మెట్రోమ్యాన్‌ లక్ష్యం నెరవేరేనా?

26 Feb, 2021 00:58 IST|Sakshi
మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ 

విశ్లేషణ

దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాంక్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్‌ ఇప్పుడు ముందుకొచ్చారు. మరి తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? శ్రీధరన్‌కి వయోపరిమితి అడ్డు రాదు. బీజేపీ వయోపరిమితి ఆంక్షలను చాలా సందర్భాల్లో సడలించేసింది. వామపక్షాలు మాత్రమే ఇప్పటికీ ఈ వయోపరిమితి నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం మన దేశంలోని రాజకీయ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని తమకు తాముగా ఉల్లంఘిస్తుంటాయి. 

దేశంలో అనేక సంక్లిష్టమైన బ్రిడ్జిలను, ప్రత్యేకించి అత్యంత ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన మాజీ రైల్వే అధికారి, మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. కానీ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికి వయస్సు ఆయనకు అడ్డంకేమీ కాలేదు. ఆయన వేసిన అడుగు సాహసోపేతమైనది కాబట్టే కొనియాడదగినది. కేరళలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండటం, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ చాలా దూరంలో ఉంటున్న నేపథ్యంలో శ్రీధరన్‌ నిర్ణయం అసాధారణమైందనే చెప్పాలి.

అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అశ్వమేధ యజ్ఞం ప్రకారం బీజేపీకి కేరళలో అధికారం చేజిక్కించుకోవడం చాలా కీలకమైన విషయం. దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాం క్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. కాబట్టి ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్‌ ఇప్పుడు ముందుకొచ్చారు. గవర్నర్‌ వంటి రాజ్యాంగ పదవులు చేపట్టడంపై తనకు ఆసక్తి లేదని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి వెనుకాడబోనని శ్రీధరన్‌ స్పష్టం చేశారు. ఇంతవరకు అంతా బాగుంది. ఎందుకంటే తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి?

కానీ ఇక్కడ ఒక అవరోధం ఉంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు, ఒక పుకారు వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే ఎన్నికల్లో గెలుపు సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు 75 ఏళ్లు దాటిన బీజేపీ సభ్యులకు మంత్రివర్గంలో చేరే అర్హత ఉండబోదని అప్పట్లో వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేవారికి అప్పట్లో వయోపరిమితిని పెట్టలేదు. కాబట్టే తమకు నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో మంత్రిపదవులు లభించబోవనే స్పష్టమైన అవగాహనతోటే లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీలను నాటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించారు. 

ఆ తర్వాత అడ్వాణీ, జోషీలు తమ నియోజకవర్గాలలో గెలిచి అయిదేళ్లపాటు పార్లమెంటులో నిస్సారమైన జీవితం గడిపారు. తర్వాత 2019లో రిటైర్‌ అయ్యారు. వారిని తర్వాక బీజేపీ మార్గదర్శక్‌ మండల్‌ సభ్యులను చేసిపడేశారు. అయితే ఈ మండల్‌ ఇంతవరకు ఒక్కసారికూడా భేటీకాలేదనుకోండి. రాజకీయాల్లో వీరి అద్భుతమైన ప్రయాణం చివరకు వారి సుప్రసిద్ధ శిష్యుడి (నరేంద్రమోదీ) చేతిలోనే ముగిసిపోయింది. అంటే అక్బర్‌/బైరాం ఖాన్‌ కథ మరోసారి ఇక్కడ పునరావృతమైంది. అయితే బైరాం ఖాన్‌ లాగా అడ్వాణీ, జోషీలు ఢిల్లీనుంచి బహిష్కరణకు గురి కాలేదు. పూర్తి సదుపాయాలతో, సంపూర్ణ భద్రతతో వీరు ప్రభుత్వ వసతి గృహంలో ఢిల్లీలో నివసించడానికి వీరిని అనుమతించారు. ఆ తర్వాత వారి గురించి నేను వినలేదు. ఇటీవలకాలంలో వారిని నేను కలిసిందీ లేదు. కానీ వారు ఆరోగ్యంతో పనిచేసుకుంటున్నట్లు ఆశిస్తాను.

ఇప్పుడు శ్రీధరన్‌ వద్దకు వద్దాం. ఏదేమైనప్పటికీ ఆయన ఒక అసాధారణమైన వృత్తినిపుణులు. ఆయన రాజకీయ జీవితంలోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టారు. బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితి గురించి అయనకు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా తెలిసి ఉండొచ్చు కూడా. అయితే ఈ నియమానికి కూడా ఇప్పటికే కొన్ని మినహాయిం పులు ఏర్పడ్డాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను ఎంపిక చేసినప్పుడు ఆ నిబంధనను బీజేపీ పాటించలేదు. ఆయన 75 ఏళ్లకు మించిన వయస్సులో కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఆయన నియామకం మాత్రం తప్పనిసరైంది. ఎందుకంటే కర్ణాటకలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు బేజీపీలో ఎవరూ లేరు. కొంతమంది అయితే ఈ నియమం కేంద్ర స్థాయిలోనే కానీ రాష్ట్రాల్లో వర్తించదని బలహీనమైన వాదనను తీసుకొస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం అంటే నరేంద్రమోదీ ఇంకా బీజేపీకి యజమాని కాకముందు, వామపక్షాలకు మల్లే రాజ్యసభకు ఎంపికయ్యే బీజేపీ సభ్యులను రెండుసార్లకు మాత్రమే పరిమితం చేయాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. అరుణ్‌ షౌరీ, శత్రుఘ్న సిన్హా వంటి బీజేపీ ప్రముఖులను మూడోసారి చట్టసభలోకి అడుగు పెట్టకుండా చేయడానికి ఉపయోగపడింది. కానీ పరిస్థితులు మారిపోయాక, పాలకుల వంతు వచ్చినప్పుడు, ఈ నియమం మళ్లీ మారింది. అప్పటికే చట్టసభల్లో ఉన్నవారికి మూడోసారి, నాలుగోసారి కూడా అవకాశం కల్పిం చారు. దివంగత సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ కూడా లేటు వయసులో ఈ జాబితాలో భాగమయ్యారన్నది వాస్తవం. కాబట్టి నియమాలు, వాటి పాటింపు గురించి చాలానే మాట్లాడుకున్నాం.

కాబట్టి శ్రీధరన్‌కి ఇప్పటికీ అవకాశం ఉంది. వయోపరిమితి ఆయనకు అడ్డు రాదు. దీంతో పోలిస్తే వామపక్షాలు ఇప్పటికీ ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. రాజ్యసభలో అసాధారణమైన పనితీరు ప్రదర్శించిన ప్రముఖ వామపక్ష నేతలు కూడా రెండు సార్లు చట్టసభకు ఎన్నికయ్యాక పల్లెత్తు మాటనకుండా రాజ్యసభ నుంచి తప్పుకుని తమతమ పార్టీల నిర్ణయాన్ని గౌరవించారు. సీతారాం ఏచూరి కూడా ఇప్పుడు అదే వరసలో ఉంటున్నారు. వామపక్షాలు ఈ నియమాన్ని తమకు తాముగా రూపొందించుకోవడమే కాకుండా దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నందుకు వారంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. అంతేకానీ మీ ముఖం నాకు చూపించండి, మీకు వయోపరిమితి నిబంధనను చూపిస్తాను అనే రకంగా ఉండే బీజేపీ నినాదాన్ని వామపక్షాల ఆచరణతో పోల్చి చూద్దాం మరి.

అయితే బీజేపీ ఏదైనా సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఈ 75 సంవత్సరాల వయోపరిమితిని తీసుకురాలేదు. ఒకే ఒక వ్యక్తి ఆదేశంలో ఇది ఇలా ముందుకొచ్చింది. ఆ సమయంలో నూతన పాలకుల అధికార బలాన్ని అడ్డుకోలేని పలువురు సీనియర్‌ నేతలకు రంగంనుంచి తప్పించుకోవడానికి ఈ వయోపరిమితి చాలా సులభమైన మార్గంగా ఉపయోగపడేది. ఈ నియమంతో వ్యవహరించడం చాలా సులభం. ఇప్పుడు ఈ నియమం లక్ష్యం నెరవేరిది. ఎందుకంటే మనుషుల కోసమే నియమాలు తయారవుతాయి కానీ నియమాల కోసం మనుషులు తయారు కారు కదా.. అమెరికాలో దేశాధ్యక్షుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హుడు కాదు. అందుచేతనే చాలామంది అమెరికా అధ్యక్షులు చాలా తక్కువ వయస్సులోనే అధ్యక్ష పదవిని చేపట్టేవారు.

వారితో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ 78 సంవత్సరాల వయస్సులో గద్దెనెక్కడం ప్రత్యేక విషయమే అనుకోండి. భారత్‌లో, అలాంటి పదవీ కాల పరిమితులు లేదు. పదవి, ఆఫీసులో పనిచేసే కాలం విషయంలో మనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. కానీ మనకు కూడా అలాంటి పరిమితులు విధిస్తేనే బావుం టుందా? నేనయితే కచ్చితంగా చెప్పలేను. ప్రజాస్వామ్యంలో మనం ఇలాంటి విషయాలను ప్రజలకు వదిలేయకూడదా? అయితే ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం ఆ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని ఉల్లంఘిస్తుంటాయి. ఇకపోతే శ్రీధరన్‌ విషయానికి వస్తే, వయసుతో సహా ఆయన్ని వెనక్కు లాగే అవకాశాలు లేవు. కాబట్టి కేరళ ప్రజలు కోరుకుంటే ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. ఇది జరగాలంటే వారు రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాల్సి ఉంటుంది మరి.


వ్యాసకర్త బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా
(ఎన్డీటీవీ సౌజన్యంతో...)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు