ఆలోచనలను, సూచనలను ప్రజా స్వామ్య స్ఫూర్తితో గౌరవించేవారు. వాస్త వానికి భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవి ర్భావం జరిగినప్పటినుంచి కూడా, మోడరేట్లనీ, అతివాదులనీ భిన్నాభిప్రాయాలవారు ఉన్నప్పటికీ, స్వాతంత్య్ర సాధన లక్ష్యంతో కలిసిమెలిసి పనిచేసేవారు. స్వాతంత్య్రం వచ్చిన పిదప కూడా కాంగ్రెస్‌ పార్టీలోని అతివాద, మితవాద భిన్నాభిప్రాయాల వారందరు కలివిడిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ నాయకత్వంలో పనిచేశారు. 

నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన మైనార్టీ మితవాద, సామ్యవాద వ్యతిరేక, లౌకిక వ్యతిరేక శక్తులు; అభివృద్ధి మార్గాన్ని అనుసరిస్తున్న నాటి ప్రధాన మంత్రికి అడ్డంకులు, అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్‌లో చీలికొచ్చింది. దరిమిలా కాంగ్రెస్‌ (ఐ) ఆవిర్భవించి, చాలా కాలందాకా దేశ రాజకీయాల్లో కీలక మయింది. 137 ఏళ్ల తరువాత ఇప్పుడు దాని∙మనుగడే ప్రశ్నా ర్థకం అయింది. సామ్యవాద, లౌకికవాద విధానాలను గట్టిగా సమర్థించక పోవడమే దీనికి కారణమా? 

భారత జాతీయ కాంగ్రెస్‌లో విభేదాలు స్వాతంత్య్ర పూర్వ కాలం నుంచీ ఉన్నవే. అయినా అందరూ కాంగ్రెస్‌ గొడుగు కింద పనిచేసి, పార్టీ బలపడేందుకు కృషి చేశారు. ఆ రోజుల్లో ‘సిండి కేట్‌’గా సంబోధించబడే కాంగ్రెస్‌ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్‌కే పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు), కామరాజ్‌ నాడార్, సంజీవరెడ్డి లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహి రంగంగానే విభేదిస్తుండేవారు. బ్యాంకులను జాతీయం చేయ డానికి అతివాదులు మద్దతిస్తే, సిండికేట్‌ వర్గం వ్యతిరేకించింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న వర్గంవారు... ‘సామ్యవాద–లౌకికవాద’ విధానాలకు సిండికేట్‌ వర్గం వ్యతిరేకమనే భావనకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ సూచించిన వీవీ గిరి పేరును గానీ, జగజ్జీవన్‌ రాం పేరును గానీ పరిగణనలోకి తీసుకోకుండా నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటిం చాడు నిజలింగప్ప. తను సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డ్‌ ఎంపిక చేయడాన్నీ, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్నీ తప్పుబట్టారు ఇందిరాగాంధీ. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన విషయంలో ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పారామె. భవిష్యత్‌లో తాను తీసుకోదలచిన ఆర్థికపర మైన విధానాల అమలు బాధ్యతను మొరార్జీ మీద మోప లేనంటూ ఆయన్ను ఆర్థిక శాఖనుంచి తొలగించారు. మొరార్జీ రాజీనామా చేశాడు. 1969 జులై 19న దేశంలోని 14 భారీ వాణిజ్య బాంకులను జాతీయం చేయాలని ఇందిరాగాంధీ తీసు కున్న నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలకు దారితీస్తే... వామ పక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు. 

వీవీ గిరి స్వతంత్ర అభ్యర్థిగా, వామ పక్షాల మద్దతుతో, రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్న నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర, జనసంఘ్‌ (ఒకప్పటి భారతీయ జనతా పార్టీ) పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు ఇందిరాగాంధీ. ఆమె పక్షాన ఫకృద్దీన్‌ అలీ అహ్మద్, జగ్జీవన్‌ రాం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పార్లమెంట్, శాసనసభ సభ్యుల ఓటర్లకు ఆత్మ ప్రబోధం మేరకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయమని పిలుపివ్వడం జరిగింది.

రాష్ట్రపతి ఎన్ని కల్లో ఓటుహక్కు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వారందరికీ ఇందిరాగాంధీ 1969 ఆగస్ట్‌ 18న లేఖ పంపుతూ... ‘సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను తేవాలనీ, అమలుచేయాలనీ అనుకున్న ప్పుడల్లా, స్వప్రయోజన పరులు వాటిని వ్యతిరేకిస్తుంటారు’ అని పేర్కొని, వారందరి మద్దతు కోరారు. పార్టీ క్రమశిక్షణకు వ్యతి రేకంగా పనిచేశారని జగ్జీవన్‌ రాం, ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ లకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు నోటీసులు పంపారు. అధ్యక్షుడు ఇచ్చిన నోటీసును వారు సవాలు చేశారు. వీవీ గిరి రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో పార్టీపై ఇందిరాగాంధీకి ఉన్న ఆధిక్యత రుజువైంది.

తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా ఇందిరాగాంధీ మద్దతుదారుడైన సి. సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడంతో... దాన్ని సాకుగా చూపి, ఆయన్ను వర్కింగ్‌ కమిటీ సభ్యుడుగా కొనసాగే విషయంలో పేచీ పెట్టారు నిజలింగప్ప. నిజలింగప్ప తీసుకుంటున్న చర్యలు ఐక్యతా ఒప్పందానికి విరుద్ధమైనవని పేర్కొంటూ, ఇందిరాగాంధీ, వై బి చవాన్, జగ్జీవన్‌ రాం, ఫకృ ద్దీన్‌ అలీ అహ్మద్, ఉమాశంకర్‌ దీక్షిత్, సి. సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా లేఖను అధ్యక్షుడికి పంపారు. ఆ లేఖలో, సామ్య వాద, లౌకిక, అభివృద్ధికర విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనీ, అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, 1969 నవంబర్‌ 1న, సి. సుబ్రహ్మణ్యం, ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌లను సభ్యులుగా తొలగిస్తూ నిజ లింగప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో, ఇందిర మద్దతుదార్లు సమా వేశానికి హాజరు కాకుండా, ఆమె ఇంట్లో సమావేశ మయ్యారు. నవంబర్‌ 12న ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్ట డంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. ఇందిర మద్దతుదారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టి, నవంబర్‌ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ సమావేశా లను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కా లిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ చీలిపోయింది.

ఎమర్జెన్సీ అనంతరం 1977 మార్చ్‌ 16 – 20 మధ్యన జరి గిన ఎన్నికలలో ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో ఆమె నియోజక వర్గంలోనూ, దేశవ్యాప్తంగానూ ఓడిపోయారు. ఓట మితో కుంగిపోకుండా... పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికి పైగా తన వెంట ఉంచుకుని, మరోమారు కాంగ్రెస్‌ పార్టీని చీల్చి, కాంగ్రెస్‌ (ఐ)ని స్థాపించారు ఇందిర. అచిరకాలం లోనే ప్రధాని పదవిని చేపట్టారు మళ్లీ. ఇప్పుడున్నది ఆమె చీల్చి స్థాపించిన అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ (ఐ) నే కానీ స్వాతంత్య్ర కాలంనాటి అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ కాదంటే అతిశయోక్తి కాదేమో!

ఆ తరువాత రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోకుండా కొంత మనుగడ సాధిం చినప్పటికీ పూర్వ వైభవాన్ని సంతరించుకోలేకపోయింది. క్రమేపీ క్షీణించసాగింది. తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాలలో మొదటినించీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని దూరంగా పెట్ట డమో, ఇతర పార్టీల వారిని చేర్చుకుని అందలం ఎక్కించడమో చేయడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది.   

ఏదెలా ఉన్నా, సైద్ధాంతిక విభేదాలతో సామ్యవాద, లౌకిక, విధానాలను అమలు పరిచే కారణంతో పనిచేసిన అలనాటి కాంగ్రెస్‌ పార్టీకీ, ఇప్పటి పార్టీకీ ఎంత తేడా? అసలప్పటి కాంగ్రెస్‌ పార్టీ ఇంకా మిగిలి ఉందా? ఏదీ అప్పటి సామ్యవాద, లౌకిక కాంగ్రెస్‌ పార్టీ? హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీ గెలుపుతో ఇంకా కొంత ఆశ! ఎనిమిది పదుల వయసులో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్‌ పార్టీకి జవసత్త్వాలు తేగలరా? తేనిస్తారా? పార్టీలో నిర్ణయాధికారం ఆయనదవు తుందా? గాంధీ–నెహ్రూ కుటుంబ వారసత్వం చేతిలోని అధి ష్టానం అలా కానిస్తుందా? కోటి రూకల ప్రశ్న.

వనం జ్వాలా నరసింహారావు 
వ్యాసకర్త సీఎం చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ‘ తెలంగాణ 

Advertisement
Advertisement