కల్యాణం.. క‘మనీ’యం | Sakshi
Sakshi News home page

కల్యాణం.. క‘మనీ’యం

Published Fri, Nov 24 2023 1:38 AM

- - Sakshi

గుంటూరు వెస్ట్‌: పేద కుంటుంబాల్లో వివాహ భారాన్ని తన బాధ్యతగా భావిస్తూ ఆర్థిక చేయూతనందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా పథకం నాలుగో విడత నిధుల జమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు వర్చువల్‌ విధానంలో వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌–2022 నుంచి ఈ పథకం రాష్ట్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు. పేద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ, మైనారిటీలతోపాటు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు. ఒక్కొక్క జంటకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు అందుతున్నాయన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా వధువు తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి జమ చేశారని పేర్కొన్నారు. జిల్లాలో 348 జంటలకు రూ.3.10 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టు వెల్లడించారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1,296 జంటలకు రూ.11.65 కోట్ల మేర లబ్ధి చేకూరిందని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ వధూవరులను ఆశీర్వదించారు. లబ్ధిదారులకు కలెక్టర్‌, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కోలా భవాని, డెప్యూటీ మేయర్‌ షేక్‌ సజిల, సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ ఝాన్సీ, ఆర్‌అండ్‌బీ డైరెక్టర్‌ పిల్లి మేరి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ షేక్‌ ఆబిదా బేగం, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌ కొత్త వధూవరులకు నమూనా చెక్కును అందజేశారు.

వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా సాయం జమ 348 జంటలకు లబ్ధి రూ.3.10 కోట్లు విడుదల

Advertisement
Advertisement