అమిత్‌ షా పర్యటన సాగిందిలా.. | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా పర్యటన సాగిందిలా..

Published Sun, Nov 19 2023 1:00 AM

- - Sakshi

బీజేపీ ఓరుగల్లు సకలజనుల విజయ సంకల్ప సభకు హాజరైన జనం, నమస్కరిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

ఖిలా వరంగల్‌ :

న్నికల ప్రచారం మొదలయ్యాక తొలిసారి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వరంగల్‌కు రావడం ఆపార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఖిలా వరంగల్‌ మైదానంలో శనివారం జరిగిన బీజేపీ ఓరుగల్లు సకల జనుల విజయ సంకల్ప సభకు జనం నుంచి భారీగా స్పందన రావడంతో ఆ పార్టీ నాయకులు ఖుషీలో ఉన్నారు. అమిత్‌షా ప్రసంగం మొత్తం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ.. కేంద్ర సంక్షేమంపై సుదీర్ఘంగా సాగింది. సభ ప్రారంభానికి ముందే భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్‌ షా నేరుగా కాన్వాయ్‌లో సభా మైదానానికి చేరుకున్నారు. వేదికపైకి చేరుకుని హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి నియోజకవర్గాల అభ్యర్థులను పరిచయం చేసి ప్రసంగం మొదలుపెట్టారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తే తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపిస్తే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పగా.. సభకు వచ్చిన జనం చప్పట్లు, కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. ఓరుగల్లుకు గొప్ప చరిత్ర ఉందని, కాకతీయుల కళారాజ్యంలో భద్రకాళి, రామప్ప వంటి ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, అలాంటి పుణ్య భూమిపై అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజల ప్రగతి కోసం ఎంతో చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రావు పద్మ, డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు, కొండేటి శ్రీధర్‌, కంభంపాటి పుల్లారావు, కీర్తిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ పాలనపై విమర్శల వెల్లువ

పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ నాశనం చేశారని అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. సర్వ సంపన్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ పాలనలో అవినీతి, కుంభకోణాలతో అప్పులకుప్పగా మార్చారని దుమ్మెత్తి పోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయలో అవినీతి, అతిపెద్ద కుంభకోణం జరిగిందని, ఇలా లెక్కబెట్టాలంటే వారం రోజులు పడుతుందని ఆరోపించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికి రోగి చనిపోయినా.. పట్టింపులేదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రూ.వేల కోట్లు కేటాయించి అభివృద్ధిలో వరంగల్‌ను ముందుంచుతామని హామీ ఇచ్చారు. ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు డాక్టర్‌ రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి, జయపాల్‌, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, లక్ష్మీప్రసాద్‌, కుసుమ సతీశ్‌, గంట రవికుమార్‌, అల్లం నాగరాజు, కందిమల్ల మహేశ్‌ పాల్గొన్నారు.

తూర్పును గూండాల నుంచి కాపాడాలి : బీజేపీ అభ్యర్థి ప్రదీప్‌రావు

వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని గూండాల రాజ్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తూర్పు అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఆజంజాహి మిల్లును అమ్మి, సెంట్రల్‌ జైలును కుదువపెట్టినందున వరంగల్‌ ప్రజలు, యువతకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని డ్రెయినేజీలు, నాలాలు ఆక్రమణకు గురికావడంతో చిన్నపాటి వర్షానికే వీధులన్నీ జలమయమవుతున్నాయన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో డబుల్‌ అభివృద్ధి చేయడమే కాకుండా కేంద్రం నుంచి భారీ పరిశ్రమలను తీసుకువస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఓరుగల్లు సకలజనుల విజయ సంకల్ప సభ సక్సెస్‌

బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా సాగిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగం

కేసీఆర్‌ అవినీతి పెరిగిపోయిందని, కక్కిస్తామని వ్యాఖ్యలు

కేంద్రం కేటాయించిన నిధులు, సంక్షేమ పథకాలపై వివరణ

వరంగల్‌ ఎంజీఎంకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ

డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తేనే మరింత అభివృద్ధి

వరంగల్‌ పుణ్యభూమిపై అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడి

సాయంత్రం 4.20 గంటలకు హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రాక

4.32 గంటలకు: ఖిలా వరంగల్‌ వాకింగ్‌ గ్రౌండ్‌ సభ వద్దకు..

4.36 గంటలకు : ప్రసంగం ప్రారంభం.

4.54 గంటలకు: ప్రసంగం ముగింపు

4.55 గంటలకు: ఎయిర్‌పోర్ట్‌కు వాహనంలో బయల్దేరిన అమిత్‌ షా

5.10 గంటలకు : ఎయిర్‌పోర్ట్‌నుంచి హైదరాబాద్‌కు పయనం

వరంగల్‌ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావును గెలిపించాలని కోరుతున్న అమిత్‌ షా
1/3

వరంగల్‌ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావును గెలిపించాలని కోరుతున్న అమిత్‌ షా

2/3

3/3

Advertisement
Advertisement