ఇంజక్షన్‌ వికటించి.. రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ మృతి | Sakshi
Sakshi News home page

ఇంజక్షన్‌ వికటించి.. రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ మృతి

Published Wed, Sep 20 2023 1:10 AM

- - Sakshi

హసన్‌పర్తి: ఇంజక్షన్‌ వికటించి ఓ రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందారు. ఈ ఘటన హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగింది. చింతగట్టుకు చెందిన రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ నద్దునూరి సారయ్య(65) చికిత్స నిమిత్తం సోమవారం మండల కే ంద్రంలోని ‘శంకర్‌’ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శంకర్‌.. సారయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రెండు ఇంజక్షన్లు ఇవ్వగా సారయ్య ఒకసారిగా కుప్పకూలారు. దీంతో సారయ్యను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ప్రిస్కిప్షన్‌ ఇవ్వమని..
ఇదిలా ఉండగా సారయ్యకు ప్రథమ చికిత్స సందర్భంగా ఉపయోగించిన మందుల ప్రిస్కిప్షన్‌ ఇవ్వాలని 108 సిబ్బంది.. వైద్యుడి శంకర్‌ను కోరారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న మృతుడి కుమారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్‌ శంకర్‌పై దాడికి దిగారు. అనంతరం డాక్టర్‌ శంకర్‌ను అంబులెన్స్‌లో ఎంజీఎంకు తీసుకెళ్లారు. కాగా, ఎంజీఎంలో సారయ్యను పరీక్షించిన వైద్యులు.. అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే సారయ్యకు పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో వైద్యుడు శంకర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సారయ్య కుమారుడు రాజేంద్రప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపి తెలిపారు.

జిల్లా వైద్యాధికారుల విచారణ
ఇంజక్షన్‌ వికటించి మృతి చెందిన ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మధన్‌మోహన్‌, సీఐ గోపి విచారణ చేపట్టారు. ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సారయ్యకు ఇచ్చిన ఇంజక్షన్‌పై ఆరా దీశారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కాలం చెల్లిన ఇంజక్షన్లు, మందులు గుర్తించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్వహణ
ఆస్పత్రి నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మధన్‌మోహన్‌ తెలిపారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదునెలల క్రితం ఇంజక్షన్‌ వికటించి ఓ బాలుడు మృతి చెందడంతో ఆస్పత్రి సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే అక్రమంగా ఆస్పత్రి నిర్వహిస్తున్నారని చెప్పారు. కాగా, ఐదు నెలల క్రితం ఆస్పత్రి సీజ్‌ చేసినా సేవలు కొనసాగిస్తున్న డాక్టర్‌ శంకర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఆస్పత్రి సీజ్‌
‘శంకర్‌’ ఆస్పత్రిని సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ ప్రసాద్‌, డీటీ రహీం, ఆర్‌ఏ ప్రణయ్‌.. ఆస్పత్రికి సీల్‌ వేశారు. వైద్యాధికారులు వాణిశ్రీ, విజమ్‌రావు, ఏఎస్‌వో ప్రసన్నకుమార్‌, హెల్త్‌ అసిస్టెంట్లు కందుకూరి సంతోష్‌కుమార్‌, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement