Sakshi News home page

విజయకీలాద్రిపై ప్రారంభమైన తిరు నక్షత్ర మహోత్సవం

Published Sun, Nov 12 2023 1:48 AM

- - Sakshi

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్నజీయర్‌ స్వామి తిరు నక్షత్ర మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. సాయంత్రం 4గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్రం గిరిపరిక్రమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిక్రమణలో అహోబిల రామా నుజ జీయర్‌స్వామి, దేవనాద రామానుజ జీయర్‌స్వామి, జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు, జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ వేదవిద్యార్థులు పాల్గొన్నారు. త్రిదండి చిన్నజీయర్‌ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.

14 నుంచి జాతీయ

గ్రంథాలయ వారోత్సవాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 14 నుంచి అరండల్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి కె.ఝాన్సీలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 శాఖా గ్రంథాలయాల్లో సైతం వారోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. వారం రోజులపాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పుస్తక ప్రదర్శన, మహిళా దినోత్సవం, మెహందీ పోటీలు, కవి సమ్మేళనం, చర్చాగోష్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌, మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

ద్రోణాదుల ఉపాధ్యాయుడికి బెస్ట్‌ టీచర్‌ అవార్డు

మార్టూరు: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ద్రోణాదుల ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షేక్‌ జానీబాషా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం జగన్‌ సమక్షంలో జరిగిన వేడుకల్లో భాగంగా జానీబాషా పురస్కారం అందుకున్నారు. జానీ బాషాను ఎంఈవో వస్రాం నాయక్‌ ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

సాగునీటి సమాచారం

తాడేపల్లిరూరల్‌ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శనివారం 3800 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్‌ కాలువకు 212, బ్యాంక్‌ కెనాల్‌కు 1001, తూర్పు కెనాల్‌కు 115, పశ్చిమ కెనాల్‌కు 77, నిజాంపట్నం కాలువకు 260, కొమ్మమూరు కాల్వకు 1611 క్యూసెక్కులు విడుదల చేశారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 524.60 అడుగుల వద్ద ఉంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840.80 అడుగుల వద్ద ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement